అవిశ్వాస తీర్మానం ద్వారా ఇమ్రాన్ ఖాన్ ప్రధాన మంత్రి పదవిని కోల్పోయిన తర్వాత, జాతీయ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆ పదవికి ఎన్నుకోవడంతో గత రాత్రి కొత్త ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన షెహబాజ్ షరీఫ్ పాకిస్థాన్ కు మూడు సార్లు ప్రధానిగా పనిచేసిన అన్న నవాబ్ షరీఫ్ మద్దతుతోనే ఆ పదవి చేపట్టగలిగారనడంలో సందేహం లేదు.
అయితే ప్రస్తుతం అవినీతి కేసులో జైలు శిక్షకు గురై, ప్రవాసంలో లండన్ లో గడుపుతున్న నవాబ్ షరీఫ్ కు కొత్త ప్రధానిగా తన తమ్ముడైన, పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పిఎంఎల్-ఎన్) పార్టీ అధ్యక్షుడు షెహబాజ్ షరీఫ్ ను చేయడం మొదటి ప్రాధాన్యత కాదని తెలుస్తున్నది.
2017లో మూడుసార్లు ప్రధానిగా ఉన్న నవాజ్ షరీఫ్‌ను సుప్రీం కోర్టు పదవీచ్యుతుడ్ని చేసినప్పుడు, మిగిలిన 10 నెలల ప్రధానమంత్రి పదవికి షెహబాజ్ కంటే తన పార్టీ నాయకుడు షాహిద్ ఖాకాన్ అబ్బాసీకి ప్రాధాన్యత ఇవ్వడం గమనార్హం. ఇప్పుడు కూడా తన రాజకీయ వారసురాలిగా కుమార్తె మరియమ్ కు ప్రధాని పదవి కట్టబెట్టాలని కోరుకున్నారు.
అయితే అవెన్‌ఫీల్డ్ అవినీతి కేసులో ఆమె దోషిగా తేలినందున, ఆమె ప్రధాని పదవి చేపట్టేందుకు న్యాయపరమైన చిక్కులు ఏర్పడడంతో తమ్ముడిని అత్యున్నత కార్యనిర్వాహక పదవికి నామినేట్ చేయడం తప్ప మరో మార్గం లేకపోయిన్నట్లు చెబుతున్నారు.
డెబ్బై ఏళ్ల షెహబాజ్ దేశంలో అత్యధిక జనాభా కలిగిన, రాజకీయంగా కీలకమైన పంజాబ్ ప్రావిన్స్‌కు మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. హార్డ్-కోర్ రియలిస్ట్ గానే కాక, వాస్తవాలకు దగ్గరగా అడుగులు వేస్తారని ప్రతీతి. నవాజ్ షరీఫ్ ప్రధానమంత్రి పదవికి ఆయన పేరును అంగీకరించడం ఇదే మొదటిసారి.
మాజీ అధ్యక్షుడు, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పిపిపి) కో-చైర్ అసిఫ్ అలీ జరాద్రీ అవిశ్వాస తీర్మానం ద్వారా ఇమ్రాన్ ఖాన్ స్థానంలో ఉమ్మడి ప్రతిపక్షాల సమావేశంలో షెహబాజ్ పేరును మొదటిసారిగా ప్రధానమంత్రి పదవికి ప్రతిపాదించారు. దానితో నవాబ్ కు సహితం ఆమోదించక తప్పలేదు.
లాహోర్‌లోని పంజాబీ మాట్లాడే కాశ్మీరీ కుటుంబంలో సెప్టెంబర్ 1951లో జన్మించిన షెహబాజ్ 1980ల మధ్యలో తన అన్న నవాజ్‌తో కలిసి రాజకీయాల్లోకి ప్రవేశించాడు. 1988లో నవాజ్ పంజాబ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన తొలిసారిగా పంజాబ్ అసెంబ్లీ సభ్యునిగా ఎన్నికయ్యారు. 1997లో తన సోదరుడు కేంద్రంలో ప్రధానిగా ఉన్నప్పుడు షెహబాజ్ తొలిసారిగా పంజాబ్ ముఖ్యమంత్రి అయ్యారు.
1999లో నవాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని కూల్చివేసిన జనరల్ పర్వేజ్ ముషారఫ్ తిరుగుబాటు తరువాత, షెహబాజ్ 2007లో పాకిస్తాన్‌కు తిరిగి రావడానికి ముందు సౌదీ అరేబియాలో ఎనిమిది సంవత్సరాలు ప్రవాసంలో గడిపారు. రెండవ సారి 2008లో, మూడవసారి 2013లో ముఖ్యమంత్రి పదవిని కైవసం చేసుకున్నాడు.
తన అన్నయ్య నవాజ్‌ను విడిచిపెట్టినట్లయితే, జనరల్ ముషారఫ్ తనకు ప్రధానమంత్రి పదవిని ఇవ్వజూపినట్లు షెహబాజ్ గతంలో వెల్లడించారు. అయితే ఆ ప్రతిపాదనను తాను వెంటనే తిరస్కరించానని చెప్పారు.
పనామా పేపర్స్ కేసులో 2017లో ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ పదవికి అనర్హుడయిన తర్వాత, పిఎంఎల్-ఎన్ పార్టీ అధ్యక్షుడిగా షెహబాజ్‌ను నియమించారు. తదనంతరం, 2018 ఎన్నికల తర్వాత ఆయన జాతీయ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడయ్యారు.
సెప్టెంబరు 2020లో, షెహబాజ్ని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం అతనిపై మోపిన మనీలాండరింగ్, ఆదాయానికి మించిన ఆదాయ ఆరోపణలపై యాంటీ-గ్రాఫ్ట్ బాడీ – నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో అరెస్టు చేసింది. షెహబాజ్ ఆరోపణలను ఖండించారు. వాటిని రాజకీయ బలిపశువుగా అభివర్ణించారు. బెయిల్ రాకముందు కొన్ని నెలల పాటు జైలులోనే ఉన్నాడు.
ప్రస్తుతం, అతను యుకెలో పికెఆర్ 14 బిలియన్ల మనీలాండరింగ్ కేసును అతనిపై పాకిస్తాన్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ నమోదు చేసింది. ఈ కేసులో బెయిల్‌పై కూడా ఉన్నారు. నవాజ్ కుమార్తె, పిఎంఎల్-ఎన్ ఉపాధ్యక్షురాలైన మర్యమ్ నవాజ్, తన బాబాయి నిస్వార్థంగా, అవిశ్రాంతంగా దేశానికి సేవ చేసిన వ్యక్తి అని కొనియాడారు.
“వ్యక్తిగతంగా, రాజకీయంగా అత్యంత దారుణంగా హింసించబడినప్పటికీ, తన సోదరుడికి విధేయత చూపుతూ ఒక ఉదాహరణగా నిలిచిన వ్యక్తి. ఇప్పటికీ, ఎప్పుడూ నాకు రెండవ తండ్రిగా ఉండే వ్యక్తి” అంటూ బాబాయి గురించి చెప్పింది.