వివిధ దేశాల సైనిక వ్యయాలతో పోల్చి చూసినట్లైతే అమెరికా, ప్రపంచ భద్రతకు అతిపెద్ద ముప్పుగా తయారైందని చైనా ఆందోళన వ్యక్తం చేస్తున్నది. జీవాయుధ ప్రయోగశాలలకు నిధులు సమకూర్చడం ద్వారా, యుద్ధాలను రెచ్చగొట్టడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా సంక్షోభాలను పెచ్చరిల్లేలా చేయడంలో అమెరికా కీలకపాత్ర పోషిస్తోందని చైనా అధికారిక వార్త పత్రిక గ్లోబల్ టైమ్స్ పేర్కొంది.
అమెరికా తన గుత్తాధిపత్యాన్ని కొనసాగించుకునేందుకుగానూ ఏళ్ల తరబడి ప్రపంచవ్యాప్తంగా సంక్షోభాలను ఎలా రెచ్చగొట్టిందీ అందులో వివరించింది. అమెరికా 240 ఏళ్ల చరిత్రలో కేవలం 16 సంవత్సరాలు మాత్రమే ఎలాంటి యుద్ధం లేకుండా వుందని ఆ వ్యాసం పేర్కొంది. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన నాటి నుండి ప్రపంచంలో కెల్లా అమెరికా అత్యంత శక్తివంతమైన దేశంగా మారింది.
అప్పటి నుండి 2001 వరకు ప్రపంచవ్యాప్తంగా 153 ప్రాంతాల్లో జరిగిన 240 సాయుధ ఘర్షణల్లో 201 ఘర్షణలను అమెరికానే ప్రారంభించింది. ఉక్రెయిన్‌లో బయలాజికల్ లేబరేటరీల నిర్వహణ కోసం 20 కోట్ల డాలర్లకుపైగా మొత్తాలను అమెరికా కేటాయించిందని పేర్కొంటూ ఇందుకు సంబంధించిన పత్రాలను రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఆ నేపథ్యంలో అమెరికా జీవాయుధాల పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమైంది. కాగా దీనిపై అమెరికాలో మిశ్రమ ప్రతిస్పందన ఎదురైంది. అమెరికా విదేశాంగ శాఖ రాజకీయా వ్యవహారాల డిప్యూటీ మంత్రి విక్టోరియా నులాండ్ స్పందిస్తూ, ఉక్రెయిన్‌లో అటువంటి పరిశోధనా కేంద్రాలున్నాయని అంగీకరించారు. వైట్‌హౌస్ ప్రతినిధి జెన్ సాకి స్పందిస్తూ ఇదంతా రష్యా వ్యాప్తి చేస్తున్న తప్పుడు సమాచారమని వ్యాఖ్యానించారు.
వాస్తవానికి, రష్యా, చైనా జనాభాల నుంచి జన్యు నమూనాలను సేకరించడానికి ఈ బయోలాజికల్ లేబరేటరీలు ఉద్దేశించబడ్డాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ రెండు దేశాల్లో జాతి ప్రక్షాళన సాగించే లక్ష్యంతో బాక్టీరియా దాడి చేపట్టాలని కోరుకుంటున్నట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు.