దేశంలో ఎక్కడున్నా భారత్‌యేనని, ఉత్తరాది మాత్రమే భారతదేశం కాదని ప్రముఖ సంగీత దర్శకుడు ఎఆర్ రెహ్మాన్ స్పష్టం చేశారు. చెన్నై నగరంలో సిఐఐ ఆధ్వర్యంలో దక్షిణ్ పేరిట నిర్వహించిన ‘సౌత్ ఇండియా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్’ లో రెహ్మాన్‌ను ‘ది ఐకాన్’ పురస్కారంతో సత్కరించారు.
ఈ సందర్భంగా ఎఆర్ రెహ్మాన్ మాట్లాడుతూ ఏడేళ్ల కిందట మలేషియా వెళ్లగా తనతో ఓ చైనీయుడు ఉత్తర భారతదేశం బాగుంటుందని చెప్పారని, వారి చిత్రాలను ఇష్టపడి చూస్తానని చెప్పినట్లు తెలిపారు. ఆ మాటలు విని ఆయన దక్షిణ భారతదేశ చిత్రాలు చూశారా? అనే ప్రశ్న తనకు కలిగిందని పేర్కొన్నారు.
తమిళ చిత్రాల మాదిరిగానే మలయాళం, ఇతర చిత్రాలు కూడా ఉంటాయని తెలిపారు. దేశంలో ఎక్కడున్నా భారత్‌యేనని, అందులో ఉత్తర, దక్షిణ అని వేర్వేరుగా లేవని చెప్పారు. దక్షిణ భారతదేశ చిత్రాల్లో నల్లగా ఉండేవారికి ఉత్తమ, బలమైన కథాపాత్రలు ఇవ్వాలని, అందరికీ మన రంగే ఇష్టమని తెలిపారు.
తమిళమే భారతదేశ అనుబంధ భాష అని రెహ్మాన్ పేర్కొన్నారు. హిందీ భాషపై ఇటీవల కేంద్రమంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టేలా రెహ్మాన్ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
అనంతరం కేంద్రమంత్రి మురుగన్ మాట్లాడుతూ భారత చిత్రపరిశ్రమ అభివృద్ధికి కేంద్రం పలు సన్నాహాలు చేపట్టిందని పేర్కొన్నారు. పలు అనుమతులను సరళీకృతం చేసేందుకు ప్రయత్నాలు చేపట్టిందని తెలిపారు.
దర్శకుడు కార్తిక్ సుబ్బురాజ్ మాట్లాడుతూ ప్రస్తుత రోజుల్లో పాటలే సినిమాకు గుర్తింపు ఇస్తున్నాయని పేర్కొంటూ ఇవి ప్రచారసాధనాల కన్నా ఎక్కువ ప్రభావం చూపుతున్నాయని తెలిపారు.