ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ వివాదాస్పద వ్యాఖ్యల కేసులను ప్రజాప్రతినిధుల కోర్టు కొట్టేసింది. రెండు కేసుల్లో అక్బరుద్దీన్ ఒవైసీ నిర్దోషి అని తేల్చింది కోర్టు. అయితే విద్వేష పూరిత ప్రసంగం మళ్లీ చేయరాదని హెచ్చరించింది. కేసులు కొట్టేసినంత మాత్రాన సంబరాలు చేస్కోవద్దని కోర్టు స్పష్టం చేసింది.
పదేళ్ల క్రితం ఎంఐఎం సభలో అక్బర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
‘‘మీరు వంద కోట్ల మంది అయితే మేము కేవలం పాతిక కోట్లు మాత్రమే.. ఓ 15 నిముషాలు మాకు అప్పగించండి.. ఎవరు ఎక్కువో, తక్కువో చూపిస్తామంటూ వ్యాఖ్యానించారు.’ ఈ కేసును సుదీర్ఘంగా విచారించిన నాంపల్లి కోర్టు బుధవారం తీర్పు వెలువరించింది.
ఎలాంటి ఆధారాలు పోలీసులు సమర్పించక పోవడం వల్లే కోర్టు కేసును కొట్టేసిందని అక్బరుద్దీన్ తరపు న్యాయవాది తెలిపారు. అయితే సుదీర్ఘ విచారణలో 38 మంది సాక్షులను విచారించిన కోర్టు ఎస్ఎఫ్ఎల్ రిపోర్టు ను సైతం పరిశీలించినట్లు తెలుస్తోంది.
నిజామాబాద్, నిర్మల్ జిల్లాలో పదేళ్ల కింద అక్బరుద్దీన్ చేసిన కామెంట్స్ పై తీవ్ర దుమారం రేగింది. ఈ ప్రసంగం విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉందంటూ పోలీసులు ఐపీసీ 120 బీ, 153 ఏ, 295, 188 సెక్షన్ల కింద సుమోటోగా కేసులు నమోదు చేశారు. ఈ కేసులో 2013 జనవరి 8న అరెస్టయిన అక్బరుద్దీన్ 40 రోజుల పాటు జైల్లో ఉన్నారు.
ఈ రెండు కేసులకు సంబంధించి నిర్మల్ లో మొదటగా నమోదైన ఎఫ్ఐఆర్ ను మాత్రమే ప్రధాన కేసుగా భావించి నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టులో విచారణ చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో కోర్టులో విచారణ పదేళ్లపాటు సుదీర్ఘంగా విచారణ జరిగింది.
అక్బరుద్దీన్ ఒవైసీపై నమోదైన విద్వేష వ్యాఖ్యల కేసులను నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టు కొట్టేయడం ఊరట కలిగించింది. పాతబస్తీలో మంగళవారం నుంచే పోలీసులు భారీ సంఖ్యలో మొహరించడంతో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ ఏర్పడింది. ఎలాంటి పరిణామాలు ఏర్పడినా ఎదుర్కొనేలా పోలీసులు చేసిన హడావుడి ఉత్కంఠ రేపింది.
ముఖ్యంగా చార్మినార్, మక్కా మసీద్, చాంద్రాయణ గుట్ట వద్ద పరిస్థితిని పోలీసు ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతో ఏం జరగబోతోందోనన్న ఉత్కంఠ పరిస్థితి ఏర్పడింది. అయితే కోర్టు తీర్పు ఎలా వచ్చినా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంతో పాతబస్తీలో ప్రశాంతంగా ఉంది. కేసులను కొట్టేస్తూ తీర్పు రావడంతో ఉత్కంఠకు తెరపడింది.
ఎమ్మెల్యే అక్బరుద్దీన్ కేసును కావాలనే నీరుగార్చారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దుయ్యబట్టారు. టీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ కుమ్కక్కు రాజకీయాలకు ఇదే నిదర్శనమని ఆరోపియన్చారు. ప్రజలు ఈ మూడు పార్టీలకు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. నిర్మల్ కేసుపై తక్షణమే అప్పీల్‌కు ప్రభుత్వం వెళ్లాలని ఆయన డిమాండ్ చేశారు. అక్బరుద్దీన్ వ్యాఖ్యలను ప్రపంచమంతా చూసిందని, అయినా నిర్దోషిగా ప్రకటించడం ఆశ్చర్యంగా ఉందని బండి సంజయ్ పేర్కొన్నారు.
కాగా, అక్బరుద్దీన్ ఓవైసీపై నాంపల్లి కోర్ట్ ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ కు వెళ్లాలని విశ్వహిందూ పరిషద్ తెలంగాణ డిమాండ్ చేసింది. నిర్మల్, నిజామాబాద్ బహిరంగ సభలలో హిందువులపై, దేశంపై యుద్ధం ప్రకటించే విధంగా, దేవీదేవతలు కించపరిచే విధంగా మాట్లాడిన అక్బరుద్దీన్ కు చట్ట ప్రకారం సైరైన శిక్ష పడాలని స్పష్టం చేసింది. సాక్ష్యాధారాలను ప్రవేశపెట్టడంతో టి ఆర్ ఎస్ ప్రభుత్వం, పోలీసులు విఫలమైన ఫలితంగానే నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానం ఈ కేసును కొట్టివేసినదని పరిషత్ రాష్ట్ర అధికార ప్రతినిధి రావినూతల శశిధర్ స్పష్టం చేశారు.