అధ్యక్ష కార్యాలయాన్ని ముట్టడించిన ఆందోళనకారులతో సమావేశం కావడానికి శ్రీలంక ప్రధాని మహిందా రాజపక్సా ముందుకొచ్చారు. దేశ ఆర్థిక, సామాజిక, రాజకీయ వ్యవస్థల ఇబ్బందులను పరిష్కరించడానికి వారికి గల ఆలోచనలు ఏంటో వినడానికి తాను సిద్ధంగా వున్నానని చెప్పారు.
ప్రధాని సోదరుడు అధ్యక్షుడు రాజపక్సా రాజీనామాను డిమాండ్ చేస్తూ ఆందోళనకారులు వరుసగా ఐదో రోజూ కార్యాలయాన్ని ముట్టడించారు. అవినీతి, తప్పుడు పాలన వల్లనే ఈ పరిస్థితి దాపురించిందంటూ మొత్తంగా వారి కుటుంబం అధికారం నుండి వైదొలగాలని కోరుతున్నారు.
కాగా ప్రధాని చేసిన ఆఫర్ను కొంతమంది ఆందోళనకారులు తిరస్కరించారు. దేశంలోని మెజారిటీ ప్రజలు తిరస్కరిస్తున్న సమయంలో అనుభవజ్ఞుడైన రాజకీయ నేత మొత్తంగా గద్దె దిగడానికి చూడాలి కానీ చర్చలు జరిపేందుకు సిద్ధపడకూడదని ఉపాధ్యాయుడైన నువాన్ కాలురచి వ్యాఖ్యానించారు.
మొత్తంగా రాజపక్సా కుటుంబం అధికారాన్ని వీడాలన్నది ఈ దేశ ప్రజల ఏకగ్రీవ డిమాండ్ అని స్పష్టం చేశారు. ఇదిలావుండగా, శ్రీలంక విదేశీ రుణాలను భరించలేనిదిగా అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) అంచనా వేసిందని ఆర్థిక శాఖ అధికారులు తెలిపారు. కరెంట్ ఖాతాలో విదేశీ రుణ చెల్లింపులు వుండడం వాస్తవిక విధానం కాదని వ్యాఖ్యానించింది.
కాగా, ఐఎంఎఫ్ నుండి సాయం కోరడంతో పాటుగా భారత్, చైనాలను కూడా సాయం కోసం ప్రభుత్వం ఆర్ధించింది. నిత్యావసరాలు, ఔషధాలు కొనుగోలు చేసేందుకు 10మిలియన్ల డాలర్లను ప్రపంచ బ్యాంక్ అందచేసింది. అదనపు నిధుల కోసం ఆరోగ్య మంత్రిత్వ శాఖ డబ్ల్యుహెచ్ఓ, ఆసియాభివృద్ధి బ్యాంకులతో చర్చలు జరుపుతోంది.
మందులు విరాళంగా ఇవ్వాల్సిందిగా లేదా వాటిని కొనుగోలు చేసేందుకు నిధులు అందించాల్సిందిగా విదేశాల్లోని శ్రీలంక జాతీయులను కోరినట్లు సమాచార విభాగం తెలిపింది.