తెలుగు అలయెన్సెస్ అఫ్ కెనడా (తాకా) ఆధ్వర్యంలో శ్రీ సీతారామ కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. టొరంటోలోని శృంగేరి విద్యా భారతి ఫౌండేషన్ ఆడిటోరియంలో దాదాపు 600 మందికి పైగా భక్తులు హాజరవ్వగా, మేళతాళాలు, కూచిపూడి నాట్యము, పాటలు, భజనలతో అత్యంత వైభవంగా శ్రీ సీతారాముల వారి కళ్యాణం జరిగింది.
ఆదివారం, ఏప్రిల్ 10 వ తేదీ ఉదయం 9 గంటలకు కల్యాణోత్సవాలు ప్రారంభమయ్యాయి. తాకా అధ్యక్షులు కల్పన మోటూరి, కార్యవర సభ్యులు, ట్రస్టీలు, వ్యవస్థాపక సభ్యులు ఉదయము 6 గంటలకు వేడుక వద్దకు చేరుకొని .. పూజా కార్యక్రమాల కోసం అన్నింటిని సిద్ధం చేశారు. ఇందులో తాకా యువ కార్యకర్తలు సాయం అందించారు.
టొరంటోలోని ప్రముఖ అర్ఛకులు మంజునాథ్ సిద్ధాంతి, వారి శిష్య బృందంతో సుప్రభాత సేవ, అభిషేకం, షోడశోపచార పూజలతో స్వామి వారి కల్యాణాన్ని మొదలు పెట్టి, తలంబ్రాలు తదితర క్రతువులతో కార్యక్రమాన్నిముగించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు కార్యక్రమాలు వీక్షకులకు కనువిందు చేశాయి. నాగేంద్రన్ బృందం సన్నాయి డోలును శ్రావ్యంగా వినిపించారు.
ఈ కార్యక్రమంలో అలంకృత ఎలమర్తి (సుప్రభాతం), షాలిని చెరకుల,మయూఖ, శ్రీముఖి లక్కవజ్జుల, కృతి కవికొండల, రంజిత హంసాల,అనిత సజ్జ, హాసిని,ఆశ్రిత సామంతుల, సీరం గొర్తి వివిద గీతములు పాడగా , మరియు ప్రియాంక కూచిపూడి నృత్యం సర్వోపచారములలో భాగంగా కల్యాణ మహోత్సవం లో పాల్గొని భక్తుల అభినందనలు పొందారు.
టొరంటోలో జరిగిన ఈ కార్యక్రమానికి 57 మంది జంటలు కల్యాణానికి కూర్చొన్నారు. దాదాపు 5 గంటల పాటు జరిగిన ఈ కార్యక్రమము చివరగా మంగళ హారతులు పాడి , తీర్థ ప్రసాదాలు భక్తులందరికి అంద చేసారు. ఈ కార్యక్రమ విజయవంతం కావడానికి ఉపాధ్యక్షులు నాగేంద్ర హంసాల, కార్యదర్శి ప్రసన్న తిరుచిరాపల్లి, కోశాధికారి మల్లికార్జున చారి పదిర, సాంస్కృతిక కార్యదర్శి రాజారామ్ మోహన్ రాయ్, బోర్డు ఆఫ్ ట్రస్టీ చైర్మన్ మునాఫ్ అబ్దుల్, వ్వ స్థాపక చైర్మన్ రవి వారణాసి,తదితరులు విశేషంగా కృషిచేశారు.