రష్యా యుద్ధ నౌక.. మిస్సైల్ క్రూయిజర్ మాస్క్వా తీవ్ర స్థాయిలో ధ్వంసమైంది. నల్ల సముద్రంలో ఉన్న రష్యా నౌకా దళానికి చెందిన యుద్ధ నౌక మాస్క్వాపై భారీ పేలుడు జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఆ క్రూయిజ్ నౌకను తామే నెప్ట్యూన్ మిస్సైల్స్‌తో పేల్చినట్లు ఉక్రెయిన్ చెబుతోంది. ఆ యుద్ధ నౌకలో సుమారు 510 మంది సిబ్బంది ఉన్నారని, వారిని రష్యా రక్షించలేకపోయినట్లు ఉక్రెయిన్ తెలిపింది. బ్లాక్ సీలోని స్నేక్ ఐలాండ్ వద్ద ఉన్న మాస్క్వా క్రూయిజ్ నౌకపై దాడి జరిగినట్లు ఉక్రెయిన్ వెల్లడించింది.
కానీ ఆ నౌకలో పేలుడు జరిగినట్లు రష్యా చెబుతోంది. దానిలో ఉన్న సిబ్బంది ఆ యుద్ధనౌకను వదిలి వెళ్లినట్లు రష్యా అంగీకరించింది. యుద్ధ నౌకలో మందుగుండు సామగ్రి పేలడంతో ఈ ప్రమాదం జరిగిందని రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. పేలుడుకి గల కారణాలపై దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపింది. సిబ్బంది మాత్రం సురక్షితంగా బయటపడినట్లు వెల్లడించింది.
అయితే రష్యా యుద్ధనౌకపై తామే క్షిపణితో దాడి చేశామని ఉక్రెయిన్ ప్రకటించగా రష్యా ఈ ప్రకటనను తోసిపుచ్చింది. మేరియుపోల్, ఒడెస్సా వంటి తీర ప్రాంత నగరాలను లక్ష్యంగా చేసుకుంటోన్న రష్యా సేనలు దాడుల కోసం యుద్ధ నౌకలను తరలిస్తున్నాయి. ఉక్రెయిన్ తీరప్రాంతానికి రష్యాకు చెందిన మాస్క్వా క్రూజ్ చేరుకోగానే దానిపై క్షిపణితో దాడికి పాల్పడినట్లు ఒడెస్సా గవర్నర్ ప్రకటించారు.
మాస్క్వా మిస్సైల్ క్రూయిజర్‌ను 1980 దశకంలో నిర్మించారు. ఉక్రెయిన్‌లోని మైకోలేవ్ నగరంలో ఆ నౌకను తయారు చేశారు. సోవియేట్ నౌకాదళంలో ఈ నౌక కీలక పాత్ర పోషించింది. ఇది సుమారు 186 మీటర్ల పొడుగు ఉంటుంది. దీన్ని మొదట్లో స్లావా అని పిలిచేవారు. ఆ తర్వాత మాస్క్వా అని పిలుస్తున్నారు.
మాస్క్వా అంటే మాస్కో అన్న అర్థం వచ్చేలా ఈ క్రూయిజర్‌కు పేరు పెట్టారు. ఈ నౌకలోని ప్రధాన ఆయుధం పీ-1000 వోల్కన్ యాంటీ షిప్ మిస్సైల్స్. అయితే నల్ల సముద్రంలో 2000 నుంచి రష్యాకు కీలకమైన నౌకగా సేవలు అందిస్తోంది. 2015లో సిరియాపై జరిగిన యుద్ధంలో ఈ యుద్ధ నౌక రష్యా ప్రధాన అస్త్రంగా నిలిచింది. ఇప్పుడీ నౌక పేలిపోవడం రష్యాకి పెద్ద దెబ్బే అని చెప్పాలి.