ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల (పీపీపీ) భాగస్వామ్యంతో సివిల్ ఏవియేషన్ (ఏరోనాటికల్), ఫార్మసీ యూనివర్శిటీలని ఏర్పాటు చేయడానికి తెలంగాణ మంత్రివర్గం ఇటీవల నిర్ణయం తీసుకొంది. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) తరహాలో ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాలుగా నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది. సివిల్ ఏవియేషన్ విశ్వవిద్యాలయాన్ని బేగంపేటలోని పాత విమానాశ్రయంలో, ఫార్మసీ విశ్వవిద్యాలయాన్ని ఫార్మాసిటీ ఏర్పాటవుతున్న యాచారం, మహేశ్వరం ప్రాంతాల్లో ప్రారంభించే యోచనలో ప్రభుత్వం ఉంది.
ఫార్మసీ వర్శిటీ ఏర్పాటులో రాష్ట్రంలో పేరొందిన ఫార్మా కంపెనీలు హెటిరో డ్రగ్స్, రెడ్డీ ల్యాబ్స్, ఎంఎస్ఎన్ ఫార్మా, అరబిందో, లారస్ ల్యాబ్స్, దివిస్, భారత్ బయోటెక్, బయాలజికల్-ఈ వంటి సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుని, ఈ విద్యా సంవత్సరం నుంచే ఈ వర్సిటీలో తరగతులు నిర్వహించేందుకు చర్యలు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.
బి.ఫార్మసీ, ఫార్మా-డి కోర్సులతో పాటు ఫార్మా కంపెనీలకు అవసరమైన సాంకేతిక నిపుణులను అందించేందుకు అవసరమైన కోర్సులు సిద్ధం చేసి ఈ ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయంలో ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి తోడు పార్మా రంగంలో పరిశోధనలు మరింత పెంచాలన్న సంకల్పంతో ఉన్న ప్రభుత్వం ఈ విశ్వవిద్యాలయంలో రీసెర్చ్ కోర్సు (పీహెచ్డీ)లు కూడా ప్రవేశపెట్టాలని నిర్ణయించింది.
వర్శిటీ ఏర్పాటుకు మహేశ్వరం, యాచారం ప్రాంతాల్లో వంద ఎకరాలు సమీకరించనుంది. ఈ విద్యా సంవత్సరం తరగతుల నిర్వహణకు హైదరాబాద్‌లో తాత్కాలిక భవనాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని ప్రతిపాదించింది. ఈ వర్శిటీ పరిధిలోకి రాష్ట్రంలోని ఫార్మసీ కళాశాలలను కూడా తీసుకువచ్చే చర్యలపై ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తోంది.
ఇప్పటిదాకా ఈ కళాశాలలు ఉస్మానియా, జేఎన్టీయూ, కాకతీయ విశ్వవిద్యాలయాల పరిధిలో పని చేస్తున్నాయి. జేఎన్టీయూను కేవలం సాంకేతికపరమైన విశ్వవిద్యాలయంగా పరిగణించి ఈ వర్సిటీ కిందకు ఇంజనీరింగ్, ఎంటెక్ వంటి కోర్సులను మాత్రమే తీసుకురావాలన్న ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉంది.
భారత ఫార్మసీ మండలి (పీసీఐ) అధికారులతో సంప్రదింపులు జరిపి ఫార్మా యూనివర్సిటీలో ప్రారంభించే కోర్సులపై ఒక నిర్ణయానికి రావాలని భావిస్తున్నారు. విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు ఖర్చు చేసే మొత్తంలో 50 శాతం ప్రభుత్వం భరించాలని, మిగతా సగం ఫార్మా కంపెనీల భాగస్వామ్యాన్ని తీసుకోవాలని ప్రతిపాదిస్తున్నట్టు తెలుస్తోంది.
ప్రతిపాదించిన ఫార్మసీ విశ్వవిద్యాలయంలో 50 శాతం సీట్లు స్థానిక విద్యార్థులకు ఇవ్వాలన్న ప్రతిపాదన పరిశీలనలో ఉంది. మిగతా 50 శాతం సీట్లు జాతీయ స్థాయిలో నిర్వహించి ఎంపిక పరీక్ష ద్వారా భర్తీ చేస్తారు. వార్షిక ఫీజును విశ్వవిద్యాలయం నిర్ణయిస్తుంది.
మిగతా విశ్వవిద్యాలయాల్లో ఉన్నట్టు ఫార్మసీ వర్సిటీకి పాలక మండలిని ప్రభుత్వం నియమిస్తుంది. ఇందులో పరిశ్రమలు, మౌలిక సదుపాయాల శాఖ ముఖ్య కార్యదర్శితో పాటు ఫార్మా రంగంలో పేరెన్నికగన్న వారిని ఎంపిక చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
ప్రభుత్వం ప్రతిపాదించిన సివిల్ ఏవియేషన్ విశ్వవిద్యాలయాన్ని కూడా ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బేగంపేటలోని పాత విమానాశ్రయంలో ఈ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. వర్సిటీ తరగతుల నిర్వహణకు అవసరమైన భవనాలు, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండడంతో వెంటనే వర్సిటీ కార్యకలాపాలు ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది.
ప్రైవేట్ విమానయాన సంస్థలు ఎయిరిండియా, ఇండిగో, స్పైస్‌జెట్, ఎమిరేట్స్, సిల్క్ ఎయిర్‌లైన్స్‌తో పాటు అంతర్జాతీయ విమానయాన సంస్థలు సైతం ఈ విశ్వవిద్యాలయంలో భాగస్వామ్యం అయ్యేందుకు తహతహ లాడుతున్నట్టు తెలుస్తోంది.
ప్రైవేట్ విమానయాన సంస్థల్లో వందలాది ఉద్యోగాలు అందుబాటులో ఉండడం, వీటికి జాతీయ స్థాయిలో పోటీ ఉండడంతో స్థానికులు ఆశించిన స్థాయిలో ఉపాధి అవకాశాలు పొందలేకపోతున్నారని ప్రభుత్వం నిర్వహించిన ఒక అధ్యయనంలో తేలింది.
పైలెట్‌తో పాటు ఎయిర్ హోస్టెస్, ఇతర సాంకేతికపరమైన ఉద్యోగాల కల్పనకు అవసరమైన డిప్లమా, పీజీ డిప్లమా, డిగ్రీ, పీజీ కోర్సులు ప్రారంభించాలని ప్రతిపాదించింది. విదేశాల్లో ఉన్న ఎయిర్‌లైన్స్ సంస్థల్లో ఉన్న ఉద్యోగాలకు మన విద్యార్థులు పోటీ పడేలా సరికొత్త కోర్సులను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం ప్రతిపాదించింది.
రాష్ట్రంలో ఉన్న ఏవియేషన్ ఇంజనీరింగ్ కళాశాలలను ఈ విశ్వవిద్యాలయం పరిధిలోకి తీసుకొచ్చే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. త్వరలో ఇందుకు సంబంధించిన విధి విధానాలను ఖరారు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.