దేశం లోని 14 మంది మాజీ ప్రధానులకు అంకితం చేసిన కొత్త మ్యూజియం “ప్రధాన మంత్రి సంగ్రహాలయ” ను గురువారం ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ప్రారంభించారు. దాన్ని సందర్శించేందుకు తొలి ప్రవేశ టికెట్‌ను ఆయన కొనుగోలు చేశారు.
దేశ రాజధాని ఢిల్లీ లోని తీన్‌మూర్తి ఎస్టేట్‌లో ఈ మ్యూజియం ఉంది. అభివృద్ధి చెందుతోన్న భారత్‌ను ప్రతిబింబించేలా ఈ మ్యూజియంను రూపొందించారని అధికారులు తెలిపారు. 14 మంది ప్రధానుల గురించి వారి సేవల గురించి, వారు అనుసరించిన సిద్ధాంతాలు, ఇవన్నీ అవగాహన కల్పించేందుకు ఈ మ్యూజియాన్ని అభివృద్ధి చేశారు.
ఇదే సమయంలో స్వాతంత్య్ర పోరాట ఘట్టాలను కూడా తెలుసుకునే ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శన కోసం అధునాతన సాంకేతికతను వినియోగించారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ మ్యూజియాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. ఇప్పటి వరకు భారత ప్రధానిగా పనిచేసిన వారందరికీ ఈ మ్యూజియంను గత ప్రధాన మంత్రులకు అంకితం చేశారు.
భారతదేశానికి ప్రధానమంత్రులుగా పనిచేసిన వారిలో చాలా మంది సామాన్య కుటుంబాల నుంచి వచ్చినవారేనని, అది గర్వించదగిన విషయమని ప్రధాని మోదీ ఈ సందర్భంగా చెప్పారు. 75 ఏళ్లలో దేశం ఎన్నో మరపురాని ఘట్టాలను చూసిందని తెలిపారు. అలాంటి ఎన్నో విశేషాలను ప్రధానమంత్రి సంగ్రహాలయలో చూడొచ్చని ఆయన పేర్కొన్నారు. పార్టీలకతీతంగా దేశాన్ని పాలించిన ప్రధానమంత్రులందరి సేవలనూ గుర్తించడమే సంగ్రహాలయం ఉద్దేశమని చెప్పారు.
మన దేశం నేటి ఉన్నత స్థితికి చేరడం వెనుక స్వాతంత్య్రానంతరం ఏర్పడిన అన్ని ప్రభుత్వాల కృషి ఉందని చెబుతూ ఒకట్రెండు మినహాయింపులు తప్పిస్తే ప్రజాస్వామ్య విధానాలను బలోపేతం చేయడంలో దేశం గర్వించదగ్గ సంప్రదాయాన్ని నెలకొల్పిందని కొనియాడారు.
పలువురు మాజీ ప్రధానమంత్రుల కుటుంబసభ్యులు పాల్గొన్న ఈ కార్యక్రమానికి గాంధీ కుటుంబం హాజరు కాలేదని ప్రధాని కార్యాలయం తెలిపింది. కార్యక్రమానికి హాజరైన దివంగత ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె సురభి వాణీదేవి తన తండ్రి కళ్లద్దాలను మ్యూజియంకు అందజేశారు. దివంగత నేతకు కాంగ్రెస్ సముచిత గౌరవం ఇవ్వలేదంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న పీవీ మనవడు, బీజేపీ నేత ఎన్వీ సుభాష్ ఆవేదన వ్యక్తం చేశారు.