ఇప్పటికే అనేక సమస్యలతో సతమతమవుతున్న కర్ణాటక బిజెపి ప్రభుత్వంకు ఓ సీనియర్ మంత్రి, తిరిగి ముఖ్యమంత్రి పదవి కోసం పోటీపడుతున్న కె ఎస్ ఈశ్వరప్పపై అవినీతి ఆరోపణలు చేసి సంతోష్ పటేల్ ఆత్మహత్యకు పాల్పడటం ఇరకాట పరిస్థితి సృష్టిస్తోంది. ఈ విషయమై ఈశ్వరప్ప ప్రతిపక్షాల ఆందోళనలు ఉధృతం అవుతూ ఉండడంతో తప్పక రాజీనామా చేయవలసి రావడంతో రాష్ట్రంలో బిజెపి ప్రతిష్ట అవినీతి మరక పెను సవాళ్లు ఎదుర్కొంటున్నది.
రాజీనామా చేసే ప్రసక్తి లేదని ప్రకటించిన మరుసటి రోజే, గురువారం నాడు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఈశ్వరప్ప రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాజీనామా చేయాలన్న ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఆదేశాల మేరకు రాజీనామా చేసినట్లు ప్రకటించారు. తన రాజీనామా లేఖను శుక్రవారం ముఖ్యమంత్రికి అందజేస్తానని ఈశ్వరప్ప ప్రకటించారు.
రాజీనామా చేసినా ప్రభుత్వంపై పడిన అవినీతి మరకను చెరిపేసుకోవడం అంత సులభం కాబోదు. రాజీనామా విషయంలో బిజెపి సత్వరం నిర్ణయం తీసుకోలేక పోవడంతో రాజకీయంగా ఆ పార్టీ కొంత మూల్యం చెల్లించుకోవలసి పరిస్థితి ఏర్పడింది.
ఇలా ఉండగా, కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ ఆత్మహత్య నేపథ్యంలో నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప స్వచ్ఛందంగా రాజీనామా చేయనున్నారని సీఎం బొమ్మై గత రాత్రి ప్రకటించారు. సంతోష్ ఆత్మహత్య ఘటనతో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమని మంత్రి ఈశ్వరప్ప తనకు వివరించారని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో నిర్దోషిగా తేలేంతవరకు మంత్రి బాధ్యతలకు దూరంగా ఉంటానని ఆయన తెలిపారని, ఇందుకు తాను కూడా అంగీకరించానని చెప్పారు.
ఐటీవల తలెత్తిన హిజాబ్, దేవాలయాల ఉత్సవాల వద్ద ముస్లిం దుకాణాలకు అనుమతి నిరాకరణ, హలాల్ వంటి వివాదాలతో `హిందుత్వ’ ఎజెండాతో రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించి, తిరిగి వచ్చే ఎన్నికలలో అధికారమలోకి రావడం కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఈ దుర్ఘటన శరాఘాతంగా పరిణమించింది.
సంతోష్ పాటిల్ హిందూ వాహిని జాతీయ కార్యదర్శి కావడమే కాకుండా, బిజెపి సభ్యుడు కూడా అని తెలుస్తున్నది. రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం ఏర్పాటు కోసం కృషిచేసిన లక్షలాదిమంది కార్యకర్తలలో ఒక్కరు. తాను కోరుకున్న ప్రభుత్వంలో తననే అవినీతి కాటేయడాన్ని తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు స్పష్టం అవుతున్నది.
రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఈశ్వరప్ప ప్రభుత్వం మంజూరు చేసిన రోడ్డు ప్రాజెక్టుకు మొత్తం వ్యయంలో 40 శాతం లంచం డిమాండ్ చేశారని సంతోష్ ఆరోపించడం ప్రతిపక్షాలకు బలమైన ఆయుధం ఎన్నికల ముందు అందించినట్లు అవుతుంది. అయితే ఈ ఆరోపణలను ప్రభుత్వం, ఈశ్వరప్ప తీవ్రంగా ఖండిస్తున్నప్పటికీ జరుగవలసిన నష్టం రాజకీయంగా జరిగిన్నట్లు చెప్పవచ్చు.
సంతోష్ ఆరోపణలలో వాస్తవాలు ఏవిధంగా ఉన్నప్పటికీ బిజెపి ప్రభుత్వంలోని పెద్దలపై బిజెపికి మద్దతుగా నిలబడుతున్న వారితో సహా అనేకమంది కాంట్రాక్టర్లు ఇటువంటి అవినీతి ఆరోపణలు కొంతకాలంగా చేస్తున్నారు. బిఎస్ యడ్డ్యూరప్ప వంటి బలమైన ప్రజాకర్షణ గల నేత లేకపోవడంతో మంత్రులపై ఇటువంటి ఆరోపణలపై తీవ్రంగా స్పందించేందుకు వ్యక్తిగతంగా నిజాయతీపరుడిగా పేరొందినప్పటికీ ముఖ్యమంత్రి బొమ్మై నిస్సహాయంగా మిగ్లిన్నట్లు స్పష్టం అవుతుంది.
కాంట్రాక్టుల సంఘం ఆరోపణ
ప్రభుత్వ ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న కాంట్రాక్టర్లు, బీజేపీ మద్దతుదారులుగా గుర్తింపు పొందిన వారితో సహా కర్ణాటక ప్రభుత్వంపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు కొంతకాలంగా చేస్తున్నారు. 2019లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ప్రాజెక్టు వ్యయంలో 40 శాతం లంచంగా అడుగుతున్నారని కర్ణాటక రాష్ట్ర కాంట్రాక్టర్ల సంఘం చాలా నెలలుగా ఆరోపిస్తోంది.
కర్నాటక జిల్లాల నుండి లక్ష మందికి పైగా సభ్యులను కలిగి ఉన్న ఈ సంఘం ఈ విషయమై జోక్యం చేసుకోవాలని కోరుతూ మార్చి 22న ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకి మరో లేఖను పంపింది. గత ఏడాది కాలంగా ప్రధాని నరేంద్ర మోదీ, గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్లకు కూడా అనేకసార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ, ఈ వ్యవస్థను మార్చేందుకు ఎవరూ ఆసక్తి చూపలేదని కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు.
రోడ్డు ప్రాజెక్టుకు క్లియరెన్స్ ఇవ్వడానికి మొత్తం వ్యయంలో 40 శాతం లంచం అడిగారని అంటూ సంతోష్ పాటిల్ తాజాగా చేసిన ఆరోపణ ఇప్పుడు అన్ని ప్రభుత్వ పరిధిలోని శాఖలకు వ్యాపించినట్లు కాంట్రాక్టర్ల సంఘం ఆరోపిస్తున్నది. చాలా దశాబ్దాల క్రితం స్థానిక కాంట్రాక్టర్లకు కాంట్రాక్టర్లు 2 శాతం లంచం ఇవ్వాల్సి వచ్చెడిదని కర్ణాటక రాష్ట్ర కాంట్రాక్టర్ల సంఘం అధ్యక్షుడు కెంపన్న తెలిపారు.
2018-19 మధ్య కాంగ్రెస్ హయాంలో 10 శాతం కమీషన్ గా ఇచ్చేవారమని, ఇప్పుడు 40 శాతంకు పెరిగిందని స్పష్టంగా చెబుతున్నారు. తాజాగా ఈ మొత్తం 45 శాతంకు పెరిగిన్నట్లు కూడా ఆరోపిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని “10 శాతం కమీషన్ ప్రభుత్వం”గా ప్రధాని నరేంద్ర మోదీ ఎద్దేవా చేయడం గమనార్హం. `అవినీతిపై పోరాటం’ ఎజెండాతో ప్రజల ముందుకు వస్తున్న బిజెపి నాయకత్వాన్ని ఈ పరిణామం ఆత్మరక్షణలో పడవేస్తున్నట్లు చెప్పవలసిందే.