వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మార్పులు చేసిన మంత్రివర్గంలో నెల్లూరు జిల్లా నుండి కాకాని గోవర్ధనరెడ్డి మంత్రిగా ప్రమాణస్వీకారం చేసి, కీలకమైన వ్యవసాయ శాఖను చేపట్టిన రెండు రోజులకే నెల్లూరులో ఓ కోర్ట్ లో దొంగతనం జరగడం, ఆయనపై నమోదైన ఓ కేసు సంబంధించిన కీలక పత్రాలు అదృశ్యం కావడం దిగ్బ్రాంతి కలిగిస్తున్నది.
టిడిపికి చెందిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విదేశాలలో వేల కోట్ల రూపాయల వివిలువైన ఆస్తులు సమకూర్చుకున్నారని అంటూ గోవర్ధన్ రెడ్డి డిసెంబర్, 2017లో చేసిన ఆరోపణలపై ఆయన కోర్టులో పరువు నష్టం దావా వేశారు. తన ఆరోపణలకు మద్దతుగా గోవర్ధనరెడ్డి సమర్పించిన పత్రాలు నకిలీవని, ఫోర్జరీ చేసినవని సోమిరెడ్డి ఆరోపించారు.
ఆయన ఆరోపణలను నిర్ధారిస్తూ పోలీసులు సహితం తమ దర్యాప్తు నివేదికను కోర్టుకు సమర్పించారు. ఛార్జ్ షీట్ ను కూడా దాఖలు చేశారు. ఈ కేసులో సాక్ష్యంగా చూపుతున్న పత్రాలను అపహరించడం కోసమే ఈ దొంగతనం జరిగిందని టిడిపి ఎమ్యెల్యే, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పయ్యావుల కేశవ్ ఆరోపించారు.
నకిలీ పత్రాలు సృష్టించిన కేసులో శిక్ష పడుతుందని తెలిసే కోర్టులో ఉన్న ఆధారాలను మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి చోరీ చేశారని సోమిరెడ్డి ఆరోపించారు. దీనిపై హైకోర్టు వెంటనే జోక్యం చేసుకుని నిందితుల బెయిల్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇది ఒక జాతీయ స్థాయి కేసని.. ఈ కేసు విచారణ ప్రస్తుతం నడుస్తోందని ఆయన గుర్తుచేశారు.
ఈ కేసు విచారణకు రానున్న తరుణంలో గోవర్ధనరెడ్డి మంత్రి కావడం, ఆ పత్రాలు అదృశ్యం కావడం విస్మయం కలిగిస్తోంది. బహుశా దేశ చరిత్రలోనే మొదటిసారిగా ఓ కోర్టులో ఇటువంటి దొంగతనం జరిగింది. రాజకీయంగా కీలకమైన ఓ కేసుకు సంబంధించిన పత్రాలు, ఎలక్ట్రానిక్ పరికరాలను ఎత్తుకుపోయారు.. ఈ ఘటనతో నెల్లూరు పోలీసులు ఉలిక్కిపడ్డారు. రాజకీయ ఆరోపణలు రావడంతో అప్రమత్తమయ్యారు.
సమీపంలోని ఒక కాలువలో ఓ బ్యాగ్ ను, అందులోని కొన్ని పత్రాలను పారవేయడాన్ని కనుగొన్నారు. అంటే నగదు, విలువైన వస్తువుల కోసం ఈ దొంగతనం జరగలేదని, ఓ కేసుకు సంబంధించిన పత్రాలను మాయం చేయడం కోసమే జరిగినదని భావించవలసి వస్తుంది.
నెల్లూరు లోని నాలుగవ అదనపు మెజిస్ట్రేట్ కోర్టులో దొంగతనం జరగడంతో జిల్లా ఎస్పీ సీహెచ్ విజయరావు నేరుగా రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. దొంగతనం జరిగిన కోర్టు ప్రాంగణాన్ని ఎస్పీ బృందం శుక్రవారం పరిశీలించింది. కీలక పత్రాలు ఎక్కడ ఉన్నాయి ? ఎక్కడ నుంచి దొంగిలించారు ? ఎలా చేశారు ? అనే కోణంలో పరిశీలన చేపట్టారు.
ఈ కేసు చిన్నబజారు పోలీసుస్టేషన్ పరిధిలోనిది కావడంతో ఇటీవల బదిలీపై వెళ్లిన ఇన్స్పెక్టరు మధుబాబును రంగంలోకి దించారు. బుధవారం రాత్రి దొంగతనం జరిగినట్లు కోర్టు బెంచ్ క్లర్క్ ఇచ్చిన ఫిర్యాదుతో చిన్నబజారు పోలీసులు రంగంలోకి దిగి కూపీ లాగుతున్నారు.
కోర్టు ఆవరణలో సీసీటీవీ కెమెరాలు లేకపోవడంతో కేసును ఛేదించడం కష్టమైనప్పటికీ, కోర్టు బయట రహదారులపై ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజిని చిన్నబజారు పోలీసులు పరిశీలించారు. దొంగలు బుధవారం అర్ధరాత్రి రెండు, మూడు గంటల మధ్య సమయంలో కోర్టులో దొంగతనం చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
కోర్టుకు వెళ్లే అన్నివైపులా రహదారులపై ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించగా ఇద్దరు అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు గుర్తించారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా పోలీసుల అదుపులో ఉన్న ఇద్దరూ పాత నేరస్థులే అని తెలుస్తున్నది .
రెండు నెలల కిందట రాయాజీవీధిలో జరిగిన ఓ చోరీ కేసులో ఈ ఇద్దరూ నిందితులు. వీరిద్దరూ స్నేహితులు కావడం గమనార్హం. గతంలో ఓ వృద్ధురాలిని కట్టేసి బంగారు నగలు దొంగిలించారు. అప్పట్లో వీరిపై దోపిడీ కేసు కాకుండా, నామమాత్రపు కేసు మాత్రమే పోలీసులు నమోదు చేశారు. జైలు నుంచి విడుదల చేసిన తర్వాత వీరు కోర్టులో దొంగతనం చేసినట్లు తెలుస్తోంది. వీరిద్దరూ బండిపై ఉల్లిపాయలను అమ్ముతుంటారు. త్వరలోనే పోలీసులు ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించే అవకాశముంది.