తరచూ వివాదాలకు గురయ్యే పంజాబ్ ముఖ్యమంత్రి భగవత్ మాన్ తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. మద్యం సేవించి ఓ గురుద్వారాలో ప్రవేశించారని ఆయనపై పోలీసులుకు ఫిర్యాదు చేశారు. బీజేపీ నేత తజీందర్ పాల్ సింగ్ బగ్గా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేయడం పంజాబ్లో కలకలం రేపుతోంది.
సీఎం భగవంత్ మాన్ ఏప్రిల్ 14వ తేదీన మద్యం సేవించి గురుద్వారాలోకి ప్రవేశించారని తజీందర్ సింగ్ తెలిపారు. దేశవ్యాప్తంగా జరుపుకునే బైసాఖీ సందర్భంగా పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ మద్యం సేవించిన స్థితిలో తఖ్త్ దమ్దామా సాహిబ్లోకి ప్రవేశించారని శిరోమణి గురుద్వారా పర్బంధక్ కమిటీ (ఎస్జిపిసి) అంతకుముందు శుక్రవారం ఆరోపించింది.
దీంతో తాజాగా బీజేపీ నేత బగ్గీ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఈ క్రమంలోన సీఎం క్షమాపణలు చెప్పాలని కమిటీ డిమాండ్ చేసింది. ఈ సందర్బంగా భగ్గా ట్విట్టర్ వేదికగా తన ఫిర్యాదు మేరకు సీఎంపై చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు.
‘అతనో పచ్చి తాగుబోతు.. డ్రగ్స్ కూడా వాడతారు.. నిత్యం నిషాలో జోగుతుండే వ్యక్తి. బఫూన్ వేశాలేసుకునేటోడు. అతన్నే గనుక గెలిపిస్తే పంజాబ్ మొత్తాన్నీ మత్తులో ముంచేస్తాడు.. ’ ఇదీ.. ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థులు భగవంత్ మాన్పై చేసిన ఆరోపణ.
కాగా, భగవంత్ మాన్ మద్యం సేవించి పార్లమెంటుకు వచ్చేవారని ఆరోపణలున్నాయి. సహచర ఎంపీలు ఆయన నుంచి వచ్చే మద్యం వాసన భరించలేక ఫిర్యాదులు కూడా చేశారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రత్యర్థి నేతలు.. ‘అతనో పచ్చి తాగుబోతు.. డ్రగ్స్ కూడా వాడతాడు.. నిత్యం నిషాలో జోగుతుండే మాన్ను గెలిపిస్తే పంజాబ్ మొత్తాన్నీ మత్తులో ముంచేస్తాడని ఆరోపించారు.
అయితే.. రెండేళ్ల క్రితం బర్నాలాలో జరిగిన ఒక ర్యాలీలో తాను ఇక మద్యం జోలికి వెళ్లనంటూ ప్రజలందరి మధ్య ప్రతిజ్ఞ చేశారు. మద్యం మానేశానని, ప్రజాప్రతినిధిగా, పంజాబ్ సీఎంగా కళ్లు నెత్తికెక్కించుకోకుండా.. బాధ్యతగా మసలుకుంటానని ఎన్నికల ప్రచారంలో మాన్ ప్రజలకు చెప్పారు.