వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్ పరీక్ష నుంచి తమిళనాడుకు మినహాయింపు ఇవ్వాలంటూ గతేడాది సెప్టెంబర్‌లో ప్రభుత్వం బిల్లును ఆమోదించి గవర్నర్‌కు పంపించింది. అయితే దీనిపై ఎటూ తేల్చకుండా గవర్నర్ తాత్సారం చేశారు.
విమర్శలు రావడంతో చివరకు సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా ఉన్నదంటూ ఆ బిల్లును అసెంబ్లీ పరిశీలనకు ఈ నెల 3న గవర్నర్ తిరిగి పంపారు. దీంతో ఫిబ్రవరి 8న మరోసారి రెండో బిల్లును అసెంబ్లీలో ఆమోదించి గవర్నర్ ఆమోదానికి పంపారు. అయితే దీనిని కూడా గవర్నర్ రవి పక్కన పెట్టారు.
దీంతో విద్యార్థుల ప్రయోజనాలను పట్టించుకోకుండా గవర్నర్ వ్యవహరిస్తున్నారని ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తంచేసింది. బిల్లును రెండోసారి కూడా గవర్నర్ ఆర్ఎన్ రవి ఆమోదించకపోవడంతో ప్రభుత్వం భగ్గుమన్నది. దీంతో బిల్లును ఆమోదించేవరకు రాజ్‌భవన్‌కు తాము దూరంగా ఉంటామని ప్రకటించింది.
ఈ క్రమంలో రాజ్‌భవన్‌లో నిర్వహించిన ఎట్ హోం కార్యక్రమాన్ని కూడా బహిష్కరించింది. ఈ నేపథ్యంలో శనివారం పార్టీ అధికారిక పత్రికలో గవర్నర్ వ్యవహార శైలిపై ఎడిటోరియల్ ప్రచురించింది. గవర్నర్ తీరు చూస్తుంటే తాను రాష్ట్రపతిగా భావిస్తున్నారని విమర్శించింది.
తమిళనాడు అసెంబ్లీ పాస్ చేసిన బిల్లును ఆమోదించి, దానిని రాష్ట్రపతికి పంపించడం గవర్నర్ విధి. అయితే దానిని నిర్వర్తించడంలో విఫలమయ్యారు. ఆర్ఎన్ రవిని కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొన్నది. అసలు నీట్ బిల్లును ప్రభుత్వం ఎందుకు తీసుకురావల్సి వచ్చిందనే విషయాలను కూడా ఆ వ్యాసంలో వివరించింది.
తాజాగా అధికార డీఎంకేకి చెందిన మురసోలి పత్రిక గవర్నర్ తీరుపై విరుచుకుపడింది. ‘గవర్నర్ సర్.. మీరు రాష్ట్రపతి కాదు. ప్రభుత్వం రూపొందించిన బిల్లులకు ఆమోదం తెలపడం మీ కర్తవ్యం. రాజ్యాంగం ప్రకారం సక్రమంగా విధులు నిర్వహించాలని’ తన సంపాదకీయంలో రాసుకొచ్చింది.