ఆఫ్ఘన్ల సహనాన్ని పరీక్షించకండి. ఆ తర్వాత జరిగే తీవ్రమైన పరిణామాలకు పాకిస్తాన్ సిద్ధంగా ఉండాలని పాకిస్థాన్ ను తాలిబన్లు హెచ్చరించారు. ఆఫ్ఘానిస్తాన్ లో తాలిబన్ల పాలన ఏర్పాటులో కీలక పాత్ర వహించిన పాకిస్థాన్ పట్ల ఇప్పుడు ఆ దేశంలో తీవ్ర అసహనం వ్యక్తం అవుతున్నది.
తాజాగా, ఆప్ఘనిస్తాన్‌లోని ఖోస్ట్, కునార్ ప్రావిన్సులపై పాక్ జరిగిపిన వైమానిక దాడుల్లో 60 మందికిపైగా ఆప్ఘన్ సాధారణ పౌరులు మృతిచెందారు. దీనిపై తాలిబాన్ ప్రభుత్వానికి చెందిన సమాచార, సాంస్కృతిక శాఖ ఉప మంత్రి జబివుల్లా ముజాహిద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి వైమానిక దాడులు జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని స్పష్టం చేశారు.
ఇలాంటి ఘటన వల్ల రెండు దేశాల మధ్య వివాదాలు పెరుగుతాయన్న ముజాహిద్.. దౌత్య మార్గాల్లో సమస్యల పరిష్కారానికి తాము ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు.
ఇదిలా ఉండగా పాక్ వైమానిక దాడుల అనంతరం ఆప్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లోని పాకిస్తాన్ రాయబారి మన్సూర్ అహ్మద్ ఖాన్‌తో తాలిబాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ సమావేశమైంది. ఈ సందర్బంగా ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆయనకు సూచించింది.
తాలిబన్ కీలుబొమ్మ ప్రభుత్వం
పాకిస్తాన్ వైమానిక దళం చేసిన ఈ దాడిపై ఆఫ్ఘనిస్తాన్ మాజీ వైస్ ప్రెసిడెంట్ అమ్రుల్లా సలేహ్ ఇస్లామిక్ ఎమిరేట్ ప్రభుత్వాన్ని తీవ్రంగా లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పించారు. సలేహ్ తాలిబాన్‌ను పాకిస్థాన్‌కు కీలుబొమ్మగా అభివర్ణించారు.
కాబూల్‌లో పాకిస్థాన్ కీలుబొమ్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని అమ్రుల్లా సలేహ్ ట్వీట్ చేశారు. పాకిస్థాన్ మిలిటరీ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ఘనిస్తాన్ లోపలకి ఎగిరి బాంబులు వేయడానికి కూడా వెనుకాడకపోవడానికి ఇదే కారణం అని చెప్పారు. చరిత్రలో తొలిసారిగా పాకిస్థాన్ వైమానిక దళం ఆఫ్ఘనిస్థాన్‌లో వైమానిక దాడులు చేసిందని గుర్తు చేశారు.
అయితే, పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయం దాడులను ధృవీకరించలేదు లేదా వాటిని తమ వైమానికదళం ద్వారా నిర్వహించినట్లయితే పరిష్కరించే ప్రయత్నం చేయలేదు. కాబూల్‌లోని పాకిస్థాన్ రాయబార కార్యాలయం తాము వైమానిక దాడులు చేయలేదంటూ ఖండించింది.
ఆఫ్ఘనిస్తాన్ నుండి తమ భద్రతా దళాలపై దాడి చేసిన సంఘటనలు పెరిగాయని, నేరస్థులపై చర్య తీసుకోవాలని తాలిబాన్ అధికారులను కోరినట్లు ఇస్లామాబాద్ ఆదివారం తెలిపింది. “పాకిస్తాన్ లోపల కార్యకలాపాలు నిర్వహించడానికి ఉగ్రవాదులు ఆఫ్ఘన్ నేలను శిక్షార్హులు లేకుండా ఉపయోగిస్తున్నారు” అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఉత్తర వజీరిస్థాన్‌లో ఏడుగురు పాకిస్థానీ సైనికులు మరణించిన కొద్ది రోజులకే ఈ వైమానిక దాడులు జరిగాయి. ఈ ప్రాంతం తూర్పు ఆఫ్ఘన్ ప్రావిన్స్‌కు సరిహద్దుగా ఉంది. ఇక్కడ వైమానిక దాడులు జరిగినట్లు చెబుతున్నారు. ఆఫ్ఘనిస్తాన్లోని ఖోస్ట్, కునార్ ప్రావిన్సులలో వైమానిక దాడుల్లో అమాయక ఆఫ్ఘన్లను చంపినందుకు తమ యోధులు ప్రతీకారం తీర్చుకోబోతున్నారని నిషేధిత ఉగ్రవాద సంస్థ తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (టిటిపి) పాకిస్తాన్‌ను హెచ్చరించింది.
పాకిస్థాన్ తన అవమానాన్ని, వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి కునార్, ఖోస్ట్, బజౌర్ , వజీరిస్థాన్‌లలో వైమానిక దాడులు చేసి మహిళలు, పిల్లలతో సహా వందలాది మందిని చంపిందని గ్రూప్ ప్రతినిధి చెప్పారు. టిటిపి ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిజ్ఞ చేసింది, పాకిస్తాన్ సైన్యం, ఐఎస్ఐ లకు వ్యతిరేకంగా నిలబడాలని పాకిస్తాన్ ప్రజలకు పిలుపునిచ్చింది.
ఒక ట్వీట్లో, ఇలా పేర్కొన్నారు: “పాకిస్తానీ దళాలు టిటిపితో పోరాడలేవు మరియు వారి వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి పౌరులను లక్ష్యంగా చేసుకున్నాయి, టిటిపితో ముఖాముఖి పోరాడాలని మేము పాక్ సైన్యానికి స్పష్టం చేస్తున్నాము”.