కరోనా నుండి పూర్తిగా కోలుకోకముందే దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలతో పాటు, నిత్యావసర వస్తువుల ధరలు, వంటనూనె ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. తాజాగా ఆర్టిసి ధరలు కూడా పెరిగాయి. రోజురోజుకూ సామాన్యులపై అధిక రేట్లు గుదిబండలా పెరుగుతూనే ఉన్నాయి.
ధరలు పెరిగిన వేళ వాటి డిమాండ్ తగ్గడం ప్రారంభించింది. ముఖ్యంగా ఈ మార్పు పెట్రో ధరల విషయంలో స్పష్టంగా కనిపిస్తుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. పెట్రో ధరలు పైకి ఎగబాకడంతో రవాణా ఛార్జీలు పెరిగి, దాని ప్రభావం అన్నింటిపై పడుతుందని ఆర్థిక నిపుణులు వెల్లడిస్తున్నారు.
ఈ నెలలో మాత్రం ఇంధన వినియోగం బాగా తగ్గినట్టు గణాంకాలు చెబుతున్నాయన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెరుగడమే ఇందుకు కారణంగా విశ్లేషిస్తున్నారు. మార్చి 2022 తొలి 16 రోజులతో పోలిస్తే ఏప్రిల్లో 10 శాతం పెట్రోల్ వినియోగం తగ్గిపోయింది.
ఇదే సమయంలో డీజిల్ వినియోగం 15.6 శాతం పడిపోగా, వంటగ్యాస్ వినియోగం కూడా 1.7 శాతం డ్రాప్ అయ్యింది. వీటి ధరలు విపరీతంగా పెరగడమే ఇందుకు కారణమని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.
ఏ వినియోగాన్ని అదుపులో ఉంచగలిగినా వంట గ్యాస్ వినియోగం తప్పనిసరి. పొయ్యి వెలగనిదే రోజు గడవదు. అలాంటిది వంట గ్యాస్ వినియోగం కూడా భారీగా తగ్గిందంటే ప్రజలపై అధిక రేట్ల భారం ఏ స్థాయిలో ప్రభావం చూపుతోందన్నదీ అర్థమవుతోంది.
కరోనా తీవ్రంగా విజృంభించిన సమయంలో వంట గ్యాస్ వినియోగం బాగా పెరిగిపోయింది. ఇటీవల వంటగ్యాస్పై కూడా వడ్డన పెరగడంతో దానికి కూడా డిమాండ్ తగ్గిపోవడం గమనార్హం.
ఏప్రిల్ 1 నుండి 15 వరకు ప్రాథమికంగా, ప్రభుత్వ ఆధీనంలోని చమురు సంస్థల పెట్రోలు అమ్మకాలు 1.12 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే దాదాపు 12.1 శాతం అధికం. 2019 కాలంతో పోలిస్తే 19.6 శాతం ఎక్కువ.
అయితే, మార్చి 2022 మొదటి పదిహేను రోజుల్లో నమోదైన 1.24 మిలియన్ టన్నుల అమ్మకాలతో పోలిస్తే పెట్రోల్ వినియోగం 9.7 శాతం తగ్గింది. దేశంలో అత్యధికంగా ఉపయోగించే ఇంధనం డీజిల్ ఏప్రిల్ మొదటి అర్ధ భాగంలో 7.4 శాతం అమ్మకాలను నమోదు చేసి సుమారు 3 మిలియన్ టన్నులకు చేరుకుంది.
ఇది కూడా 2019 లో ఇదే కాలం కంటే 4.8 శాతం ఎక్కువ. అయితే, ఈ ఇంధన వినియోగం మార్చి 1-15 మధ్య లాగిన్ అయిన 3.53 మిలియన్ టన్నుల వినియోగంతో పోలిస్తే 15.6 శాతం పడిపోయింది. దీనికి ప్రధాన కారణం.. ధరల పెరుగుదలగా ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.