బంజారాహిల్స్ భూ కబ్జా యత్నం కేసులో ఏ5 నిందితుడిగా బిజెపి ఎంపీ టీజీ వెంకటేశ్‌ను నమోదు చేశారు. ఏపీ జెమ్స్ సంస్థ ప్రాపర్టీలోకి టీజీ వెంకటేశ్ మనుషులు అక్రమంగా చొరబడి.. ఆస్తులు ధ్వంసం చేయడంతో పాటు అడ్డుకోబోయిన సెక్యూరిటీ సిబ్బందిపైనా దాడి చేసినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ కేసులో నిందితులుగా టీజీ వెంకటేశ్‌తో పాటు ఆయన సోదరుడి కుమారుడు టీజీ విశ్వప్రసాద్, సుభాష్ పులిశెట్టి మిథున్, వీవీఎస్ శర్మ సహా 80 మందిని చేర్చారు. 2021లోనూ ఇదే తరహాలో దాడులకు యత్నించారని రిమాండ్ రిపోర్టులో తెలిపారు.
పోలీసుల కధనం మేరకు, బంజారాహిల్స్ రోడ్ నంబరు 10 లో ఏపీ జెమ్స్ అండ్ జువెలర్స్ పార్క్‌కు 2005 లో అప్పటి ప్రభుత్వం దాదాపు రెండున్నర ఎకరాల స్థలాన్ని కేటాయించింది. ఈ స్థలంలో సంస్థ నిర్మాణాలు చేపట్టగా ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న మరో అర ఎకరానికి పైగా స్థలం ఖాళీగా ఉంది.
ఈ జాగా తమదేనంటూ కొందరు టీజీ వెంకటేష్ సోదరుడి కుమారుడు, సినీ నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌కు కొద్దిరోజుల కిందట డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేశారు. దీంతో ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు ఆదివారం ఉదయం దాదాపు 10 వాహనాల్లో కర్నూలు జిల్లా ఆదోని ప్రాంతానికి చెందిన 90 మంది మారణాయుధాలతో అక్కడకు చేరుకొని కాపలాదారులపై దాడికి పాల్పడ్డారు.
విషయం తెలుసుకొన్న బంజారాహిల్స్ పోలీసులు అక్కడికి చేరుకోగా, వారు పోలీసులను గమనించి కొందరు వాహనాల్లో పరారయ్యారు. 63 మందిని పోలీసులు అరెస్ట్ చేసి ఆయుధాలు, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వారందరినీ కట్టుదిట్టమైన భద్రత మధ్య కోర్టుకు తరలించారు. 25 మందికి పైగా పరారీలో ఉన్నారని, వారిలో ఆదోనికి చెందిన బడా రాజకీయ నాయకులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఇలా ఉండగా, కబ్జా కోసం వెళ్ళలేదు, సినిమా ఆఫీస్ ఓపెనింగ్ కోసం వెళ్లామని విశ్వప్రసాద్ మనుషులు చెబుతున్నారు. తమ దగ్గర ఎటువంటి ఆయుధాలు లేవని వీడియోలు విడుదల చేశారు. తాము ఎవరిపై దాడి చేయలేదని వీడియోలు కూడా విడుదల చేశారు.
పోలీసులే హాకీ బ్యాట్లు, కత్తులు పెట్టినట్టు విశ్వప్రసాద్ ఆరోపిస్తున్నారు. ఈవెంట్, సినిమా ఆఫీస్ కోసం అంతమంది వెళ్లారని విశ్వప్రసాద్ అంటున్నారు. వచ్చిన వాళ్లంతా రాయలసీమ రౌడీలు కాదని, కేవలం తమ బంధువులే అని విశ్వప్రసాద్ పేర్కొన్నారు.
తనకు ఏమాత్రం సంబంధంలేని ఈ కేసులో తనను నిందితునిగా పోలీసులు పేర్కొనడం పట్ల టిజి వెంకటేష్ విస్మయం వ్యక్తం చేశారు. ఎఫ్ఐఆర్ లో లేని తన పేరు రిమాండ్ రిపోర్ట్ లో ఎలా వచ్చినదని ప్రశ్నించారు.