లఖింపూర్ ఖేరీ హింసాకాండ కేసులో సుప్రీంకోర్టు సోమవారం సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. లఖింపూర్ ఖేరీ హింసాకాండ నిందితుడు ఆశిష్ మిశ్రా బెయిల్‌ను రద్దు చేసిన సుప్రీంకోర్టు వారంలోగా లొంగిపోవాలని ఆదేశించింది.
ఆశిష్ మిశ్రాకు బెయిల్ మంజూరు చేస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కోర్టు పక్కన పెట్టింది. అసంబద్ధ విశ్లేషణలతో హైకోర్టు బెయిల్ ఇచ్చిందని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి.రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసు విచారణ ప్రారంభం కాకముందే.. పోస్టుమార్టం నివేదిక, గాయాల గురించి బెయిల్ ఉత్తర్వుల్లో హైకోర్టు ప్రస్తావించటాన్ని తప్పుపట్టింది.
దీనిపై గతంలో తీర్పును రిజర్వ్‌లో పెట్టిన న్యాయస్థానం.. హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కనబెట్టింది. ఆశిష్‌కు బెయిల్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
‘‘హైకోర్టు తన అధికార పరిధిని మించిపోయింది, విచారణలో పాల్గొనే హక్కు బాధితులకు నిరాకరించింది’’ అని సుప్రీం పేర్కొంది. ‘‘హైకోర్టు అనేక అసంబద్ధమైన సమస్యలను పరిగణనలోకి తీసుకుంది. ఈ కేసుకు అనవసర ప్రయోజనం కల్పించాల్సిన చట్టపరమైన అవసరం లేదు’’ అని సుప్రీంకోర్టు తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
గతేడాది అక్టోబర్‌లో ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ ప్రాంతంలో చెలరేగిన హింసాకాండకు సంబంధించిన కేసులో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా కీలక నిందితుడు. ఈ ఘటన దేశవ్యాప్తంగా వివాదాస్పదమైంది. ప్రతిపక్షాల ఆందోళనల అనంతరం అక్టోబరు 9వతేదీన ఆశిష్ మిశ్రాను అరెస్టు చేయగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో బెయిల్ మంజూరైంది.
అక్టోబర్ 3న ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీలో ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య పర్యటనకు ముందు జరిగిన హింసాత్మక ఘటనలో నలుగురు రైతులతో సహా ఎనిమిది మంది మరణించారు.
నలుగురు రైతులపైకి దూసుకెళ్లిన కారులో ఆశిష్ మిశ్రా ఉన్నారని రైతు సంఘాలు ఆరోపించగా, కేంద్ర మంత్రి కుమారుడు ఆ వాదనలను ఖండించారు. లఖింపూర్ ఖేరీ హింసాకాండ ఘటనపై విచారణ జరుపుతున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నిరసన తెలిపిన రైతులను హత్య చేసేందుకు ప్రణాళికాబద్ధంగా కుట్ర జరుగుతోందని పేర్కొంది.
అంతకుముందు ఫిబ్రవరి 10 నిందితుడు ఆశిష్‌మిశ్రాకు అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ ఆశిష్ మిశ్రాకు బెయిల్ మంజూరు చేసింది. సాక్షులకు ముప్పు వాటిల్లే అవకాశం ఉన్నందున ఆశిష్ మిశ్రాబెయిల్ను రద్దు చేయాలని బాధిత కుటుంబాలు సుప్రీంకోర్టులో పేర్కొన్నాయి.