రాజకీయాల్లో ఇటీవలి కాలంలో ప్రత్యర్థులపై చేస్తున్న విమర్శల విషయంలో దిగజారుడుతనం, ప్రసంగాల్లో స్థాయిని మరచి మాట్లాడడం ఆందోళనకరమైన పరిస్థితికి దారితీస్తోందని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.
జాతీయ రాజకీయాలతో పాటు ప్రాంతీయ రాజకీయాల్లోనూ ఈ పరిస్థితి స్థాయి దాటుతోందని, ఇలాంటి వాటి కారణంగా ప్రజాస్వామ్యం నవ్వులపాలయ్యే ప్రమాదం ఉందన్న విషయాన్ని నాయకులు, భవిష్యత్తులో నాయకులు కావాలనుకునేవారు గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు. రాజకీయాల్లో విలువలు, నైతికత అత్యంత ఆవశ్యకమన్న ఆయన… మన నడవడిక, ప్రవర్తన, వ్యవహార శైలి జనాలను ప్రభావితం చేస్తాయని, జీవితంలో విలువలు పాటించిన నాయకులనే జాతి కలకాలం గుర్తుంచుకుంటుందని స్పష్టం చేశారు.
కృష్ణ జిల్లా రాజకీయాలపై తనదైన ముద్రవేసిన ప్రజానాయకుడు పిన్నమనేని కోటేశ్వరరావు విగ్రహాన్ని సోమవారం మచిలీపట్నంలో ఉపరాష్ట్రపతి ఆవిష్కరిస్తూ మనకు అప్పజెప్పిన బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వహించాలన్న విషయాన్ని వారి జీవితం తెలియజేస్తుందని తెలిపారు. రాజకీయాల్లో విలువలు, నైతికత తగ్గిపోతున్నాయని ఈ పరిస్థితి ప్రజాస్వామ్యానికి ఆందోళనకరమన్న ఆయన, రానున్న రోజుల్లో ఎలాంటి పరిస్థితులుంటాయోనని ఆవేదన వ్యక్తం చేశారు.
రాజకీయనాయకులు తమ హోదాకు, స్థాయికి తగినట్లుగా విమర్శలు, రాజకీయ ప్రకటనలుండేలా చూసుకోవాల్సిన అవసరం ఉందన్న ఉపరాష్ట్రపతి, ఇలాంటి వ్యక్తులు, ఇలాంటి విమర్శల కారణంగా ఆయా పార్టీలపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతుందని హెచ్చరించారు. పార్టీ మారే రాజకీయనాయకుల విషయంలోనూ మార్పు రావాల్సిన అవసరం ఉందన్న ఉపరాష్ట్రపతి.. పార్టీ మారడంతో పాటు పదవిని త్యచించే విధంగా మార్పు రావలసిన అవసరం ఉందని. ఇందుకోసం చట్టాల్లో మార్పులు చేయాల్సిన అవసరం కూడా ఉందని స్పష్టం చేశారు.
అధికారమే పరమావధిగా ఇటీవలి కాలంలో రాజకీయ పార్టీలు ఇస్తున్న ఎన్నికల హామీలు, ప్రణాళికల విషయంలో నిబద్ధత కనిపించడం లేదని విచారం వ్యక్తం చేశారు. ఏ స్థాయిలో ఉన్న ప్రభుత్వమైనా సరే తమ ఆర్థిక పరిస్థితి ఏంటి? ఇస్తున్న హామీలకు నిధులు ఎలా వస్తాయనే అంశాన్ని పార్టీలన్నీ ప్రణాళికతో పాటు వివరించేలా చట్టంలో మార్పులు అవసరమని ఉపరాష్ట్రపతి సూచించారు.
బాధ్యతారహితమైన, ఆచరణ సాధ్యం కాని హామీల కారణంగా ప్రజల్లో నమ్మకం సన్నగిల్లడంతోపాటు ఆర్థిక భారం పెరుగుతున్న విషయాన్ని ఉపరాష్ట్రపతి గుర్తుచేశారు. ఈ విషయంలో దేశవ్యాప్తంగా సమగ్రమైన చర్చ జరగాల్సిన అవసరం ఉందని సూచించారు. ప్రజలు కూడా ఈ విషయంలో బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉందని, ఐదేళ్ళకోసారి ఓటు వేయడం మాత్రమే కాకుండా, హామీలు నెరవేర్చనప్పుడు ప్రశ్నించాలని సూచించారు.
ఎన్నికల్లో ధనం, కులం, మతం ప్రాధాన్యతలు పెరుగుతున్నాయని, ఇది ప్రజాస్వామ్యానికి చేటు చేస్తుందన్న ఉపరాష్ట్రపతి ప్రజలు కూడా.. కులం, మతం, ధనం కన్నా గుణం మిన్న అనే రీతిలో ఆలోచించి ఓటేయాలని కోరారు.
ప్రతికూల మార్పులను సకాలంలో గుర్తించి సరిదిద్దేందుకు ప్రయత్నించకపోతే ప్రజాస్వామ్యం బలహీనపడుతుందన్న ఉపరాష్ట్రపతి… వ్యవస్థలోని లోపాలను ప్రక్షాళన చేసి, విలువలతో కూడిన గమ్యం దిశగా ప్రపంచం మళ్ళినపుడే మెరుగైన సమాజం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
27 సంవత్సరాలు జిల్లాపరిషత్ చైర్మన్ గా పని చేసిన పిన్నమనేని కోటేశ్వరరావు అసాధారణ నాయకుడని తెలిపారు. కృష్ణా జిల్లా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి విషయంలో పిన్నమనేని చేసిన కృషి, ప్రభుత్వ ఉపాధ్యాయులను ప్రోత్సహించేందుకు వారు చేపట్టిన కార్యక్రమాలు నేటికీ ఆదర్శనీయమైనవని చెబుతూ విద్యార్థుల ప్రతిభ ఆధారంగా ఉపాధ్యాయులకు సన్మానాలు, పారితోషికాలు అందించేందుకు వారు శ్రీకారం చుట్టిన విషయాన్ని ఉపరాష్ట్రపతి గుర్తుచేశారు.
కృష్ణాజిల్లా జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ ఉప్పల హరికృష్ణ, రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాల శౌరి, కేశినేని శ్రీనివాస్ (నాని), శాసనసభ్యులు, పేర్ని వెంకట్రామయ్య (నాని), కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని), ఆంధ్రప్రదేశ్ విప్ శ్రీ సామినేని ఉదయభాను, మచిలీపట్నం మేయర్ శ్రీమతి మోక వెంకటేశ్వరమ్మ, కేంద్ర మాజీ విజిలెన్స్ కమిషనర్ కె.వి.చౌదరి, మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.