తాను జరుపుతున్న ప్రజా సంగ్రామ పాదయాత్రను ఇటిక్యాల మండలం వేముల గ్రామంలో టీఆర్ఎస్ కార్యకర్తలు సోమవారం అడ్డుకొనే ప్రయత్నం చేయడం పట్ల బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీఆర్ఎస్ నేతల బెదిరింపులకు, దాడులకు భయపడే ప్రసక్తే లేదని, బరాబర్ ప్రజా సంగ్రామ యాత్ర చేసి తీరుతామని స్పష్టం చేశారు. “మేం ప్రజా సమస్యలు తెలుసుకుందామని పాదయాత్రగా వస్తే.. కొంతమంది టీఆర్ఎస్ గూండాలు బీజేపీ కార్యకర్తలపై రాళ్లదాడి చేసి, రక్తం కారేలా కొట్టారు. శ్రీకాంతాచారి, సుమన్, పోలీస్ కిష్టయ్య లాంటి అమరవీరులు ఇందుకోసమేనా ప్రాణత్యాగం చేసింది?” అంటూ ముఖ్యమంత్త్రి కేసీఆర్ ను ప్రశ్నించారు.
‘కేసీఆర్ దమ్ముంటే నువ్వు పాదయాత్ర చెయ్. తెలంగాణ ప్రజలకు నువ్వు చేసిన ఘన కార్యాలేమిటో వివరించు.. మేం చేసిన తప్పేంది? పాపమేంది? ప్రజా సమస్యలపై పోరాడటమే నేరమా? ప్రజలు పడుతున్న కష్టాలు తెలుసుకొని వాటిని పరిష్కారం కోసం పోరాటడమే తప్పా? మాపై రాళ్ల దాడులు చేస్తారా? మేం బస చేసే శిబిరాలను ధ్వంసం చేస్తారా..?’అంటూ ప్రజాక్షేత్రంలో నిలదీశారు.
పాలమూరు ప్రజల గోస, ఇక్కడి కరువు పరిస్థితులను చూస్తుంటే బాధేస్తోంది. ఎక్కడికి వెళ్లినా నీళ్ల సమస్యనే ప్రధానంగా చెబుతున్నారని పేర్కొంటూ పేదల ప్రభుత్వం రావాలంటే గడీల పాలన పోవాల్సిందే అని సంజయ్ స్పష్టం చేశారు.
కాగా, సంజయ్ పాదయాత్రపై టీఆర్ఎస్ కార్యకర్తల దాడిని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి, ఎంపీ సోయం బాపూరావు, బీజేఎల్పీ నేత టి.రాజాసింగ్ తదితరులు తీవ్రంగా ఖండించారు.సంజయ్ యాత్రకు వస్తున్న ప్రజా స్పందన చూసి టీఆర్ఎస్ నేతలు తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. దాడులకు ముఖ్యమంత్రే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు.
పార్టీ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ఇన్ ఛార్జ్ తరుణ్ ఛుగ్ సంజయ్ కు ఫోన్ చేసి జరిగిన సంఘటనల గురించి వాకబు చేశారు. ఆయనకు కేంద్ర పార్టీ నాయకత్వం అండగా ఉంటుందని, పాదయాత్ర కొనసాగించమని భరోసా ఇచ్చారు.
పాదయాత్రలో కేంద్ర మంత్రులు
బండి సంజయ్ పాదయాత్రలో కేంద్ర మంత్రులు, జాతీయ నాయకులు పాల్గొననున్నారు. ఇప్పటికే కిషన్‌రెడ్డి ఈ నెల 15న పాదయాత్రలో పాల్గొన్నారు. కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి ప్రహ్లాద్‌సింగ్ పటేల్ ఈ నెల 20న సంజయ్‌తో కలిసి పాదయాత్ర చేస్తారు. నారాయణపేట సభకు కేంద్ర సమాచార శాఖ సహాయ మంత్రి డాక్టర్ మురుగన్ హాజరుకానున్నారు.
నాగర్‌కర్నూలు సభకు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ హాజరయ్యే అవకాశం ఉంది. గద్వాలలో ఈ నెల 21న తలపెట్టిన బహిరంగ సభకు బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై ముఖ్య అతిథిగా హాజరవుతారని పార్టీ నేతలు తెలిపారు. పాదయాత్రలో భాగంగా మహబూబ్‌నగర్‌లో భారీ బహిరంగ సభకు బీజేపీ సన్నద్ధమవుతోంది. ఈ సభకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ముఖ్య అతిథిగా హాజరయ్యే అవకాశం ఉందని పేర్కొన్నాయి.
దాడులతో తీవ్ర ఉద్రిక్తత
ప్రజాసంగ్రామ యాత్రలో సోమవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వేముల గ్రామాన్ని దాటుతున్న సమయంలో టీఆర్ఎస్ కార్యకర్తలు కొందరు పాదయాత్రను అడ్డుకోవడానికి ప్రయత్నించగా బీజేపీ కార్యకర్తలు వారిని ప్రతిఘటించారు. పోలీసుల జోక్యంతో పాదయాత్ర కొనసాగింది.
కాసేపటికే మళ్లీ అడ్డుకునే ప్రయత్నం చేయడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. తర్వాత షాబాద వైపు నుంచి వాహనంలో వచ్చిన కొందరు టీఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకులతో వాదనకు దిగారు. వాదన ముదరడంతో బాహాబాహీకి దిగారు. ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. రాళ్లు సైతం రువ్వుకున్నారు. టీఆర్ఎస్కు చెందిన ముగ్గురికి, బీజేపీకి చెందిన ముగ్గురికి గాయాలయ్యాయి.
నాలుగు కార్ల అద్దాలు ధ్వంసం అయ్యాయి. పోలీసులు వారిని చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం కొనసాగింది. తర్వాత ఎస్పీ రంజన్‌రతన్ కుమార్ అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. భోజన విరామం తర్వాత యాత్రకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.