సీఎం చెప్పినచోట సంతకం చేయడానికి తానేమీ రబ్బర్ స్టాంప్ కాదని అంటూ తెలంగాణ గవర్నర్ డా. తమిళి తమిళసై సౌందరరాజన్ కేసీఆర్ ప్రభుత్వం తనపట్ల `అమర్యాదకరంగా’ వ్యవహరిస్తున్నట్లు కొంతకాలంగా ఆవేదన వ్యక్తం చేస్తున్న ఆమె తన స్వరం పెంచారు.
చెన్నైలో కాఫీ టేబుల్ పుస్తకాలను ఆవిష్కరించిన సందర్భంగా ఆమె సీఎం కేసీఆర్‌తో తనకు కొంత `అంతరం’ ఏర్పడిన మాట మాటే నిజమేనని గవర్నర్ అంగీకరించారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన కొందరు సీఎంలు నియంతలుగా మారేందుకు ప్రయత్నిస్తున్నారన్నారని అంటూ ఈ సందర్భంగా ఆమె కేసీఆర్ పట్ల పరుషమైన పదజాలం ఉపగించారు. ఇది మంచిది కాదని అంటూ హితవు చెప్పారు.
ఇద్దరు సీఎంలతో కలిసి పనిచేస్తున్నానని.. ఇద్దరూ భిన్నమైనవారంటూ ఆమె పేర్కొనడం గమనార్హం. ఆమె అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న పుదుచ్చేరి ముఖ్యమంత్రి బిజెపి భాగస్వామి కాగా, తెలంగాణ సీఎం బిజెపిపై యుద్ధం ప్రకటించారు. తద్వారా ఆయా సీఎంలకు బిజెపితో ఉన్న సంబంధాలను బట్టి గవర్నర్ లకు కూడా వారితో సంబంధాలు ఉంటాయని ఆమె పరోక్షంగా చెప్పిన్నట్లు అయింది.
ముఖ్యమంత్రి, రాష్ట్ర గవర్నర్ కలిసి పనిచేస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో పుదుచ్చేరిని చూస్తే తెలుస్తుందని చెబుతూ ముఖ్యమంత్రి , రాష్ట్ర గవర్నర్ కలిసి పనిచేయకపోతే ప్రజలకు ఎంత నష్టం జరుగుతుందో తెలంగాణని చూస్తే అర్థం అవుతుందని ఆమె ఎద్దేవా చేశారు. తద్వారా తనతో సఖ్యతతో లేనిపక్షంలో రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులకు గురి కాక తప్పదనే సంకేతం ఇచ్చారు.
కేసీఆర్ సూచించిన వ్యక్తికి ఎమ్యెల్సీగా తాను నామినేట్ చేయకపోవడం వల్లననే తనకు తెలంగాణ ప్రభుత్వంతో దూరం పెరిగిన్నట్లు మరోసారి గుర్తు చేస్తూ నిబంధనలకు వ్యతిరేకంగా ఉంది కాబట్టే సర్వీస్ కోటాలో ప్రభుత్వం సిఫారసు చేసిన ఎమ్మెల్సీని తిరస్కరించానని ఆమె స్పష్టం చేశారు. తర్వాత మరొకరి పేరు సూచిస్తే ఆమోదించానని ఆమె గుర్తు చేశారు.
ప్రభుత్వం చెప్పినట్లు చెయ్యకపోతే వ్యతిరేకించడం ఏంటని ఆమె ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ పుట్టినరోజుకు పుష్పగుచ్చం పంపించానని.. ఫోన్ లో మాట్లాడటానికి ప్రయత్నిస్తే అందుబాటులోకి రాలేదని ఆమె తెలిపారు. ఏదైనా అభిప్రాయభేదాలుంటే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని గవర్నర్ హితవు చెప్పారు.
కాగా, తాను ఢిల్లీ పర్యటనకు వెళ్ళగానే తనను గవర్నర్ గా వేరే రాష్ట్రానికి మార్చాలని ప్రచారం జరగడం పట్ల ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ వెళ్లిన వెంటనే తనను తెలంగాణ గవర్నర్ నుంచి మారుస్తున్నారని ప్రచారం చేస్తున్నారని చెబుతూ అందులో నిజం లేదని తమిళిసై స్పష్టం చేశారు.
రాజకీయాలలో ఉన్నపుడు ప్రత్యర్థులు విమర్శలు చేశారని, కానీ తాను ఇప్పుడు గవర్నర్ గా ఉన్నపుడు కూడా అదే విధంగా విమర్శిస్తున్నారని అంటూ ఆమె మండిపడ్డారు.
గవర్నర్ నివేదికల అధ్యయనం
మరోవంక, రాష్ట్ర ప్రభుత్వ పని తీరు, తెలంగాణలో జరుగుతున్న పరిణామాలపై గవర్నర్ తమిళిసై తాజాగా అందజేసిన నివేదికలను కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తున్నట్టు తెలుస్తున్నది. ఆమె అందజేసిన నివేదికల్లో కీలకమైన అంశాలు ఉన్నాయని, వాటిని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని చెబుతున్నారు.
గవర్నర్ అందజేసిన నివేదికలతో పాటు కేంద్ర ప్రభుత్వం నిఘా వర్గాల ద్వారా కీలక సమాచారాన్ని తెప్పించుకుని పరిశీలిస్తోందని, గవర్నర్ నివేదికలు, నిఘా వర్గాల సమాచారం ఒకేలా ఉందని కూడా తెలుస్తున్నది. ఈ విషయమై కేంద్రం త్వరలోనే తగు నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది.
ప్రోటోకాల్ ఉల్లంఘన అంశాన్ని కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ తీవ్రంగా పరిణమిస్తున్నదని, ఈ విషయమై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు సంబంధిత అధికారులు కొందరికి సంజాయిషీ నోటీసులు జారీ చేసే అవకాశాలున్నట్లు భావిస్తున్నారు.
తెలంగాణలో తనకు జరుగుతున్న అవమానాన్ని, మంత్రులు, ఎమ్మెల్యేలు, తెరాస పార్టీ నేతలు సామాజిక మాద్యమాల్లో తనకు వ్యతిరేకంగా పెడుతున్న పోస్టింగ్‌లు, కొందరు మంత్రులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి తనపై చేసిన ఆరోపణల క్లిప్పింగ్‌లను అమిత్ షాకు అందజేయాలని ఆమె నిర్ణయించినట్టు తెలుస్తున్నది. ఈ అంశాల పట్ల మీడియా సమావేశంలో సహితం ఆమె తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.