తెలంగాణ సీఎంతో పాటు మరో నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు `డిక్టేటర్షిప్ సిండ్రోమ్’తో బాధపడుతున్నారని అంటూ పరోక్షంగా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాల ముఖ్యమంత్రులను ఉద్దేశించి తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై కుప్పుస్వామి ఎద్దేవా చేశారు.
రెండో విడత ప్రజా సంగ్రామ యాత్రలో ఎనిమిదో రోజైన గురువారం జోగుళాంబ గద్వాల జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ దేశంలో తన కార్యాలయానికి రాకుండా పరిపాలన సాగిస్తున్న ఏకైక సీఎం కేసీఆరే అని ధ్వజమెత్తారు. ఎనిమిదేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణను అప్పుల తెలంగాణ చేశారు తప్ప అభివృద్ధి శూన్యం అని ధ్వజమెత్తారు. నీళ్లు, నిధులు, నియామకాల ఆకాంక్ష నెరవేరాలంటే తెలంగాణ రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రావాలని స్పష్టం చేశారు.
ఎవరైనా సమాజ అభివృద్ధిలో, ఉద్యోగాల్లో సామాజిక న్యాయం పాటిస్తారని.. తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం తాగుబోతులను తయారు చేయడానికి సోషల్ జస్టిస్ ను పాటించడం ఏమిటో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. నేడు రాష్ట్రంలో లిక్కర్ నే ఆదాయ వనరుగా మలుచుకొని ప్రజలను మద్యానికి బానిసలుగా టీఆర్ఎస్ సర్కారు చేస్తుందని అన్నామలై ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజలకు సామాజిక న్యాయం ఉద్యోగాల్లో కావాలి.. కానీ, లిక్కర్ లో కాదని స్పష్టం చేశారు.
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చిన్న కుటుంబం నుంచి వచ్చిన మహిళ అని చెబుతూ, కాని, ఆమె పట్ల సాంస్కారహీనంగా సోషల్ మీడియాలో దిష్టిబొమ్మలా అవమానపర్చడం బాధాకరం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గవర్నర్ తమిళిసైని అవమానిస్తున్న కేసీఆర్.. మొత్తం మహిళా జాతిని అవమానిస్తున్న విషయాన్ని గుర్తించాలని స్పష్టం చేశారు. అహంకారంతో ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా పాలిస్తున్న సీఎం కేసీఆర్కు 2023లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని భరోసా వ్యక్తం చేసారు.
హుజురాబాద్ ఎన్నికలప్పుడు దళితులందరికీ దళితబంధు ఇస్తానని కేసీఆర్ చెప్పిండని గుర్తు చేస్తూ కాని రాష్ట్రంలో మరెక్కడా దళితబంధు ఇవ్వలేదని, వారికి ఇస్తామన్నా 3 ఎకరాలు రాలేదని విమర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్… కేంద్ర ప్రభుత్వ పథకాలను తెలంగాణలో అమలు కానివ్వకుండా పేదలను హింసిస్తున్నడని అన్నామలై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయుష్మాన్ భారత్ సహా, ప్రధాన మంత్రి ఆవాస్ యోజనను అమలు కానివ్వడం లేదని గుర్తు చేశారు.
నడిగడ్డను సస్యశ్యామలం చేసే ఆర్డీఎ్సను ఆరునెలల్లో పూర్తిచేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని, ఈ మేరకు కేఆర్ఎంబీ నివేదిక కూడా ఇచ్చిందని బండి సంజయ్ ప్రకటించారు. నడిగడ్డను సస్యశ్యామలం చేసే ఆర్డీఎ్సను ఆరునెలల్లో పూర్తిచేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని చెప్పారు. ఆర్డీఎస్ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తున్న మాజీ మంత్రి డీకే అరుణమ్మను నేటి నుంచి ఆర్డీఎస్ అరుణమ్మగా పిలచుకోవాలని సంజయ్ సూచించారు.
ఆర్డీఎస్ విషయంలో 8 ఏళ్లుగా ప్రజలను మోసం చేస్తూ నడిగడ్డను ఎడారిగా మార్చిన సీఎం కేసీఆర్ ను నిలదీయాలని ప్రజలకు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. కేంద్రం తెలంగాణకు ఏమీ ఇవ్వడం లేదంటూ ఏడవటం తప్ప కేసీఆర్ సాధించేమిటని సంజయ్ ప్రశ్నించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఇప్పటి దాకా రూ 3 లక్షల కోట్లకు నిధులు తెలంగాణకు కేటాయించిందని స్పష్టం చేశారు.
తెలంగాణకు నిధులు ఇవ్వడం లేదనిమంత్రి కేటీఆర్ చేసిన ప్రకటనపై మండిపడుతూ లెక్కలు రాకుంటే తెలుసుకో, ఇచ్చిన నిధులెన్నో లెక్కలు చూసుకో అంటూ ఎద్దేవా చేశారు. 2021 వరకు పన్నుల వాటా కింద రూ.1.68 లక్షల కోట్ల నిధులతో పాటు ఇతర పథకాల కోసం మరో రూ.1.50 లక్షల కోట్లు కేంద్రం తెలంగాణకు ఇచ్చిందిని సంజయ్ వెల్లడించారు.