గత రెండేళ్లకు పైగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం సస్పెన్షన్ లో ఉంచిన చంద్రబాబునాయుడు హయాంలో ఇంటెలిజెన్స్ అధిపతిగా పనిచేసిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఈ వ్యవహారంపై సుప్రీం కోర్టులో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను తోసిపుచ్చింది.
ఈ వ్యవహారంపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఆయనపై ఏపీ ప్రభుత్వం విధించిన సస్పెన్షన్ ను రద్దు చేసింది. రెండేళ్లకు మించి సస్పెన్షన్ కొనసాగించకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఏబీ వెంకటేశ్వరరావును మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.
జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ అభయ్ ఎస్.ఒకా, జస్టిస్ సీటీ రవికుమార్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు తీర్పును వెలువరించింది. సస్పెన్షన్ కాలం పూర్తయినందున మళ్లీ సర్వీసులోకి తీసుసస్పెన్షన్ కొనసాగేది లేదని సుప్రీం స్పష్టం చేస్తూ 1969 అఖిల భారత సర్వీసు నిబంధనల ప్రకారం సస్పెన్షన్ కొనసాగబోదని తేల్చిచెప్పింది.
2022 ఫిబ్రవరి 8 నుంచి అన్ని బెనిఫిట్స్ వర్తిస్తాయని పేర్కొంది. హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోమని సుప్రీం కోర్టు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తనపై కావాలనే విషప్రచారం చేశారని ఆరోపించారు. తన సస్పెన్షన్‌పై ప్రభుత్వ ఎస్ఎల్పీని న్యాయస్థానం కొట్టివేసిందని పేర్కొన్నారు. చట్ట ప్రకారమే తాను పోరాటం చేశానని స్పష్టం చేశారు.
ఏ సైకో కళ్లల్లో ఆనందం చూడ్డం కోసం ఇలా చేశారు? ఇదంతా జరిగేందుకు కారకులెవరు? అంటూ ఆయన ప్రశ్నించారు. సస్పెన్షన్‌ను ప్రశ్నించడమే తన తప్పా? అని నిలదీశారు. ఈ కేసు రెండేళ్ల రెండు నెలలపాటు కొనసాగిందని చెబుతూ న్యాయవాదులకు ప్రభుత్వం కోట్లు ఖర్చు చేసిందని విమర్శించారు. ఒక తప్పుడు నివేదిక ఆధారంగా 24 గంటల్లో తనను సస్పెండ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆరునెలల కోసారి సస్పెన్షన్ పొడిగిస్తూ రిపోర్టులిచ్చారని పేర్కొంటూ ప్రభుత్వాన్ని పక్కదారి పట్టించిన అధికారులపై ఫిర్యాదు చేశానని తెలిపారు. కొనుగోలు అనేదే లేనప్పుడు అవినీతి ఎలా జరుగుతోందని ఆయన ప్రశ్నించారు. తనను, తన కుటుంబాన్ని క్షోభ పెట్టి ఏం సాధించారని నిలదీసేరు. ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించిన అధికారుల నుంచి.. రెవెన్యూ రికవరీ చేయాలని ఏబీ వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు.