కొత్త రక్షణ సహకార ఒప్పందంపై భారత, బ్రిటన్ ప్రధానులు నరేంద్ర మోదీ, బోరిస్ జాన్సన్‌లు సంతకాలు చేశారు. రక్షణ, వాణిజ్యం, క్లీన్ ఎనర్జీ వంటి విభిన్న రంగాల్లో సహకారాన్ని మరింత విస్తరించే లక్ష్యంతో చర్చలు జరిపారు. ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న దాడిపై ఇరు దేశాధినేతలు ఆందోళన వ్యక్తం చేశారు.
అక్టోబర్‌లో దీపావళినాటికి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని పూర్తి చేయాలని ఇరు దేశాలు భావిస్తున్నట్లు మోదీ, బోరిస్ జాన్సన్‌లు ఢిల్లీలో భేటీ అనంతరం సంయుక్తంగా మీడియాకు వెల్లడించారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన చర్చల్లో మంచి పురోగతి సాధించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.
ఈ ఏడాది చివరి నాటికి ఈ ఒప్పందాన్ని ముగించాలని నిర్ణయం తీసుకున్నామని, ఇది భారత్-ఆస్ట్రేలియా వాణిజ్య స్వేచ్ఛా ఒప్పందంలా ఉండనుందని పేర్కొన్నారు. భారత్ సొంతంగా యుద్ధ విమానాలను తయారీ చేసేందుకు బ్రిటన్ కూడా సాయం చేస్తుందని బోరిస్ జాన్సన్ హామీ ఇచ్చారు.
అన్ని దేశాల ప్రాదేశికతను, సమగ్రత, సార్వభౌమాధికారాన్ని గౌరవించాల్సిన అవసరాన్ని పునరుద్ఘాటించిన మోదీ, ఇండో-పసిఫిక్ ఒప్పందంలో ఉచిత, బహిరంగ, సంఘటిత, నియమాల ఆధారిత ఆర్డర్‌పై ఇరు దేశాలు కట్టుబడి ఉన్నాయని చెప్పారు. శాంతియుత, స్థిరమైన, సురక్షితమైన ఆఫ్గాన్‌కు తాము మద్దతునిస్తామని పునరుద్ఘాటించారు.
ఇతర దేశాలలో ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేసేందుకు ఆప్ఘన్ భూభాగాన్ని ఉపయోగించకూడదని ఆయన స్పష్టం చేయారు. ఉక్రెయిన్‌పై రష్యా ఉగ్రదాడిపై స్పందించిన ఆయన.. సంభాషించాలని, కాల్పుల విరమణ చేపట్టాలని పిలుపునిచ్చారు.
కాగా, ప్రపంచాన్ని వణికించిన కరోనా వ్యాక్సిన్ పంపిణీలో భారత్ చేస్తున్న ప్రయత్నాలను బోరిస్ జాన్సన్ ప్రశంసించారు. తాను భారత్ తయారు చేసిన వ్యాక్సిన్ తీసుకున్నానని చెబుతూ, దాని వల్లే తానిప్పుడు సురక్షితంగా ఉన్నానని పేర్కొంటూ భారత్‌కు ధన్యవాదాలు తెలిపారు.
నీరవ్ మోదీ, విజయ్ మాల్యాలను అప్పగిస్తాం
భారత్‌లోని చట్టాల నుండి తప్పించుకునేందుకు బ్రిటన్ న్యాయ వ్యవస్థను వినియోగించాలనుకునే వారిని యుకెలో స్వాగతించలేమని ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ స్పష్టం చేశారు. భారత్‌లో రెండు రోజుల పర్యటనకు వచ్చిన బోరిస్ జాన్సస్ ప్రధాని మోదీతో భేటీతో ద్వైపాక్షిక చర్చలు అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
భారత్ బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టి విదేశాలకు పరారైన నీరవ్ మోదీ, విజయ్ మాల్యాలను స్వదేశానికి అప్పగించడం గురించి బోరిస్ జాన్సన్ మాట్లాడుతూ.. వీరిని అప్పగించాలని ప్రభుత్వం ఆదేశించిందని, అయితే న్యాయపరమైన సాంకేతికత ఈ ప్రక్రియను కష్టతరం చేసిందని తెలిపారు.
భారత్‌లోని చట్టాల నుండి తప్పించుకునేందుకు తమ న్యాయ వ్యవస్థను వినియోగించుకోవాలనే ఆర్థిక నేరగాళ్లను స్వాగతించలేమని స్పష్టం చేశారు. అలాగే బ్రిటన్ కేంద్రంగా పనిచేస్తున్న ఖలిస్తానీ గ్రూపులపై కూడా ఆయన స్పందించారు. వారి విషయంలో యాంటీ టెర్రరిస్ట్ టాస్క్ ఫోర్స్‌ను నియమించామని, అతి తొందర్లోనే వారిపై కూడా తగు చర్యలు తీసుకుంటామని జాన్సన్ ప్రకటించారు.