వివాదాస్పదమైన సాయుధ బలగాలకు విశేషాధికారాలు కట్టబెట్టే సాయుధ బలగాల ప్రత్యేక హక్కుల చట్టాన్ని (ఆఫ్సా) ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూ కాశ్మీర్ నుంచి పూర్తిగా తొలగించే ఆలోచనలో ఉన్నట్లు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంకేతం ఇచ్చారు. ఈశాన్యం, జమ్మూ కాశ్మీర్ నుంచి అఫ్సాను పూర్తిగా తొలగించాలని రక్షణ బలగాలు కోరుతున్నట్లు ఆయన ప్రకటించారు.
ఈ వివాదాస్పద చట్టాన్ని ఈశాన్య ప్రాంతాలైన నాగాలాండ్, అసోం, అరుణాచల్ ప్రదేశ్లలో ఇటీవల పాక్షికంగా తొలగించారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు 1990లో జమ్మూకశ్మీర్‌లో ఆఫ్సా చట్టాన్ని అమల్లోకి తెచ్చారు. 1958 సాయుధ బలగాల (ప్రత్యేక హక్కుల) చట్టం (అఫ్సా) కింద ఏదైనా ప్రాంతాన్ని కల్లోలిత ప్రాంతంగా ప్రకటిస్తే అక్కడ ఆఫ్సాను అమలు చేస్తారు
ఇది రాక్షస చట్టమని, దీనిని పూర్తిగా తొలగించాల్సిందేనని ఈశాన్య రాష్ట్రాల్లో ఇప్పటికీ నిరసనలు, డిమాండ్లు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాజ్‌నాథ్ తాజా ప్రకటనతో ఈశాన్యం, జమ్మూకశ్మీర్‌లో ‘ఆఫ్సా’ చట్టాన్ని కేంద్రం పూర్తిగా ఎత్తివేసే అవకాశాలు లేకపోలేదని అర్ధం అవుతుంది.
అంతర్గత భద్రతా వ్యవహారాలలో సైన్యానిది నామమాత్రపు పాత్రని రాజ్‌నాథ్ సింగ్ తేల్చిచెప్పారు. జమ్మూ కశ్మీరులో పరిస్థితి మెరుగుపడాలని సైన్యం కోరుకుంటోందని, దీని వల్ల అక్కడ అమలులో ఉన్న సాయుధ దళాల (ప్రత్యేక అధికారాల) చట్టం తొలగిపోతుందని సైన్యం ఆశిస్తోందని అస్సాంలోని గువాహటిలో 1971 నాటి యుద్ధ వీరులను, వారి కుటుంబ సభ్యులను సన్మానించిన సందర్భంగా ఆయన చెప్పారు.
సాయుధ దళాల (ప్రత్యేక అధికారాల) చట్టం తొలగిపోకూడదని భారతీయ సైన్యం కోరుకుంటోందని కొందరు భావిస్తున్నారని, అయితే ఇది తప్పని ఆయన స్పష్టం చేశారు. జమ్మూ కశ్మీరులో పరిస్థితి మెరుగుపడితే అక్కడ ఈ చట్టాన్ని తొలగించవచ్చని సైన్యం కూడా భావిస్తోందని ఆయన తెలిపారు.
ఇటీవలే అస్సాంలోని 23 జిల్లాలలో ఈ చట్టాన్ని తొలగించడం జరిగిందని, ఒక జిల్లాలో పాక్షికంగా తొలగించారని ఆయన గుర్తు చేశారు. మణిపూర్‌లోని ఆరు జిల్లాల పరిధిలోని 15 పోలీసు స్టేషన్లు, నాగాలాండ్‌లోని ఏడు జిల్లాల పరిధిలోని 15 పోలీసు స్టేషన్లలో సాయుధ దళాల చట్టాన్ని తొలగించడం జరిగిందని వివరించారు.
సరిహద్దులు దాటేందుకు కూడా వెనుకాడం
కాగా, దేశాన్ని లక్ష్యంగా చేసుకుంటే సరిహద్దులు దాటేందుకు కూడా తాము వెనుకాడబోమని టెర్రరిస్టులకు రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరించారు. దేశంలో ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు తమ ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు. సరిహద్దులకు అవతల నుంచి దేశాన్ని లక్ష్యంగా చేసుకుంటే సహించేది లేదని తేల్చి చెప్పారు.
‘ఉగ్రవాదాన్ని కఠినంగా ఎదుర్కొంటామన్న సందేశం ఇవ్వడంలో భారత్ విజయవంతమైంది. బయటి నుంచి దేశాన్ని లక్ష్యంగా చేసుకుంటే సరిహద్దులు దాటేందుకు వెనుకాడబోం’ అని తెలిపారు. బంగ్లాదేశ్ స్నేహ దేశం కావడంతో పశ్చిమ సరిహద్దుతో పోల్చితే తూర్పు సరిహద్దులో శాంతియుత వాతావరణం ఉందని, ఉద్రిక్తతలు, చొరబాట్లు తగ్గాయని చెప్పారు.