తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీ రామారావు హద్దుమీరి మాట్లాడుతున్నారని బీజేపీ ఎంపీ (రాజ్యసభ) జీవీఎల్ నరసింహారావు ధ్వజమెత్తారు. బీజేపీ అంటే భయంతోనే కేటీఆర్ అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ప్రధాని మోదీ మాట్లాడిన మాటలను తప్పుగా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
ఇదే అంశంపై ఓ రెండు పత్రికల్లో (నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే) వక్రీకరించే కథనాలతో ప్రధాని మోదీని నిందిస్తూ విష ప్రచారం సాగించారని జీవీఎల్ ఆరోపించారు. తప్పుడు ప్రచారంపై ఆ పత్రికల వివరణ కోరగా, ఎడిటర్లు ఇచ్చిన సమాధానాలు సంతృప్తికరంగా లేవని చెబుతూ అందుకే ఆ రెండు పత్రికలపై సభా హక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని రాజ్యసభ చైర్మన్‌కు నోటీసులు అందజేశామని జీవీఎల్ తెలిపారు.
తద్వారా బీజేపీ మీద తప్పుడు ప్రచారం చేస్తే రాజ్యాంగం పరిధిలో చట్టబద్ధంగా చర్యలు తీసుకోడానికి వెనుకాడబోమన్న సంగతి గుర్తుపెట్టుకోవాలని హితవు పలికారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చే నిధులపై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు బదులిస్తూ ఆయన తండ్రి కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఏం తెచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. యూపీఏ హయాం కంటే తమ హయాంలో 8 రెట్లు అధిక నిధులు తెలంగాణ రాష్ట్రానికి అందుతున్నాయని వివరించారు.
మంత్రి కేటీఆర్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ “నిధుల గురించి బీజేపీని ప్రశ్నించే ముందు మీ నాన్నను ప్రశ్నించు. నాడు కేంద్ర మంత్రిగా తెలంగాణకు ఏం చేశారో చెప్పమను” అని జీవీఎల్ వ్యాఖ్యానించారు. కేంద్రం విస్తృతంగా సహాయం చేస్తున్నా తెలుగు రాష్ట్రాలు మాత్రం నిందిస్తున్నాయని ఆయన అసహనం వ్యక్తం చేశారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కేంద్ర ప్రభుత్వ పథకాలకు తమ స్టిక్కర్లు వేసుకుంటున్నారని జీవీఎల్ మండిపడ్డారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద నిర్మించిన ఇళ్లకు ‘జగనన్న గృహాలు’ అంటూ తమ పేర్లు పెట్టుకున్నారని ఆరోపించారు.
అలాగే కేంద్ర ప్రభుత్వ సబ్సిడీతో ఇచ్చే బియ్యం, ఇతర సరుకుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం భరించేది కేవలం 5వ వంతు మాత్రమేనని, కానీ పూర్తిగా తామే ఇస్తున్నట్టుగా వైఎస్సార్సీపీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు.
కరోనా సమయంలో కేంద్రం పూర్తి ఉచితంగా ఆహార దినుసులు, రేషన్ సరుకులను అందజేసిందని గుర్తుచేస్తూ.. ఆ సమయంలో రాష్ట్రం ఉచితంగా ఏమిచ్చిందో చెప్పాలని నిలదీశారు. కేంద్ర పథకాలకు తమ స్టిక్కర్లు వేసుకుంటూ ఇకపై తాము చూస్తూ ఊరుకోబోమని, కేంద్ర పథకాల గురించి ప్రజలకు తెలిసేలా ఫ్లెక్సీలు, బ్యానర్లు, పెయింటింగ్స్ చేస్తామని తెలిపారు.