బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ చేపట్టిన రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర శనివారంకు 10 రోజులు పూర్తయ్యింది. ఈ రోజు ఉదయం కిష్టంపూర్ చౌరస్తాకు రాగానే 100 కి.మీలు పూర్తి చేసుకున్నారు. జోగులాంబ అమ్మవారి ఆశీస్సులతో అలంపూర్ లో ప్రారంభించి జోగులాంబ జిల్లాలోనే బండి సంజయ్ 9 రోజులపాటు ఇదే జిల్లాలో పాదయాత్ర చేశారు.
మండు టెండను సైతం లెక్క చేయకుండా కార్యకర్తల్లో జోష్ నింపుతూ ముందుకు సాగుతున్నారు. ప్రతి రోజు ఉదయం లేచింది మొదలు.. రాత్రి పొద్దుపోయే దాకా పాదయాత్ర కొనసాగిస్తున్నారు. గతంలో పెద్ద పెద్ద బహిరంగ సభలకు ప్రాధాన్యతనిచ్చిన బీజేపీ ఈసారి మాత్రం ‘ప్రజల గోస – బీజేపీ భరోసా’ పేరిట ప్రతిరోజు సగటున మూడు, నాలుగు గ్రామ సభలు నిర్వహిస్తూ ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చారు.
నడిగడ్డలో పాదయాత్ర చేసినన్ని రోజులు ఎక్కడ చూసినా రైతులు కలిసి నడిగడ్డ దుస్థితిని వివరించారు. ఈ ప్రాంతం సస్యశ్యామలం కావాలంటే ఆర్డీఎస్ ఆధునీకరణ, లిఫ్ట్ ల ఏర్పాటే శరణ్యమని ఆ దిశగా క్రుషి చేయాలని కోరుతూ అనేక వినతులు వచ్చాయి. ఈ పాదయాత్రలో పెద్ద ఎత్తున కుల సంఘాల నాయకులు తరలివచ్చి బండి సంజయ్ కు తమ గోడు విన్పించారు.
తొలిరోజు నుండి ఎక్కడ పాదయాత్ర చేసినా మాదాసు కురవ, వాల్మీకీ బోయ సామాజికవర్గ నాయకులు, ప్రజలు వచ్చి తమకు కేసీఆర్ చేసిన అన్యాయాన్ని వివరిస్తూ తమ సమస్యలకు పరిష్కారమయ్యేలా క్రుషి చేయాలని కోరారు. వీరితోపాటు యాదవులు, విశ్వకర్మలు, ముదిరాజ్, మున్నూరు కాపు కులస్తులు తరలివచ్చి తమ సమస్యలను మొర పెట్టుకున్నారు.
సాయంత్రం పూట పాదయాత్రలో దారి వెంట దుకాణాల వద్దకు వచ్చి చాయ్ పే చర్చ పేరిట యువకులు, వ్యాపారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నిరుద్యోగులు సైతం ఈ యాత్రకు పెద్ద ఎత్తున తరలివస్తూ సంజయ్ కు సంఘీభావం తెలుపుతూ స్వచ్ఛందంగా పాదయాత్రలో పాల్గొనడం విశేషం.
రెండో విడత పాదయాత్రలో భాగంగా ఇప్పటి వరకు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, ప్రహ్లాద్ సింగ్ పపటేల్ పాటు తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు అన్నామలై వచ్చి బండి సంజయ్ కు సంఘీభావం తెలుపుతూ పాదయాత్ర చేశారు.
ముఖ్యంగా ప్రజల నుండి విశేష స్పందన వస్తున్న తరుణంలో యాత్రకు ఆటంకాలు కల్పించేందుకు టీఆర్ఎస్ నేతలు అక్కడక్కడా నిరసనలు, రాళ్ల దాడులతో అడ్డుకునే ప్రయత్నం చేశారు. రాళ్ల దాడికి, నిరసనలకు బెదరకుండా బండి సంజయ్ ప్రజలను కలిసి వారి బాధలు వినడమే ధ్యేయంగా ముందుకు సాగుతూ పాదయాత్రను కొనసాగిస్తుండటం గమనార్హం
.విదేశాల్లో స్థిరపడ్డ ప్రవాసీయులు సైతం బండి సంజయ్ కు మద్దతు తెలుపుతుండం విశేషం. 10వ రోజు పాదయాత్రలో భాగంగా సుమారు 50 మంది ప్రవాసీయులు బండి సంజయ్ చేపట్టిన పాదయాత్రలో నడిచారు. నంగి దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పాదయాత్ర శిబిరం వద్ద 2వ విడత ప్రజా సంగ్రామ యాత్రలో ప్రవాసీయుల పేరిట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బండి సంజయ్ ప్రవాసీయులు విదేశాల్లో చేపట్టిన సేవా కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు..