‘‘బీజేపీ అధికారంలోకి వస్తే గ్రామ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. రాష్ట్రానికి సీఎంకు ఏ విధంగా అయితే బాస్ గా ఉంటారో… గ్రామానికి సర్పంచ్ సర్వాధికారిగా ఉంటారు. గ్రామాల్లో ఏయే అభివ్రుద్ధి పనులు కావాలనే విషయంపై గ్రామ ప్రజలే గ్రామ సభ నిర్వహించుకుని నిర్ణయం తీసుకునే అధికారం కల్పిస్తాం” అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ప్రకటించారు.
అంతిమంగా సర్పంచ్ లు, స్థానిక ప్రజాప్రతినిధులు గల్లా ఎగరేసుకునేలా వారి గౌరవాన్ని ఇనుమడింపజేస్తామని హామీ ఇచ్చారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజా సంగ్రామ యాత్ర 11వ రోజున లంచ్ శిబిరం వద్ద సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు సహా స్థానిక ప్రజా ప్రతినిధులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి నర్వ గ్రామ సర్పంచ్ సంధ్య అధ్యక్షత వహించారు.
కార్యక్రమానికి హాజరైన సర్పంచులు మాట్లాడుతూ తాము ఉత్సవ విగ్రహాల్లా మారామని ఆవేదన వ్యక్తం చేశారు. హరితహారం చెట్లు ఎండి పోయాయని తమకు నోటీసులిస్తూ వేధిస్తున్నారని వాపోయారు. తమ గ్రామాల్లో అభివ్రుద్ధి లేదని, రోడ్లు, మౌలిక సదుపాయాలే లేవని పేర్కొన్నారు. ముఖ్యంగా బీజేపీ సర్పంచులున్న చోట వేధింపులు ఎక్కువయ్యాయని తెలిపారు.
గ్రామాల్లో ప్రస్తుతం ఖర్చు చేస్తున్న నిధులన్నీ కేంద్రం ఇచ్చేవని, పల్లె ప్రగతి నిధులు సైతం కేంద్రానివేనని… కానీ సీఎం ఫోటోలు పెట్టుకుంటూ టీఆర్ఎస్ విగా ప్రచారం చేసుకుంటున్నారని చెప్పారు.
జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయ్యాక జార్ఘండ్ వెళ్లి సర్పంచ్ అధ్యక్షతన సమావేశం నిర్వహించి స్థానిక ప్రజాప్రతినిధులకు అత్యంత గౌరవమిస్తే కేసీఆర్ మాత్రం సర్పంచులను ఉత్సవ విగ్రహాలుగా మారుస్తూ అవమానిస్తున్నారని సంజయ్ విమర్శించారు.
గంగదేవిపల్లెలో సర్పంచులతో సీఎం సమావేశం నిర్వహించిన సమావేశానికి ఎమ్మెల్యే అధ్యక్షత వహింపజేసి ఆరోజు నుండే సర్పంచులను కేసీఆర్ అవమానించడం మొదలు పెట్టారని చెప్పారు. ఒక్కో గ్రామ పంచాయతీకి సగటును ఐదేళ్ల కాలానికి కోటి రూపాయలిస్తున్న ఘనత నరేంద్ర మోదీ ప్రభుత్వానిదే అని చెప్పారు.
దేశంలో 2 లక్షల 35 వేల పైచిలుకు గ్రామ పంచాయతీలుంటే… ఐదేళ్ల కాలానికి 2 లక్షల 68 వేల కోట్ల రూపాయలను కేంద్రం కేటాయిస్తోందని తెలిపారు. ఒకప్పుడు జడ్పీటీసీ, ఎంపీటీసీలకు గౌరవం, విలువ ఉండేది. కేసీఆర్ వచ్చాక వాళ్లను ఉత్సవ విగ్రహాలుగా మార్చి గౌరవం లేకుండా చేశారని ధ్వజమెత్తారు. ఎన్నికల్లో ఏకగ్రీవమైన గ్రామాలకు రూ.5 లక్షల ప్రోత్సహకం ఇవ్వాలి. కానీ కేసీఆర్ ఎందుకు ఇవ్వడం లేదో నిలదీయండని సంజయ్ చెప్పారు.