బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ను కాబోయే ముఖ్యమంత్రిగా మాజీ ఎంపీ, బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు పిఎ జితేందర్ రెడ్డి ప్రకటించడంపై రాష్ట్ర బీజేపీలో కలకలం రేగుతున్నది. సంజయ్ 12 రోజులుగా జరుగుతున్న ప్రజా సంగ్రామ యాత్ర రెండో దశ సందర్భంగా మక్తల్ లో సోమవారం సాయంత్రం జరిగిన బహిరంగ సభలో బండి సంజయ్ ముఖ్యమంత్రి అయితేనే రైతుల కష్టాలు తీరుతాయని జితేందర్‌రెడ్డి సంజయ్ సమక్షంలోనే పేర్కొనడం ఆ పార్టీలో రాజకీయ దుమారం రేపుతున్నది.
కొంత కాలంగా పార్టీలో సీనియర్లను దూరంగా పెడుతూ, సంజయ్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ పలువురు ఆయనకు వ్యతిరేకంగా కరీంనగర్ జిల్లాలో, హైదరాబాద్ లో కూడా సమావేశాలు జరుపుతున్నారు. వారికి నచ్చచెప్పేందుకు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు నల్లు ఇంద్రసేనారెడ్డి నాయకత్వంలో తీవ్ర ఫలితాలు చేసినా ప్రయోజనం లేకపోయింది.
అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నాయకుల పట్ల సంజయ్ కఠినంగా వ్యవహరిస్తూ ఉండడం, తాను చెప్పిన్నట్లు వింటేనే పార్టీలో ఉండాలనే విధంగా వ్యవహరిస్తూ ఉండడంతో పార్టీలో నాయకుల మధ్య అగాధం పెరిగి పోతున్నది. పైగా తనకు వ్యతిరేకంగా సమావేశాలు జరిపిన వారిని పార్టీ నుండి బహిష్కరించడం కోసం తీవ్రంగా ప్రయత్నించినా పార్టీ జాతీయ నాయకత్వం వారించినట్లు తెలుస్తున్నది.
ఈ మధ్యనే కొందరు నాయకులు తమకై తామే జిల్లాల పర్యటనలు చేస్తున్నారని, తమను తామే ముఖ్యమంత్రి అభ్యర్థులుగా భావిస్తున్నారని అంటూ సంజయ్ హెచ్చరిక చేశారు. బీజేపీలో అటువంటిది కుదరదని, సీఎం ఎవ్వరో పార్టీ అధిష్టానమే నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు. పైగా పార్టీలో నాయకత్వంకోసం పోటీ పాడగలరు అనుకున్న వారిని దూరంగా పెడుతున్నట్లు కూడా ఆరోపణలు వస్తున్నాయి.
ఈ మధ్యనే పార్టీ ఎమ్యెల్యే ఎన్ రఘునందన్ రావు రాష్ట్ర సంఘటన కార్యదర్శి మంత్రి శ్రీనివాసులును కలిసి తనను ఉద్దేశ్యపూర్వకంగా పలు సభలలో మాటలే అవకాశం ఇవ్వకుండా అవమానిస్తున్నారని అంటూ ఫిర్యాదు చేశారు. ముగ్గురు ఎమ్యెలు పార్టీకి ఉండగా, రాజాసింగ్ శాసనసభ పక్షం నాయకుడిగా ఉన్నారని, మిగిలిన ఇద్దరినీ విప్ గా, ఉపనాయకుడిగా ప్రకటించాలని రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ తరుణ్ ఛుగ్ చెప్పినా అమలు పరచడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రజలను సమీకరించి, సొంత నియోజకవర్గాలకు ఉన్నవారిని ఉద్దేశపూర్వకంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచుతున్నారని, ప్రజలలో బలం లేని నాయకులనే దగ్గరకు చేరుస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఈ సందర్భంగా జితేందర్ రెడ్డి చేసిన ప్రకటన ఉద్దేశపూర్వకంగా తనను `కాబోయే ముఖ్యమంత్రి అభ్యర్థిగా’ ప్రచారం చేసుకోవడం కోసం సంజయ్ వేసిన ఎత్తుగడగా పలువురు భావిస్తున్నారు.
గతంలో బిజెపి ఎంపీగా ఉంది, కేంద్ర మంత్రి పదవి ఇవ్వలేదని మొదట కాంగ్రెస్ లోకి, తర్వాత టి ఆర్ ఎస్ లోకి వెళ్లి, 2014లో టి ఆర్ ఎస్ ఎంపీగా గెలుపొంది, 2019లో ఆ పార్టీ తిరిగి సీట్ ఇవ్వకపోతే బిజెపిలోకి వచ్చిన జితేందర్ రెడ్డికి సంజయ్ కొంతకాలంగా ఇస్తున్న ప్రాధాన్యత పార్టీలో చాలామందికి విస్మయం కలిగిస్తున్నది. దుబ్బాక, హుజురాబాద్ ఉపఎన్నికలకు ఆయనను ఇన్ ఛార్జ్ గా నియమించారు.
పార్టీ ఎస్సి రిజర్వేడ్ నియోజకవర్గాలపై దృష్టి సారించాలని నిర్ణయించడంతో, వాటికి కూడా ఆయననే ఇన్ ఛార్జ్ గా ప్రకటించారు. అయితే ఒకటి, రెండు సమావేశాలు జరపడం తప్ప ఇప్పటి వరకు ఒక్క నియోజకవర్గం వైపు కూడా ఆయన చూసిన దాఖలాలు లేవు.
చాలాకాలంగా తెలంగాణలో పార్టీ వ్యవహారాలపై ఆధిపత్యం వహిస్తున్న కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఇప్పటికే సంజయ్ `ఏకపక్ష ధోరణులు’ పట్ల అసంతృప్తిగా ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది. మొదట్లో ప్రజా సంగ్రామ్ యాత్రలో పాల్గొన్న ఆయన ఆ తర్వాత దూరంగా ఉంటున్నారు.
ఓబిసి మోర్చా జాతీయ అధ్యక్షుడు డా. కె లక్ష్మణ్, మరో ఎమ్యెల్యే, మాజీ మంత్రి ఈటెల రాజేందర్ వంటి నేతలు సహితం అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మధ్య ప్రదేశ్ ఇన్ ఛార్జ్ పి మురళీధరరావు సహితం దూరంగానే ఉంటున్నారు.
కేవలం క్షేత్రస్థాయిలో నాయకత్వం బలపడకూడదనే పలు నియోజకవర్గాలకు ఇన్ ఛార్జ్ లను కూడా నియమించడం లేదనే విమర్శలు ఉన్నాయి. 2023లో తెలంగాణాలో అధికారంలోకి రావాలని బీజేపీకి కేంద్ర నాయకత్వం పట్టుదలగా ఉండగా, రాష్ట్రంలో పార్టీలో శృతి మించుతున్న ముఠా తగాదాలు పార్టీకి రాజకీయంగా కోలుకోలేని దెబ్బ కలిగించగలవని పార్టీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.