ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు మంగళవారం కొరడా ఝుళిపించింది. పదేపదే ఆమోదయోగ్యం కాని ప్రసంగాలు చేస్తున్నప్పటికీ.. ధర్మ సంసద్‌లను నిర్వహించకుండా నిరోధించేందుకు చర్యలు చేపట్టడంలో రాష్ట్రాలు విఫలమవ్వడంపై మండిపడింది.
ధర్మ సంసద్‌లో విద్వేషపూరిత ప్రసంగాలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌పై కోర్టు విచారణ చేపట్టింది. ‘అక్కడ స్పీకర్లు (ప్రసంగీకులు) ఏం చెబుతున్నారో మాకు తెలియదు. ఈవెంట్ నిర్వహించాలనుకుంటామని అడిగితే అనుమతిని తిరస్కరించలేమ’ని ఉత్తరాఖండ్ న్యాయవాది వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టింది.
‘ఇటువంటి ఆమోద యోగ్యం కాని ప్రసంగాలను నిరోధించాలి. మాట్లాడేవారు ఒకే విధంగా ఉంటే.. సమస్య ఉంటుందని తెలియదని తెలివిగా వాదన చేసి తప్పించుకోలేర’ని కోర్టు స్పష్టం చేసింది. ఇటువంటి విద్వేషపూరిత ప్రసంగాలు చేయకుండా ఏం చర్యలు తీసుకున్నారో తెలియజేయాలని ఇరు రాష్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది.
ఈ ఈవెంట్ల గురించి ముందే ప్రకటిస్తుండగా.. విద్వేష పూరిత ప్రసంగాలు నిరోధించేలా ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించింది. పిటిషనర్ల తరుపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ వాదనలు వినిపించారు.
ఇప్పుడు రూర్కీలో ఇటువంటి సంసద్ నిర్వహించబోతున్నారని సిబాల్ కోర్టుకు తెలిపారు. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని ఉత్తరాఖండ్ న్యాయవాదిని కోరారు. తాము ఎఫ్ఐఆర్లు నమోదు చేశామని, ఈవెంట్‌ను నిర్వాహకులు రద్దుచేసుకునే ప్రయత్నాలు చేపట్టామని తెలిపారు.