దేశంలో పెరుగుతున్న కరోనా కేసుల గురించి సమీక్షించడం కోసం బుధవారం నిర్వహించిన ముఖ్యమంత్రుల సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ చివరిలో పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలను ప్రస్తావిస్తూ బిజెపియేతర ప్రభుత్వాలు వాల్యూ యాడెడ్ టాక్స్ (వ్యాట్)ను తగ్గించాలని కోరడంపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. ముఖ్యంగా, కాంగ్రెస్, శివసేన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.
నిరంతరం వీటి ధరలను పెంచడం ద్వారా కేంద్ర ప్రభుత్వం రూ.26 లక్షల కోట్లు ఆర్జించిందని చెప్తూ, కేంద్ర ఎక్సయిజ్ సుంకాన్ని మరింత తగ్గించాలని డిమాండ్ చేశాయి. ఇంధన ధరల పెరుగుదలకు రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత వహించవని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే స్పష్టం చేశారు
బుధవారం ముంబైలో లీటర్ డీజిల్ ధరలో కేంద్రానికి రూ.24.38, రాష్ట్రానికి రూ.22.37. పెట్రోల్ ధరలో 31.58 పైసలు కేంద్ర పన్ను, 32.55 పైసలు రాష్ట్ర పన్నుగా వెళ్తున్నట్టు థాకరే తెలిపారు. అందువల్ల రాష్ట్రం కారణంగా పెట్రోల్, డీజిల్ ధర పెరగడం లేదని ఆయన చెప్పుకొచ్చారు. కాగా, మహారాష్ట్ర దేశంలోనే అత్యధికంగా 15 శాతం జీఎస్టీని వసూలు చేస్తుంది. ప్రత్యక్ష పన్నులు, జీఎస్టీ రెండింటినీ కలిపి మహారాష్ట్ర దేశంలోనే మొదటి స్థానంలో ఉంది.
అయితే, తమ ప్రభుత్వం ఇప్పటికే పౌరులకు సహజ వాయువుపై పన్ను మినహాయింపు ఇచ్చిందని సీఎం ఉద్ధవ్ ఠాక్రే చెప్పారు. సహజవాయువు వినియోగాన్ని ప్రోత్సహించేందుకు వాల్యూ యాడెడ్ ట్యాక్స్ ను 13.5 శాతం నుంచి 3 శాతానికి తగ్గించినట్లు తెలిపారు. పైప్డ్ గ్యాస్ హోల్డర్లు, ప్రజా రవాణా లాభపడ్డాయని ఆయన తెలిపారు.
రాజకీయ అజెండా అన్న మమతా
కేంద్రం బీజేపీ పాలిత రాష్ట్రాలకు అనుకూలంగా వ్యవహరిస్తోందని, ఇతరులకు సవతి తల్లిగా వ్యవహరిస్తోందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. పెట్రోల్ పన్నును తగ్గించాలంటూ ప్రతిపక్ష రాష్ట్రాలకు ప్రధాని మోదీ చేసిన విజ్ఞప్తిలో ‘రాజకీయ ఎజెండా’ ఉందని ఆమె విమర్శించారు. ఇంకా, రాష్ట్ర ప్రభుత్వాలపై ‘భారం’ వేయవద్దని ఆమె కేంద్రాన్ని కోరారు.
కేంద్రం ధరలు పెంచుతూ రాష్ట్రాలను పన్నులు తగ్గించాలని కోరడం ప్రజలను పూర్తిగా తప్పుదారి పట్టించడమేనని ఆమె ధ్వజమెత్తారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మూడేళ్లుగా ఇంధనంపై రూ. 1 సబ్సిడీ ఇస్తోందని, ఫలితంగా రూ. 1,500 కోట్లు నష్టపోయిందని చెబుతూ దీనిని ప్రధాని మోదీ ప్రస్తావించలేదని ఆమె పేర్కొన్నారు.
‘ఇంధన ఆదాయాన్ని 50-50 పంచుకోవాలని మేము చెప్పాం. ఇందుకు కేంద్రం అంగీకరించలేదు. వారు 75 శాతం తీసుకుంటూ ఇంధనంపై లక్షల కోట్లు సంపాదించారు. రాష్ట్రాలకు ఏం ఇవ్వలేదు. కేంద్రం రూ. 97,000 కోట్లు బెంగాల్‌కు బకాయిపడింది. ఆ డబ్బు నాకు ఇవ్వండి. మేము సబ్సిడీలు ఇస్తాం. సామాన్యులకు మేం ఉపశమనం కలిగించకూడదనుకోవడం నిజం కాదు. కేంద్రమే మాపై భారీ భారం మోపుతోంది’ అని మమతా ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేసీఆర్ ఆగ్రహం
కేంద్రం లేని సెస్సులు ఎందుకు పెంచుతోందని ప్రశ్నించిన తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఏ నోటితో రాష్ట్రాలను తగ్గించాలని అడుగుతారని మండిపడ్డారు. ఇదేం పద్దతి? ప్రధాని మాట్లాడే మాటలేనా? అని నిలదీశారు. టీఆర్ఎస్ 21వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ కరోనా కాన్ఫరెన్స్ పెట్టి రాష్ట్రాలు పెట్రోల్‌పై పన్నులు తగ్గించమంటారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రధాని మోదీ డ్రామా కాన్ఫరెన్స్ పెట్టారని ఆయన విమర్శించారు. తామెప్పుడు పెట్రోల్ ధరలు పెంచామని ప్రశ్నించిన కేసీఆర్.. తెలంగాణ వచ్చిన తర్వాత పెట్రోల్, డీజిల్‌పై ట్యాక్స్ పెంచలేదని స్పష్టం చేశారు. పన్నులు పెంచిన పాపాల భైరవులు కేంద్ర పెద్దలేనని ధ్వజమెత్తారు.
‘ఆర్టీసీని అమ్మే రాష్ట్రాలకు వెయ్యి కోట్ల ప్రైజ్ మనీ అట?. ఎనిమిదేళ్లలో మోదీ ఏం అభివృద్ధి చేశారు. ఏ రంగం అభివృద్ధి జరిగింది. పన్నులు పెంచేది మీరు.. రాష్ట్రాలు తగ్గించాలా.. ఇదెక్కడి నీతి. మోదీ గారు ఇక మీ ఆటలు కొనసాగవు. ప్రజాస్వామ్యం ఇంకా చచ్చిపోలేదు’ అంటూ విమర్శించారు.
కాంగ్రెస్ మండిపాటు
కాంగ్రెస్ నేత పవన్ ఖేరా ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, ఆయన (మోదీ-కేంద్ర ప్రభుత్వం) పెట్రోలు, డీజిల్‌లపై సెంట్రల్ ఎక్సయిజ్ సుంకం ద్వారా వసూలు చేస్తున్న రూ.26 లక్షల కోట్లను రాష్ట్రాలకు పంపిణీ చేశారా? అని ప్రశ్నించారు. జీఎస్టీ వాటాను రాష్ట్రాలకు సకాలంలో ఇవ్వకుండా రాష్ట్రాలను వ్యాట్ తగ్గించుకోవాలని అడుగుతున్నారని ఎద్దేవా చేశారు. ఆయన (మోదీ) ముందు కేంద్ర ఎక్సయిజ్ డ్యూటీని తగ్గించాలని, ఆ తర్వాత వ్యాట్ తగ్గించాలని ఇతరులను కోరాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ నేత దీపేందర్ ఎస్ హుడా మీడియాతో మాట్లాడుతూ, పెట్రోలు ధరల పెరుగుదలపై కేంద్ర ప్రభుత్వం తన కర్తవ్యాన్ని తప్పించుకుంటోందని విమర్శించారు. బీజేపీ పరిపాలిస్తున్న హర్యానాలో పెట్రోలు, డీజిల్‌లపై అత్యధిక వ్యాట్ ఉందని గుర్తు చేశారు. అంతర్జాతీయ మార్కెట్లలో ఇంధనం ధరలు పెరిగినపుడు మన దేశంలో కూడా వాటి ధరలను పెంచుతున్నారని, అయితే అంతర్జాతీయంగా గోధుమల ధరలు పెరిగినపుడు మాత్రం కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)ని పెంచడం లేదని ఆరోపించారు.
శివసేన అధికార ప్రతినిధి ప్రియాంక చతుర్వేది ఇచ్చిన ట్వీట్లో, కరోనా మహమ్మారిపై ఏర్పాటు చేసిన సమావేశాన్ని రాజకీయాల కోసం వినియోగించుకుంటున్నారా? అని నిలదీశారు. ఇంధనం ధరలు అతి తక్కువకు క్షీణించినపుడు సైతం వీటి ధరలను 18 సార్లు పెంచిందని ఆమె గుర్తు చేశారు. జీఎస్టీ వాటాను, జీఎస్టీ నష్టపరిహారాన్ని రాష్ట్రాలకు ఇవ్వలేదని, ఇప్పుడు వేళ్లు చూపిస్తున్నారని ఆమె మండిపడ్డారు.
ప్రధాని మోదీ ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ లో. కేంద్ర ప్రభుత్వం గత నవంబరులో ఎక్సయిజ్ సుంకాన్ని తగ్గించినప్పటికీ, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆ ప్రయోజనాన్ని ప్రజలకు అందజేయలేదని గుర్తు చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాలు తమ వ్యాట్‌ను తగ్గించుకుని, ప్రజలకు ప్రయోజనం చేకూర్చాలని ఆయన కోరారు.