దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోతూ ఉండడంతో సామాన్య ప్రజలలో పెరుగుతున్న అసహనాన్ని గమనించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆ అపవాదును బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వంపై నెట్టేందుకు కరోనా తీవ్రతపై సమీక్ష జరిపేందుకు ముఖ్యమంత్రులతో జరిపిన వీడియో కాన్ఫరెన్స్ లో ప్రయత్నం చేశారు.
కేంద్రం రెండు సార్లు సుంకాలు తగ్గించి, రాష్ట్ర ప్రభుత్వ్హాలను వ్యాట్ తగ్గించమని కోరినా పలు రాష్ట్రాలు (బిజెపియేతర) తగ్గించలేదని విచారం వ్యక్తం చేశారు. వారిని వ్యాట్ తగ్గించి, ధరలు తగ్గించమని అభ్యర్థించడం ద్వారా ఈ విషయంలో కేంద్రం చేయగలిగింది ఏమీ లేదనే సంకేతం ఇచ్చారు.
ఆ వెంటనే కేంద్రం నిరంతరం వీటి ధరలను పెంచడం ద్వారా రూ.26 లక్షల కోట్లు ఆర్జించినా రాష్ట్రాలకు తగు వాటా ఇవ్వడం లేదని, పైగా కనీసం జిఎస్టి పరిహారం బకాయిలు కూడా చెల్లించడం లేదని పలువురు ముఖ్యమంత్రులు మండిపడ్డారు. ఈ బకాయిలు చెల్లిస్తే తాము కొంత మేరకు ధరలు తగ్గిస్తామంటూ చెప్పుకొచ్చారు.
బీజీపీయేతర ముఖ్యమంత్రుల విమర్శలకు బలం చేకూర్చేవిధంగా ఆ సమయంలోనే జిఎస్టి పరిహారంగా రాష్ట్రాలకు రూ. 78,704 కోట్లు కేంద్రం బకాయి పడినట్లు కేద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ఆర్ధిక శాఖ ఇంత `తెలివితక్కువ’గా ఏవిధంగా వ్యవహరించిందని మాజీ ఆర్ధిక మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పి చిదంబరం విస్మయం వ్యక్తం చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రాలను మందలించిన రోజే ఆర్థిక శాఖ ఈ విషయాన్ని బయటపెట్టి ఆయనను ఇరకాటంలో ఎందుకు పెట్టిందో తెలుసుకోవాలన్న ఆకాంక్షను చిదంబరం వ్యక్తం చేశారు. 2022 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్రాలకు చెల్లించాల్సిన జిఎస్టి పరిహారం బకాయిలలో ఎనిమిది నెలల బకాయిలను కేంద్రం ఇదివరకే విడుదల చేసిందని, సెస్ నిధిలో తగిన నిల్వలు లేని కారణంగా రూ. 78,704 కోట్ల బకాయిలను రాష్ట్రాలకు ఇంకా చెల్లించలేదని ఆర్థిక శాఖ బుధవారం ప్రకటించింది.
అదే రోజున ప్రధాని మోదీ పెట్రోల్, డీజిల్పై వ్యాట్ రేటును తగ్గించుకోవాలంటూ రాష్ట్ర ముఖ్యమంత్రులను మందలిస్తూ క్లాసు తీసుకున్నారని చిదంబరం ఎద్దేవా చేశారు. వాస్తవానికి రాష్ట్రాలకు చెల్లించాల్సిన జిఎస్టి బకాయిల మొత్తం ఇంకా ఎక్కువే ఉందని, కంట్రోలర్ ఆఫ్ గవర్న్మెంట్ అకౌంట్స్(సిజిఎ) మాత్రమే సరైన లెక్కలు చెప్పగలరని పేర్కొంటూ చిదంబరం ట్వీట్ చేశారు.