ఈశాన్య ప్రాంత ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వివాదాస్పద సైనిక దళాల ప్రత్యేక అధికారాల చట్టం (ఎఎఫ్ఎస్పిఎ) నుఈశాన్య ప్రాంతం అంచెలంచెలుగా ఉపసంహరించుకునేందుకు ప్రయత్నిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ ప్రాంత ప్రజలకు హామీ ఇచ్చారు.
అస్సాంలోని కర్బీ అంగ్లాంగ్ జిల్లాలోని లోరింగ్ధెపిలో గురువారం ‘శాంతి, ఐక్యత, అభివృద్ధి’ పేరుతో నిర్వహించిన ర్యాలీనుద్దేశించి ఆయన ప్రసంగిస్తూ గత ఎనిమిదేళ్ల నుంచి శాంతి భద్రతల పరిస్థితి మెరుగవుతున్న కారణంగా ఈ ప్రాంతంలో విధించే చట్టాల తీరులో మార్పు వస్తోందని పేర్కొన్నారు.
ఎఎఫ్‌ఎస్‌పిఎను మొదట త్రిపురలోను, తరువాత మేఘాలయలోను రద్దు చేశామని తెలిపారు. ఈ నెల ఒకటిన నాగాలాండ్, అస్సాం, మణిపూర్‌ల్లోని కొన్ని ప్రాంతాల్లో ఎఎఫ్‌ఎస్‌పిఎను వెనక్కి తీసుకున్నామని వివరించారు.
ఈ క్రూరమైన చట్టాన్ని రక్షణ కవచంగా భావించిన భద్రతా దళాలు ఈశాన్య ప్రాంత ప్రజలపై పాల్పడుతున్న అకృత్యాలకు అడ్డు అదుపులేకుండా పోయిందనే విమర్శలు చెలరేగుతున్నాయి. గత ఏడాది డిసెంబరులో నాగాలాండ్‌లో 14 మంది యువకులైన బగ్గుగని కార్మికులను అస్సాం రైఫిల్స్‌కు చెందిన ప్రత్యేక బలగాలు అమానుషంగా పొట్టనబెట్టుకున్నాయి.
దీనికి వ్యతిరేకంగా స్థానికులు నిరసన తెలిపితే వారిపై సాయుధ బలగాలు కాల్పులు జరిపాయి. దీంతో మరో ఎనిమిది మంది చనిపోయారు. 1958 నుంచి ఈశాన్య ప్రాంతంలో ఎఎఫ్‌ఎస్‌పిఏ అమలులో ఉంది. కేంద్రంలో మోదీ ప్రభుత్వం వచ్చాక దీనిని మరిన్ని ప్రాంతాలకు విస్తరించింది. బెంగాల్, పంజాబ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో వీటి పరిధినిపెంచింది.
1990లో జమ్మూ కాశ్మీర్‌కు కూడా ఈ సైనిక ప్రత్యేకాధికారాల చట్టాన్ని విస్తరింపజేసి ఇప్పటికీ అక్కడ అమలు చేస్తోంది. ఈశాన్యంలోను, జమ్మూ కాశ్మీర్లోను గత మూడు దశాబ్దాలలో అనేక మందిపై అత్యాచారాలు, అకృత్యాలు చోటుచేసుకున్నాయి. వీటికి కారకులైనవారిని ప్రాసిక్యూట్ చేయాలంటే కేంద్ర ప్రభుత్వ అనుమతి పొందాల్సి ఉంటుంది. దీనిని రద్దు చేయాలని హక్కుల కార్యకర్తలు, ఈశాన్య ప్రాంత ప్రభుత్వాలు ఎప్పటి నుంచో కోరుతున్నాయి.