ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇంకా వలసలు కొనసాగడానికి ముమ్మాటికీ బాధ్యుడు కేసీఆరేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు. వడ్ల కొనుగోలు పేరుతో డ్రామాలు చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంకా కొనుగోలు కేంద్రాలు ఎందుకు ప్రారంభించలేదని ప్రశ్నించారు.
ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా శుక్రవారం 16వ రోజు పాదయాత్ర చేస్తున్న సంజయ్ కుమార్ నారాయణపేట పట్టణంలోని మైదానంలో జరిగిన భారీ బహిరంగసభలో మాట్లాడుతూ పాలమూరులో వలసలు ఆగాయంటూ కేసీఆర్ పచ్చి అబద్దాలు చెబుతున్నడు అని విమర్శించారు.
ఈరోజు పాదయాత్ర చేస్తుంటే నారాయణపేట నుండి ముంబయి వెళుతున్న బస్ కన్పించిందని చెబుతూ ఆ బస్సెక్కి ప్రయాణీకులను, డ్రైవర్ ను అడిగితే రోజూ ముంబయికి వలసలు వెళతారని తెలిసిందని చెప్పారు. చిన్న పిల్లలు, చంటి పిల్లల తల్లులు కూడా వలస వెళుతున్నరు. చిన్నపిల్లలు ఏడుస్తూ చెబుతున్న బాధలు చూస్తే ఏడుపొచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
పెట్రోలు ధరలు పెంచి జనంపై భారం మోపారంటూ కేంద్రాన్ని బదనాం చేస్తున్న కేసీఆర్… గత 8 ఏళ్లలో వ్యాట్ పేరుతో పెట్రోలు, డీజిల్ పై రూ.69 వేల 334 కోట్లు దోచుకుందని మండిపడ్డారు.
ఆ డబ్బంతా ఎవరి జేబులో వేసుకున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణను అడ్డుకున్న ఎంఐఎంతో సిగ్గు లేకుండా దోస్తానా చేస్తున్న టీఆర్ఎస్ నేతలు హిందూ ధర్మం కోసం పనిచేస్తున్న వారిని మతతత్వవాదులుగా ముద్ర వేస్తూ కేసులు పెడుతూ ఇబ్బందులు పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రంజాన్ పండుగొస్తే… ఇఫ్తార్ పేరుతో బాదం, పిస్తాలు పంచుతూ డ్యూటీలు చేసే విషయంలో వెసులుబాటు కల్పిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం అయ్యప్ప స్వామి, హనుమాన్, శివ భక్తులకు పూజలు చేసుకునేందుకు ఎందుకు వెసులుబాటు ఇవ్వలేదని ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి వస్తే పాలమూరును సస్యశ్యామలం చేస్తామని, వలసలను నివారిస్తామని హామీ ఇచ్చారు.
69 జీవోను అమలు చేసి మక్తల్, నారాయణపేట, కొడంగల్ నియోజకవర్గాలకు 2 లక్షల ఎకరాలకు సాగునీరందిస్తామని ప్రకటించారు. జయమ్మ చెరువు ప్రాంతాన్ని పర్యాటక కేంద్రాన్ని తీర్చిదిద్దుతామని చెప్పారు.
మొదటి ప్రజా సంగ్రామ యాత్రతో ప్రజలకు బీజేపీపట్ల నమ్మకం కలిగిందని, రెండ విడత ప్రజా సంగ్రామ యాత్ర పేదల అండదండలతో సంగ్రామ సేన కష్టార్జితంతో నిరాటంకంగా కొనసాగుతోందని తెలిపారు. పాలమూరును చూస్తుంటే బాధేస్తోందని, ఎడారిని తలపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. పాలమూరు ఉమ్మడి జిల్లా ప్రజలు నిజాయితీతో, నిబద్దత కలిగిన వాళ్లు. పాలమూరుకు అన్యాయం చేస్తే పుట్టగతులుండవని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.