ఒకవైపు చేనేత కార్మికుల కష్టాలు, ఇంకోవైపు వ్యవసాయం భారమై పొట్టకూటి కోసం వలస వెళ్లడంతో శిథిలమైన ఇండ్లు, ఇంకోవైపు నీళ్లు లేక వ్యవసాయం చేయలేకపోతున్నామంటూ రైతులు పడుతున్న బాధలు… ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా 17వ రోజు పాదయాత్ర చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ నారాయణ పేట నియోజకవర్గంలో శనివారం కన్పించిన ద్రుశ్యాలివే.
ఉదయమే నారాయణ పేట పట్టణం శివారు నుండి ప్రారంభమైన బండి సంజయ్ పాదయాత్ర భీవండి కాలనీ, సింగారం గేట్, జాజాపూర్, గడ్డమీద అప్పంపల్, చిన్నజెట్రం, పెద్ద జెట్రం, అంత్వర గేట్ మీదుగా కొనసాగింది. సింగారం గేటు వద్ద రైతు సదస్సులో పాల్గొన్న బండి సంజయ్ కు రైతులు తమ కష్టాలు ఏకరవు పెట్టారు. సాగునీరు లేక వ్యవసాయం చేసుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
69 జీవోను అమలు చేసి జయమ్మ చెరువు, జాజాపూర్ చెరువులను నింపితేనే తమకు సాగు నీరొస్తుందని చెప్పారు. సాయంత్రం చిన్న జెట్రం గ్రామంలో బండి సంజయ్ టీ కొట్టు వద్దకు వెళ్లగానే అక్కడ రైతులు కన్పించారు. వారితో కాసేపు ‘ఛాయ్ పే చర్చ’ కార్యక్రమాన్ని నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
రైతు రుణమాఫీ కాలేదని, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం జాడే లేదని, తాగునీరు, సాగునీరు ఊసే ఎరుగమని, కాలువ నిర్మాణం జరగలేదని, ఆసుపత్రి లేదని రైతులు ఏకరవు పెట్టారు. 69 జీవోను అమలు చేసి తమ ప్రాంతానికి సాగునీరిచ్చి మమ్మల్ని ఆదుకోవాలని మొరపెట్టుకున్నారు.
‘బీజేపీ సర్కార్’ ఏర్పడిన వెంటనే ఇక్కడ జీవో 69 ని అమలు చేసి నారాయణపేట-మక్తల్-కొడంగల్ నియోజకవర్గాల్లోని 2 లక్షల ఎకరాలకు సాగునీరందించి.. ఆయా ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తామని హామీ ఇచ్చారు.
జాజాపూర్ లో చేనేత కుటుంబాల ఇళ్లకు వెళ్లారు. చేనేత మగ్గాలను సందర్శించారు. అనంతరం జాజాపూర్ గ్రామంలో జరిగిన ‘చేనేత సదస్సు’లో జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్, ఇంఛార్జ్ నాగూరావు నామోజీ, నియోజకవర్గ ఇంఛార్జీ రతంగ పాండురెడ్డి లతో కలిసి బండి సంజయ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చేనేత కార్మికులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఏకరవు పెట్టారు. ఒకప్పుడు తమ గ్రామంలో 500 మగ్గాలుంటే… నేడు 10 కూడా లేవని వాపోయారు. బతకడమే కష్టంగా ఉందని వాపోయారు. తమ ప్రాంతంలో టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు చేస్తే తమకు ప్రయోజనం కలుగుతోందని స్థానిక చేనేత కార్మికుడు ఆనంద్ పేర్కొన్నారు.
చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ గా హీరోయిన్ ను పెట్టుకున్న కేటీఆర్ చేనేతలకు చేసిన సాయమేంది? అని సంజయ్ ప్రశ్నించారు. చేనేత కార్మికుల అమాయకత్వాన్ని రాజకీయ లబ్ది కోసం వాడుకుంటున్నారని విమర్శించారు. . సమస్యను పరిష్కరించే అధికారం ఉన్నా… ఆ తపన మాత్రం కరువైందని ధ్వజమెత్తారు. సిరిసిల్లలోనూ చేనేతల దుస్థితి మారలేదు. బతకమ్మ చీరెల బిల్లలు ఇంతవరకు రానేలేదని చెప్పారు.
కేంద్రం చేనేత కార్మికులను ఆదుకునేందుకు అనేక పథకాలు ప్రవేశపెట్టినా రాష్ట్రంలో వాటిని అమలు చేయకుండా కేసీఆర్ అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఈ ఒక్కసారి బీజేపీకి అధికారం ఇస్తే చేనేతల సమస్యలను పరిష్కరిస్తామని, చేనేత క్లస్టర్ ను ఏర్పాటు చేస్తామని. వారిని అన్ని విధాలా ఆదుకుంటామని సంజయ్ భరోసా ఇచ్చారు.
వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని, ధైర్యంగా ఉండాలని వారికి సూచిస్తూ ముందుకు సాగారు. అదే గ్రామంలోని శిథిలిమైన చిన్న కనకప్పకు చెందిన పెంకుటిళ్లను సందర్శించారు. వారంతా పొట్ట చేతపట్టుకుని బొంబాయి వలస వెళ్లారని తెలుసుకున్న బండి సంజయ్ వాళ్లకు ఫోన్ చేసి మాట్లాడారు.
ఈ సందర్భంగా కనకప్ప మాట్లాడుతూ ‘‘సార్… మాకు పొలముంది. కానీ నీళ్లు లేవు. గతంలో వ్యవసాయం చేసి బాగా నష్టపోయినం. రూ.6.5 లక్షల అప్పయింది. ఉపాధి లేదు.. బతకడానికి పొట్ట చేతపట్టుకుని బొంబాయి పోయినం’’అని వాపోయారు. వారి బాధను విన్న బండి సంజయ్ మరో ఏడాది ఓపిక పట్టాలని.. బీజేపీ ప్రభుత్వం వచ్చాక ఈ ప్రాంతంలో 69 జీవోను అమలు చేసి సాగు నీరందిస్తామని హామీ ఇస్తూ ముందుకు సాగారు.
అక్కడి నుండి పెద్దజెట్రం గేట్ వద్దకు వెళ్లిన బండి సంజయ్ కు స్థానిక ప్రజలు, పార్టీ కార్యకర్తలు అపూర్వ స్వాగతం పలికారు. ఆ గ్రామంలో బీజేపీ జెండాను ఆవిష్కరించడంతోపాటు స్థానికుల కోరిక మేరకు నీళ్ల ట్యాంక్ ను ప్రారంభించారు.
అనంతరం అక్కడి నుండి అంత్వర గేటు వద్దకు చేరుకుని అక్కడ సైతం బీజేపీ జెండాను ఆవిష్కరించడంతోపాటు అక్కడే ఉన్న మాదాసి కురువ సంఘాల నాయకుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అంత్వర గేటు సమీపంలో రాత్రి బస చేశారు.