”కోర్టు తీర్పులను తరచూ ప్రభుత్వాలు ఏళ్ల తరబడి అమలు చేయడం లేదు. ఇది కోర్టు ధిక్కారణ పిటిషన్‌కు దారి తీస్తుంది. ఇది ప్రభుత్వ ధిక్కారానికి ప్రత్యక్ష ఫలితం. ఇది ప్రజాస్వామ్యానికి ఆరోగ్యకరం కాదు” అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ ఆందోళన వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రులు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు, లెఫ్టినెంట్ గవర్నర్ల 11వ సంయుక్త సదస్సులో శనివారం మాట్లాడుతూ విధి నిర్వహణలో న్యాయమూర్తులు తమ పరిమితులను గుర్తుంచుకోవాలని, లక్ష్మణ రేఖను దాటద్దని సూచించారు. శాసన, కార్యనిర్వాహక, న్యాయ శాఖలకు రాజ్యాంగం వేర్వేరు అధికారాలను కల్పించిందని పేర్కొన్నారు.
ప్రజాస్వామ్య బలోపేతానికి, సామరస్యంగా కార్యకలాపాలు సాగేందుకు ఇది దోహదం చేస్తుందని తెలిపారు. ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దుర్వినియోగం అవుతున్నాయని విచారం వ్యక్తం చేశారు. కొందరు వీటిని ‘పర్సనల్ ఇంట్రెస్ట్ లిటిగేషన్’గా మార్చుతూ.. వ్యక్తిగత వివాదాల పరిష్కారానికి ఉపయోగించుకోవడం బాధాకరమని చెప్పారు.
కోర్టుల్లో 56 శాతం కేసులు నమోదవుతున్న ప్రభుత్వమే అతిపెద్ద వ్యాజ్యమని గుర్తు చేశారు. దేశంలో న్యాయ వ్యవస్థ బలోపేతానికి మరిన్ని చర్యలు అవసరమని చెప్పారు. న్యాయ వ్యవస్థ, ప్రభుత్వం పరస్పర సహకారంతో ముందుకెళ్తే, ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుందని పేర్కొన్నారు.
న్యాయపరమైన తీర్పులు వచ్చినప్పటికీ ప్రభుత్వ ఉద్దేశపూర్వక చర్యలు ప్రజాస్వామ్యానికి అంత ఆరోగ్యకరం కావని అన్నారు. ప్రజలతో ప్రత్యక్షంగా ఎన్నికైన వారిని అందరూ గౌరవించాల్సిందేనని స్పష్టం చేశారు. అందరి విషయంలో చట్టం సమానంగా ఉంటుందని, బాధితులకు న్యాయం అందించడంలో అంతర్భాగంగా ఉంటుందని తెలిపారు.
క్షేత్ర స్థాయిలో అధికారవర్గం తన బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తే కోర్టుల్లో కేసులు తగ్గుతాయని పేర్కొన్నారు. న్యాయవ్యవస్థలో మౌలిక వసతులను త్వరితగతిన ఏర్పాటు చేయాలని సూచించారు. న్యాయ వ్యవస్థలో ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేయాలని, ఏడాది కాలంగా జడ్జీల నియామకాల్లో ప్రభుత్వం పూర్తిగా సహకరించిందని చెప్పారు.