ఇప్పటికే అవినీతి ఆరోపణలు చేస్తూ బిజెపి కార్యకర్త ఒకరు ఆత్మహత్య చేసుకోవడంతో సీనియర్ మంత్రి, మాజీ ముఖ్యమంత్రి కె ఎస్ ఈశ్వరప్ప మంత్రిపదవికి రాజీనామా చేయవలసి రావడంతో ఓ పెద్ద కుదుపుకు గురైన కర్ణాటకలోని బిజెపి ప్రభుత్వం తాజాగా ఎస్ఐ పరీక్షల కుంభకోణం వెంటాడుతున్నది.
ఎస్ఐ పోస్టుల రాత పరీక్ష కుంభకోణంలో రోజురోజుకూ కొత్త పేర్లు తెరపైకి వస్తుండడంతో హోమ్ మంత్రి ఆరాగా జ్ఞానేంద్ర రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. ఇప్పటికే కీలక నిందితురాలిగా భావిస్తూ బీజేపీ నాయకురాలు దివ్య హాగరగిని అరెస్ట్ చేసి సిఐడీ అధికారులు రెండు రోజులుగా ఆమెను ప్రశ్నిస్తున్నారు.
బెంగళూరులోనూ 7 పరీక్ష కేంద్రాల్లో కొందరు అక్రమాలకు పాల్పడి ఉత్తీర్ణులైనట్లు తెలిసింది. దీనికి సంబంధించి హైగ్రౌండ్ పోలీసులు 12 మందిని అరెస్టు చేయగా వారిలో ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉన్నట్లు సమాచారం. ఇతడు పది లోపు ర్యాంకులో ఉత్తీర్ణుడు కావడం గమనార్హం. ఓఎంఆర్ షీట్, కార్బన్ షీటులో వ్యత్యాసం బయటపడింది. మరో 10 మంది అభ్యర్థుల కోసం గాలిస్తున్నారు.
ఈ స్కాంలో 20 రోజులుగా పరారీలో ఉన్న మరో కింగ్‌పిన్ నీటిపారుదల శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ మంజునాథ మేళకుంద ఆదివారం కలబురిగి నగరంలో సీఐడీ ఆఫీసుకు ఆటోలో వచ్చి లొంగిపోయాడు. ఈ బాగోతంలో తన పాత్ర లేదని, ఆరోగ్యం సరిగా లేకపోవడంలో మంగళూరులో ఉన్నట్లు మీడియాతో చెప్పాడు.
తన పేరు అనవసరంగా వెలుగులోకి వచ్చిందని చెబుతున్నారు. మంజునాథ తమ్ముడు రవీంద్ర, ప్రధానోపాధ్యాయుడు కాశీనాథ్, అభ్యర్థి శాంతాబాబు ఇంకా పరారీలో ఉండగా, 10 బృందాలతో మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో గాలిస్తున్నారు.
దివ్య హాగరగి నుంచి సీఐడీ అధికారులు కీలక సమాచారం రాబట్టినట్లు భావిస్తున్నారు. కింగ్‌పిన్ రుద్రేగౌడ పాటిల్, మంజునాథ మేళకుందతో కలిసి బ్లూటూత్ ఉపకరణాలను ఉపయోగించి సమాధానాలు చెప్పడానికి గాను లక్షలాది రూపాయలు డీల్ కుదుర్చుకున్నట్లు విచారణలో తేలింది.
దివ్య హాగరగి సహకారంతో, కలబురిగి జ్ఞానజ్యోతి పాఠశాల హెచ్ఎం కాశీనాథ్‌తో కలిసి పధకం వీసారు. రుద్రేగౌడ పాటిల్‌తో పాటు కొందరు పోలీస్ అధికారులు, కానిస్టేబుళ్లు కుమ్మక్కైనట్లు అనుమానాలున్నాయి. ఇందులో ఇద్దరు డీఎస్పీలు, ఒక సీఐ, కొందరు కానిస్టేబుల్స్ పేర్లు వినబడుతున్నాయి.
ఏయే అభ్యర్థులకు సహాయం చేయాలి? అనే దానిపై పోలీస్ అధికారులే రుద్రేగౌడకు సూచనలిచ్చారు. పరీక్ష పూర్తయిన తరువాత కానిస్టేబుల్స్ ద్వారా అభ్యర్థులు డబ్బులు అందజేశారు. ఎవరికి ఎంత ఇవ్వాలి అనేది రుద్రేగౌడ నిర్ణయించాడని భావిస్తున్నారు.
ఈ కుంభకోణం వెలుగు చూడడంతో ఎస్ఐ లుగా ఎంపిక చేసిన 545 మంది ఎంపికను ప్రభుత్వం రద్దు చేసింది. సిఐడి ఈ కుంభకోణంపై దర్యాప్తు చేస్తున్నది.