కాంగ్రెస్ ఎంపిలు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలపై హైకోర్టు న్యాయవాది రామారావు మంగళవారం నాడు జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థుల మధ్య ఘర్షణలు ప్రేరేపించే విధంగా శాంతి భద్రతల పరిరక్షణ, వివిధ అంశాలపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాలలో శాంతి భద్రతల సమస్య సృష్టించే ప్రయత్నం చేస్తుందని న్యాయవాది రామారావు ఆరోపించారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ ఈ ఫిర్యాదుపై దర్యాప్తు చేయనుంది. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పర్యటనను వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్వీ ఆందోళన చేపట్టింది.
ఈ సందర్భంగా వర్సిటీ ప్రాంగణంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను టిఆర్ఎస్వి నాయకులు దహనం చేసి నిరసన తెలిపారు. ఒయూలో రాహుల్ గాంధీ అడుగుపెడితే అడ్డుకుంటామని, తెలంగాణ అమరవీరుల కుటుంబాలను పరామర్శించిన తర్వాతే రాహుల్ ఒయూకు రావాలని డిమాండ్ చేశారు. ఉద్యమ సమయంలో ఏనాడూ గుర్తుకు రాని ఉస్మానియా యూనివర్సిటీకి ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారని ప్రశ్నించారు. ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టే పరిస్థితి తేవొద్దని సూచించారు.
కాగా, తెలంగాణ ఉద్యమానికి గుండెకాయ వంటి ఉస్మానియా యూనివర్సిటీకి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వస్తే టీఆర్ఎస్, టీఆర్ఎస్వికి అభ్యంతరమెందుకో స్పష్టం చేయాలని తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ డిమాండ్ చేశారు.
స్వరాష్ట్ర ఆకాంక్ష పోరాటానికి ఉస్మానియా కేరా్‌ఫగా మారితేనే తెలంగాణ వచ్చిందని, కేసీఆర్ సీఎం, నాటి విద్యార్థి నేతలు గాదరి కిషోర్, బాల్క సుమన్ ఎమ్మెల్యేలయ్యారని ఆయన గుర్తు చేశారు. శాంతి భద్రతలకు భంగం కలుగుతుందని టీఆర్‌ఎ్‌స ఫక్తు నిరంకుశ పాలకుల భాష మాట్లాడితే శ్రీకాంత చారి, సిరిపురం యాదయ్య, వేణుగోపాల్‌రెడ్డి ఆత్మలు ఘోషిస్తాయని హెచ్చరించారు.
ఇలా ఉండగా, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి పబ్‌ల గురించి విద్యార్థులకు చెబుతారా? అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ ఓయూను సందర్శించే విషయంలో అనుమతి గురించి ప్రభుత్వంపై విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
అనుమతి ఇవ్వడం వీసీ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. హనుమకొండ ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్లో కాంగ్రెస్ చేపట్టే సభతో ఒరిగేది ఏమిలేదని పేర్కొంటూ, కేవలం రాజకీయ ఉనికి కోసం ఆ పార్టీ తాపత్రయ పడుతోందన్నారు.