కర్ణాటకలో ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైని మార్చబోతున్నారని వస్తున్న కథనాలను బిజెపి కొట్టిపారవేసింది. బొమ్మై ముఖ్యమంత్రిగా, ఆయన సారథ్యంలోనే 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు వెడతామని ఆ పార్టీ స్పష్టం చేసింది.
బెంగళూరులో బసవ జయంతి సభలో పాల్గొనడానికి వచ్చిన అమిత్ షా సోమవారం అర్ధరాత్రి సిఎం బొమ్మైతో సమావేశమయ్యారు. మంగళవారం సిఎంతో సమావేశమై భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయనను కలసిన వారిలో మాజీ సిఎం యడ్యూరప్ప, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కటీల్ కూడా ఉన్నారు.
అయితే ఆయన అకస్మాత్తుగా బెంగుళూరు పర్యటన పెట్టుకున్నారని, ముఖ్యమంత్రి మార్పు విషయంపైననే వస్తున్నారని కధనాలు వెలువడ్డాయి. ప్రస్తుతం ఐరోపా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ తిరిగి రాగానే ముఖ్యమంత్రి మార్పు తధ్యం అనే ప్రచారం జరుగుతున్నది.
2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు పూర్తి స్థాయిలో కర్ణాటకలో నాయకత్వ మార్పులు ఉంటాయంటూ కూడా వార్తలు వెలువడ్డాయి. అయితే ఆ వార్తలు ఊహాజనితమేనని, ముఖ్యమంత్రిగా బసవరాజ్ బొమ్మై కొనసాగుతారని బిజెపి ప్రధాన కార్యదర్శి, కర్ణాటక పార్టీ వ్యవహారాల ఇన్చార్జి అరుణ్ సింగ్ మంగళవారం స్పష్టం చేశారు.
సిఎం మార్పు జరుగుతుందంటూ ఎవరూ కలలు కనవద్దని చురకలు అంటించారు. ముఖ్యమంత్రిని మార్చే ప్రసక్తే లేదని, పార్టీలో ఏ స్థాయిలో కూడా లేదని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లోనూ బిజెపికి బొమ్మై నాయకత్వం వహిస్తారని, అమిత్ షా కూడా ప్రకటించారని ఆయన గుర్తు చేశారు. ఆయన వ్యాఖ్యలను రెవెన్యూ మంత్రి ఆర్.అశోక కూడా సమర్ధించారు.
అయితే, ప్రస్తుతం బొమ్మై మంత్రివర్గంలో ఐదు ఖాళీలు ఉన్నాయని, రెండు, మూడు రోజుల్లో మంత్రివర్గ విస్తరణ ఉండవచ్చని ఆయన తెలిపారు.
ఊహాగానాలే అన్న యడియూరప్ప
దీంతో గుజరాత్ తరహాలో ముఖ్యమంత్రితో సహా మొత్తం మంత్రులతో పాటు రాష్ట్ర బిజెపి నాయకత్వాన్ని కూడా సమూలంగా మార్చనున్నారనే అంటూ కధనాలు గత వారం రోజులుగా రావడం ప్రారంభమయ్యాయి. అయితే అలాంటి వార్తలేమీ (నాయకత్వ మార్పు) తమ వద్ద లేదని, ఇవి కేవలం ఊహాగానాలేనని అప్పుడే మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప కొట్టిపారేశారు.
రాష్ట్రానికి ఇకపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ, మంత్రి అమిత్‌షా నిరంతరంగా వస్తుంటారని, ఈ విషయమై అమిత్‌షాతో తాను ప్రత్యేకంగా మాట్లాడతానని ఆయన తెలిపారు. ఈ ఇద్దరు అగ్రనేతలు రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి సారిస్తారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో 150 సీట్లు గెలిచే లక్ష్యంతో సిద్దమవుతున్నామని వెల్లడించారు.
తన ఉద్దేశ్యం ప్రకారం రాష్ట్రంలో ప్రస్తుతం నాయకత్వ మార్పు ఉండదని ఆయన స్పష్టం చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వడం కేంద్రంలోని పెద్దలు తీసుకునే నిర్ణయమని పేర్కొన్నారు. పార్టీని బలోపేతం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర పర్యటనకు సిద్దమైనట్లు తెలిపారు. బూత్ స్థాయి నుంచి పార్టీని ప్రగతి పథంలో తీసుకెళ్లేందుకు కార్యకర్తలను కలిసి చైతన్యం కల్పిస్తామని చెప్పారు.
బొమ్మై ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు స్వీకరించి 9 నెలలు మాత్రమే గడవడంతో ఇప్పుడు ముఖ్యమంత్రి మార్పుతో బిజెపికి కొత్త తలనొప్పులు వస్తాయని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు సందీప్ శాస్త్రి హెచ్చరించారు.