ఎన్నికల వ్యూహకర్తగా పలువురు ప్రముఖ నాయకులు, రాజకీయ పార్టీలు ఎన్నికలలో ఘన విజయాలు సాధించి, ప్రభుత్వాలు ఏర్పర్చడంలో కీలకంగా వ్యవహరించిన ప్రశాంత్ కిషోర్ మాత్రం తన రాజకీయ భవిష్యత్ విషయంలో తికమక పడుతున్నారు. గత ఏడాది పశ్చిమ బెంగాల్ ఎన్నికలలో మమతా బెనర్జీ మూడోసారి తిరిగి ఎన్నిక కావడంలో కీలకంగా వ్యవహరించి, ఫలితాలు రాగానే ఇక తాను ఎన్నికల వ్యూహకర్తగా ఉండబోనని ప్రకటించారు.
తానే రాజకీయ ప్రవేశం చేయబోతున్నట్లు సంకేతాలు ఇచ్చారు. ఆ తర్వాత బిజెపికి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలతో కూటమి ఏర్పాటు అని ఒక సారి, కాంగ్రెస్ నేతృత్వంలో కూటమి అంటూ మరో సారి కొన్ని ప్రయత్నాలు చేశారు. చివరకు కాంగ్రెస్ పార్టీలో చేరి, ఆ పార్టీని 2024లో అధికారంలోకి తీసుకు వచ్చేందుకు కృషి చేయబోతున్నట్లు చెప్పారు. అందుకోసం ఓ పెద్ద ప్రణాళిక తయారు చేసి, ఆ పార్టీ అగ్రనాయకులతో వరుస భేటీలు జరిపారు.
ఏమయిందో గాని, ఆ పార్టీలో చేరడం లేదని ప్రకటించారు. గత వారం తానే ఓ రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి, బీహార్ నుండి తన ప్రయాణం పూర్తి చేయబోతున్నట్లు ప్రకటించారు. కానీ, ఇప్పుడు తాను వెంటనే పార్టీ పెట్టడం లేదని స్పష్టం చేశారు. అయితే, తన జీవితాన్ని బీహార్ అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు.
ప్రస్తుతం రాజకీయ పార్టీ పెట్టే ఆలోచన లేదని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బుధవారం ప్రకటించారు. తన సొంత రాష్ట్రమైన బీహార్ పురోగతి కోసం తన జీవితాన్ని అంకితం చేయనున్నట్లు వెల్లడించారు. అక్టోబర్ 2 నుండి 3వేల కిలోమీటర్ల పాదయాత్రను ప్రారంభించనున్నట్లు తెలిపారు. గురువారం ఆయన మీడియా సమావేశం నిర్వహించి తన భవిష్యత్తు కార్యాచరణను వెల్లడించారు.
అక్టోబరు 2న గాంధీ జయంతిని పురస్కరించుకుని పశ్చిమ చంపారన్‌లోని గాంధీ ఆశ్రమం నుంచి పాదయాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 3వేల కి.మీల పాదయాత్ర కొనసాగుతుందని పేర్కొన్నారు. ప్రజలను నేరుగా కలుసుకోవాల్సిన సమయం వచ్చిందని, అందుకు మార్గం ‘జన సురాజ్’ అని తెలిపారు.
వీలైనంత ఎక్కువమంది ప్రజలను కలుసుకోనున్నానని చెప్పారు. బీహార్‌లో ”కొత్త ఆలోచన, కొత్త ప్రయత్నం” (నయా సోచ్, నయా ప్రయాస్) తీసుకురావడం తన మిషన్‌లో భాగమని వెల్లడించాయిరు. రాష్ట్ర పురోభివృద్ధి కోసం పనిచేయాల్సిన అవసరం ఉందని, బీహార్ ఇప్పటికీ ఇతర రాష్ట్రాల కంటే చాలా వెనుకబడి ఉందని పేర్కొన్నారు. లాలూ, నీతీష్ల పాలనలో రాష్ట్రం ఏ మాత్రం పురోగతి సాధించలేదని, అందుకే వచ్చే మూడు, నాలుగేళ్లు ప్రజలను కలుస్తానని తెలిపారు.
ఇంటింటికీ వెళ్లి క్షేత్రస్థాయిలో సమస్యలను తెలుసుకుంటానని, వారి అభిప్రాయాలు ప్రత్యక్షంగా తెలుసుకుంటానని చెప్పారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలోని వివిధ రంగాలకు చెందిన 17వేల నుంచి 18వేల మంది ప్రముఖులను కలిసి మాట్లాడనున్నట్లు ఆయన వివరించారు. వారి నుంచి సమస్యలు, అభిప్రాయలు తెలుసుకోనున్నట్లు చెప్పారు. ఒకవేళ తమ సమస్యల పరిష్కారం కోసం ఓ రాజకీయ వేదిక కావాలని బీహార్ ప్రజలు కోరకొంటే.. అప్పుడు పార్టీ గురించి ఆలోచిస్తానని చెప్పారు.