దేశంలో వివిధ ప్రాంతాలలో మావోయిస్టుల ఉనికిని దెబ్బతీయడంలో విశేషంగా విజయాలు సాధిస్తున్నకేంద్ర భద్రతా బలగాలను దెబ్బతీసేందుకు మావోస్టులు తాజాగా సమకూర్చుకున్న మారణాయుధం ‘దేశీ’ వారిలో ఖంగారు పుట్టిస్తున్నది. ఈ ఆయుధం పేరు బారెల్ గ్రెనేడ్ లాంచర్ (బిజిఎల్).
ఇంతకుముందు ఒక రోజులో 5-10 బిజిఎల్లను మాత్రమే కాల్చగలిగిన నక్సలైట్లు ఇప్పుడు స్వదేశీ మోడల్ వచ్చిన తర్వాత ఒక్క రాత్రిలో భద్రతా దళాలపై, ముఖ్యంగా సిఆర్పిఎఫ్ క్యాంపులపై 150-200 బిజిఎల్లను కాల్చగలుగుతున్నట్లు తెలుస్తున్నది.
గతంలో భద్రతా దళాలు లేదా పోలీసుల నుండి ఎత్తుకెళ్లిన బిజిఎల్ లను పరిమితంగానే ఉపయోగించేవారని, కానీ ఇప్పుడు వారే స్థానికంగా తయారు చేసుకో గలగడంతో ఎక్కువగా ప్రయోగించ గలుగుతున్నారని తెలుస్తున్నది.
దానితో సిఆర్పిఎఫ్ నక్సల్ ప్రభావిత రాష్ట్రాల పోలీసులతో సహా వివిధ భద్రతా సంస్థలు ఇప్పుడు ‘బిజిఎల్’ స్థానిక నమూనా లోగుట్టు వేలుకి తీయడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. దీనితో 200 మీటర్ల వరకు లక్ష్యాన్ని ఛేదించే అవకాశం ఉన్నందున ఎక్కువగా భద్రతా దళాల నుండి రాత్రివేళ తప్పించుకునేందుకు ఉపయోగిస్తుంటారు.
దీనిని ఎవ్వరు తయారు చేశారు? ఎక్కడెక్కడ తయారు చేస్తున్నారు? ముడిసరుకు ఎక్కడి నుంచి వస్తోంది? కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఆయుధాన్ని ఉత్తరప్రదేశ్, బీహార్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో ఎక్కడో తయారు చేస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
ఓ సీనియర్ సిఆర్పిఎఫ్ అధికారి ప్రకారం, కాల్పుల సమయంలో స్వదేశీ ‘బిజిఎల్’ చాలాసార్లు గురి తప్పుతుంది. ఘటనా స్థలం నుంచి భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్న బీజీఎల్లను బట్టి అవి స్థానిక స్థాయిలో తయారవుతున్నట్లు తెలిసింది. దాని తయారీలో పలుచని ఇనుప షీట్ ఉపయోగిస్తున్నారు.
ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లో లభించిన బీజీఎల్ల బారెల్స్‌ను సైకిల్ ఎయిర్ పంప్‌తో తయారు చేశారు. ఈ ఆయుధంలోని అన్ని భాగాలు ఒకే వ్యక్తి తయారు చేసినవి కావు. వీటిని వివిధ ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు.
బస్తర్ సహా అనేక ప్రాంతాల్లో నక్సలైట్లు బీజీఎల్‌ను ఉపయోగించారు. కేంద్ర బలగాలతో పాటు పోలీసు శిబిరంపై కూడా ఇదే అస్త్రం ప్రయోగించారు. సుక్మాలోని కిస్టారం ప్రాంతంలో ఉన్న పొత్కపల్లి క్యాంపు వద్ద సుమారు ఒకటిన్నర డజను బిజిఎల్ లను నక్సలైట్లు కాల్చారు. బీజాపూర్‌లోని ధర్మారం క్యాంపుపై కూడా బీజీఎల్ దాడి జరిపారు.