పశ్చిమ బెంగాల్ లో రెండు రోజుల పర్యటనకు వచ్చిన కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా తన చివరి మజిలీగా టీం ఇండియా మాజీ కెప్టెన్, బిసిసిసి ప్రస్తుత అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఇంటికి వెళ్లి, విందు ఆరగించడం రాజకీయ వర్గాలలో ఆసక్తి కలిగిస్తున్నది. గంగూలీ బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం అవుతుందన్న కధనాలు వెలువడుతున్నాయి.
అయితే అటువంటి కథనాలను గంగూలీ కొట్టిపారవేసారు. కేవలం మర్యాదపూర్వక కలయిక మాత్రమే అని స్పష్టం చేశారు. అమిత్ షా మర్యాదపూర్వకంగా తన ఇంటికి విచ్చేశారని, ఇందులో ఎలాంటి రాజకీయ కోణం లేదని గంగూలీ వివరించారు.
అమిత్ షా కుమారుడు జయ్ షా బీసీసీఐ హానరరీ సెక్రటరీగా కొనసాగుతుండగా, గంగూలీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. వీరిద్దరూ సహచరులు కావడంతో గంగూలీ ఇంటికి అమిత్ షా వెళ్లారని చెబుతున్నారు.
అమిత్ షాను చూసేందుకు గంగూలీ ఇంటి వెలుపల జనాలు పెద్ద సంఖ్యలో గుమిగూడారు. కారు ముందు సీట్లో ఉన్న అమిత్ షా జనాలకు అభివాదం చేస్తూ గంగూలీ ఇంట్లోకి వెళ్లారు. ఆ తర్వాత గంగూలీ కుటుంబ సభ్యులతో కలిసి విందు చేశారు.
విందు జరిగింది. విందు విశేషాలేమిటీ? అని విలేకరులు ప్రశ్నించగా అంతా శాఖాహారమే, విశేష మసాలాలేమీ లేవు , కావాలంటే తనిఖీ చేసుకోవచ్చు అని నవ్వుతూ గంగూలీ తెలిపారు.
తమ భేటీలో రాజకీయాంశాలు ప్రస్తావనకు రాలేదని గంగూలీ చెప్పారు. తాము మాట్లాడుకోవడానికి చాలా విషయాలు ఉన్నాయని చెబుతూ 2008 నుంచి అమిత్ షా తనకు తెలుసునని చెప్పారు. దశాబ్దకాలంగా అమిత్ షా తనకు తెలుసునని, పలుమార్లు కలుసుకున్నాం కూడా అని వివరించారు.
బెంగాల్లో ప్రతిసారీ ఎన్నికలప్పుడు గంగూలీ బిజెపిలో చేరుతున్నట్లు వార్తలు వెలువడటం వీటిని ఆయన ఖండించడం జరుగుతూ వస్తోంది. రాష్ట్రంలో దాదా వర్సెస్ దీదీ జరుగుతుందని గంగూలీ, మమత మధ్య ఎన్నికల రాజకీయ సమరం ఉంటుందని ప్రచారం జరుగుతూ వచ్చాయి. అయితే ఇదేదీ నిజరూపం దాల్చలేదు.
గత అసెంబ్లీ ఎన్నికల ముందు గంగూలీని బీజేపీలో చేరమని ఆహ్వానించారు. చేరితే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడానికి కూడా సిద్ధమయ్యారు. పశ్చిమ బెంగాల్ లో ప్రజాదరణ గల నాయకులు ఎవ్వరు పార్టీలో లేకపోవడంతో ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ధీటుగా ఢీకొంటున్నా అధికారంలోకి రావడం కష్టం అవుతున్నది.
అందుకు గంగూలీ విముఖత చూపడంతో, కనీసం పార్టీ ప్రచారంలో పాల్గొనమని కోరినా స్పందించలేదు. అయితే, వచ్చే ఏడాది బీసీసీఐ అధ్యక్ష పదవి ముగుస్తున్నందున, ఆ తర్వాత బీజేపీలో చేరమని కోరుతున్నామని, ఆ ప్రయత్నంలో భాగంగానే అమిత్ షా స్వయంగా ఆయన ఇంటికి వెళ్లారని వార్తా కథనాలు వెలువడ్డాయి.