బీజేపీ వారు కేంద్రంలో, ఢిల్లీలో ఉండి రిమోట్ కంట్రోల్ ద్వారా ఇక్కడ టీఆర్ ఎస్ పార్టీని నడపాలని చూస్తున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. పార్లమెంట్లో ప్రధాని మోదీ మూడు నల్లచట్టాలు ప్రవేశపెట్టినప్పుడు దానికి మద్దతుగా టీఆర్ ఎస్పార్టీ మద్దతు తెలిపిందని ఆయన గుర్తు చేశారు.
హనుమకొండలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో శుక్రవారం సాయంత్రం జరిగిన ‘రైతు సంఘర్షణ సభ’లో ఆయన మాట్లాడుతూ తెలంగాణను దోచుకున్న వ్యక్తితో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోదని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ను వచ్చే ఎన్నికల్లో ఓడిస్తాం. ఇది కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య ప్రత్యక్ష యుద్ధం అని ప్రకటించారు.
“బీజేపీకి తెలుసు తెలంగాణలో నేరుగా ప్రభుత్వం ఏర్పాటు చేసే శక్తి వారికి లేదు. అలాగే బీజేపీకి తెలుసు ఎప్పుడు కూడా ఈ భూ ప్రపంచం ఉన్న వరకు కాంగ్రెస్, బీజేపీతోని పొత్తు, ఒప్పందం ఉండదు. అందుకోసమే బీజేపీ వారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏర్పడొద్దని టీఆర్ ఎస్‌కు మద్దతు ఇస్తూ, వారికి మద్దతుగా నిలుస్తున్నారు” అని రాహుల్ ధ్వజమెత్తారు.
దీనికి సాక్ష్యం ఏంటంటే.. తెలంగాణ ప్రభుత్వం ఎంత అవినీతి చేసినా కేంద్ర ప్రభుత్వం ఈడీ ద్వారాగానీ, ఇతర దర్యాప్తు సంస్థల ద్వార గానీ విచారణ జరపడం లేదని రాహుల్ గుర్తు చేశారు. అదే వారి మధ్య ఒప్పందానికి నిదర్శనం అని విమర్శించారు. వారి ఒప్పందంలో భాగమే ఇదని స్పష్టం చేశారు.
కాగా, టీఆర్ఎస్, బీజేపీ నేతలతో లాలూచీ పడితే సహించేది లేదని, ఎంత పెద్ద నేతలైనా కాంగ్రెస్ నుంచి బయటకు పంపిస్తామని తమ పార్టీ నేతలను రాహుల్ హెచ్చరించారు. తెలంగాణ ఏర్పాటు అంత సులభంగా జరగలేదని చెబుతూ రాష్ట్రం కోసం ఇక్కడి తల్లులు తమ రక్తం, కన్నీరు ధారపోశారని గుర్తు చేశారు.
తెలంగాణ ఏ ఒక్కరి కోసం ఏర్పడలేదని, తెలంగాణ అనేది ప్రజల కల అని చెప్పారు. ప్రత్యేక తెలంగాణ ఎంతో మంది త్యాగంతో ఏర్పడిందని పేర్కొన్నారు. ‘‘తెలంగాణ ఏర్పడి ఎనిమిదేళ్లయినా అభివృద్ధి కలగానే ఉందని, తెలంగాణ వల్ల కేవలం ఒక్క కుటుంబానికే లబ్ధి జరిగింది” అని రాహుల్ విచారం వ్యక్తం చేశారు.
తెలంగాణ కన్న కల ఏమైంది? తెలంగాణ ప్రజలకు ఏం లాభం జరిగింది? నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చాయా?. భర్తలను కోల్పోయి రైతుల భార్యలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. రైతుల ఆత్మహత్యలకు బాధ్యులు ఎవరు? అని రాహుల్ ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల కలను నెరవేర్చింది కాంగ్రెస్ మాత్రమే అని స్పష్టం చేశారు.
తెలంగాణలో ఉన్నది ముఖ్యమంత్రి కాదు రాజులా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాజుకు ప్రజల సమస్యలు పట్టవని ఎద్దేవా చేశారు. ఛత్తీస్‌గడ్‌లో ఎన్నికల ముందు రెండు వాగ్ధానాలు చేశాం. రైతుల రుణమాఫీ, పండించిన పంటకు కనీస మద్దతు ధర ఇచ్చామని ఆయన గుర్తు చేశారు.
తెలంగాణ ఏర్పాటు వల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందని తెలుసు. అయినప్పటికీ రాష్ట్రం ఇచ్చామని రాహుల్ గుర్తు చేశారు. తెలంగాణ వచ్చాక, ప్రజా, రైతు, కార్మిక ప్రభుత్వం ఏర్పడుతుందని ఆశించామని, కనై ఇప్పుడు తెలంగాణలో ఉన్నది సీఎం కాదు. రాజరికం అని విమర్శించారు.
ముఖ్యమంత్రి ప్రజల మాట వింటారు.. రాజు ప్రజల మాట వినడని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తాం అని హామీ ఇచ్చారు. “మేం చెబుతున్నది ఉత్తుత్తి హామీలు కాదు. తెలంగాణ కల నెరవేర్చడంలో రుణమాఫీ తొలి అడుగు. ఇది కేవలం రైతు డిక్లరేషన్ కాదు.. రైతుల కోసం కాంగ్రెస్ ఇస్తున్న గ్యారంటీ” అని భరోసా ఇచ్చారు.
తెలంగాణలో ఉన్న ప్రతి రైతు కాంగ్రెస్ డిక్లరేషన్ చదవాలని కోరుతూ డిక్లరేషన్‌లో ఉన్న ప్రతి మాటకు కాంగ్రెస్ హామీ ఇస్తుందని, తెలంగాణ రైతులకు మెరుగైన జీవితాలను అందిస్తామని రాహుల్ చెప్పారు.