మరో ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న కర్ణాటకలో ఇప్పటికే ఓ సీనియర్ మంత్రి, మాజీ ముఖ్యమంత్రి అవినీతి ఆరోపణలతో రాజీనామా చేయవలసి వచ్చింది. ఎస్ ఐల ఎంపిక కుంభకోణంలో మరో మంత్రి రాజీనామాకై ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. తాజాగా రూ 2,500 కోట్లు ఇస్తే సీఎం పోస్ట్ తనదే అని ఒకరు తనతో బేరాలు ఆడారని అంటూ ఓ ఎమ్యెల్యే చేసిన ఆరోపణ కలకలం సృష్టిస్తున్నది.
ముఖ్యమంత్రి పదవి కావాలంటే రూ.2500 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారని బిజెపి ఎమ్మెల్యే బసన్గౌడ యత్నాల్ ఆరోపించారు. అయితే ఎవరు ఈ డబ్బులు డిమాండ్ చేసిందీ ఆయన వెల్లడించలేదు. పార్టీలోని కొందరు ఏజెంట్లు తనను ఈ మొత్తం డిమాండ్ చేశారని, ఇవి ముట్టచెపితే ఏకంగా సిఎం కుర్సీ ఇస్తామన్నారని తెలిపారు.
ఇప్పటికే బీజేపీ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్షాలకు ఈ ఆరోపణ మరో ఆయుధం అందించి నట్లయింది. కర్ణాటక ముఖ్యమంత్రి పదవి వేలానికి పెట్టారా? డబ్బులిస్తే చాలు…ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టేస్తారా? అని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బీజేపీని సూటిగా నిలదీశారు.
”ఇది చాలా సీరియస్ అంశం. దీనిపై సరైన దర్యాప్తు జరిగితేనే నిజం వెలుగుచూస్తుంది. సీఎం పదవి పేమెంట్ సీటా?” అని సిద్ధరామయ్య ప్రశ్నించారు. బీజేపీలో లెజిస్లేచర్ పార్టీనే ముఖ్యమంత్రిని ఎన్నుకుంటుందనే అభిప్రాయం ప్రజల్లో ఉందని, అయితే సీఎం సీటు వేలం ద్వారా అమ్ముతారని యత్నాల్ వెల్లడించారని ఎద్దేవా చేశారు.
బీజేపీ గత సీఎంలు కూడా ఆ పదవి కోసం ఎంత మొత్తం ఖర్చుపెట్టారనే వ్యవహారంపై కూడా దృష్టి సారించాల్సి ఉందని పేర్కొన్నారు. మంత్రుల పదవులతో పాటు ఇతర పదవులకు కూడా బీజేపీ రేట్లు పెట్టినట్టు తెలుస్తోందని ఆరోపించారు.
సివిల్ కాంట్రాక్టర్ల నుంచి 40 శాతం కమిషన్ల స్కాములు, యత్నాల్ ఆరోపణలకు లింక్ ఉన్నట్టు కనిపిస్తోందని ఉడిపి సివిల్ కాంట్రాక్టర్ ఆత్మహత్య ఘటనను ప్రస్తావిస్తూ తెలిపారు. ఇన్ని ఆరోపణలు వస్తున్నా బీజేపీ మౌనంగా ఎందుకు ఉంటోందని నిలదీశారు. అధిష్ఠానానికి తెలిసే ఇవన్నీ జరుగుతుండటమే ఈ మౌనానికి కారణమా అని సిద్ధరామయ్య సూటిగా ప్రశ్నించారు.