తెలంగాణకు కేంద్రం ఏం ఇచ్చిందని ప్రశ్నిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ నేతలు ఈ అంశంపై చర్చిద్దామంటే ఎందుకు మొఖం చాటేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. కేంద్రంపై ఏడుపు మానుకుని, టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ఏం ఒరగపెట్టిందో చెప్పాలని ధ్వజమెత్తారు.
ప్రజలు కట్టిన పన్నులతో సంపద పెంచుకుని రుణాలిచ్చే స్థాయికి చేరుకున్న కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని మాత్రం అప్పులు పాల్జేసి ప్రజల చేతికి చిప్ప మిగిల్చిందని మండిపడ్డారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా 26వ రోజు సోమవారం పాదయాత్ర చేస్తున్న సంజయ్ ఉదయం నుండి మధ్యాహ్నం వరకు జడ్చర్ల మండలం కోడుగల్, ముక్తపల్లి గేట్ వరకు పాదయాత్ర చేశారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలని టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ కలలు కంటున్నాయని ఎద్దేవా చేశారు. ఆ రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరిందని, కాంగ్రెస్ కు 31 అసెంబ్లీ, 4 ఎంపీ సీట్లు ఇవ్వాలని ఒఫ్పందం కుదిరిందని ఆరోపించారు. కానీ పైకి మాత్రం రెండు పార్టీలు డ్రామా చేస్తున్నయని పేర్కొన్నారు.
రాజ్యాంగం గురించి మాట్లాడే అర్హతే టీఆర్ఎస్ కు లేదని అంటూ సీఎం కేసీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తిరగరాస్తానని అన్నడు. ఒంటెద్దు పోకడలతో మతపరమైన రిజర్వేషన్లు కేసీఆర్ ఇస్తున్నడు. ఇది రాజ్యాంగంలో ఉందా? అని ప్రశ్నించారు.
ఉర్దూలో గ్రూప్-1 పరీక్ష రాసేందుకు అనుమతించడాన్ని తాము ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యతిరేకిస్తాం అని స్పష్టం చేశారు. దీని ద్వారా ఉద్యోగాలు పొందిన వ్యక్తులను బీజేపీ అధికారంలోకి వచ్చాక ఉద్యోగాల నుండి తొలగిస్తామని, మళ్లీ ఆయా ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ ఇస్తామని వెల్లడించారు.
టీఆర్ఎస్ పార్టీ ఎంఐఎంకు దాసోహమైందని ధ్వజమెత్తుతూ గ్రూప్ -1 పోస్టులను ఎంఐఎంకు దారాధత్తం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కో వ్యక్తిపై లక్ష అప్పు చేశారని, ఈరోజు ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు కూడా ఇచ్చే పరిస్థితి లేదని తెలిపారు. రాష్ట్ర ప్రజలు చెల్లిస్తున్న పన్నుల ద్వారా వచ్చిన ఆదాయం ఏం చేస్తున్నట్లు? రాష్ట్రాన్ని అప్పులు చేసి ప్రజల చేతికి చిప్ప మిగిల్చారని నిలదీశారు.
ప్రజా సంగ్రామ యాత్ర-2 ముగింపు సభతో బీజేపీ తెలంగాణలో ఒక చరిత్ర సృష్టించబోతున్నదని సంజయ్ ప్రకటించారు. రాష్ట్రంలో మార్పుకు ఈ సభ సంకేతం కాబోతోందని తెలిపారు.