సోనియా గాంధీ సారథ్యంలో రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరుగుతున్న మూడు రోజుల మేధోమథన సదస్సు ‘నవ సంకల్ప్ చింతన్ శిబిర్ ప్రధానంగా సంస్థాగతంగా పార్టీలో తీసుకు రావలసిన సంస్కరణలపై దృష్టి సారిస్తున్నది. ఈ విషయమై పార్టీ నేతలు చాలాకాలంగా మాట్లాడుతున్నా మొదటిసారి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నది.
ముఖ్యంగా పార్టీ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ నేతలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, యువ నాయకత్వాన్ని ముందు పెట్టడం ద్వారా బడుగు వర్గాలను, యువతను ఆకట్టుకునే ప్రయత్నం కనిపిస్తున్నది. సోనియా గాంధీ నియమించిన ‘సామజిక న్యాయం, సాధికారికత కమిటీ’ సిఫారసు మేరకు పార్టీలో అన్ని స్థాయిల్లోని పదవుల్లోనూ సామాజిక న్యాయం పాటించాలని నిర్ణయించినట్లు ఆ పార్టీ నేత కె. రాజు తెలిపారు.
ప్రైవేట్ రంగంలోనూ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించేందుకు జాతీయ స్థాయిలో ఒక విధానం తీసుకు రావాలని కూడా ప్రతిపాదిస్తున్నారు. రాజ్యసభ సభ్యునిగా ఒక పార్టీ నేతకు రెండుసార్లు మాత్రమే అవకాశం ఇవ్వాలని రాజకీయ నిర్మాణ కమిటీ ప్రతిపాదించింది. ఆపై వారు ఎన్నిసార్లయినా అసెంబ్లీ, లోక్‌సభకు పోటీ చేయొచ్చని చెబుతున్నారు.
అదే విధంగా, బ్లాక్, జిల్లా స్థాయి నుంచి ఏఐసీసీ వరకు ఆఫీస్ బేరర్లు తమ స్థానాల్లో ఐదేళ్లు మాత్రమే ఉంటారని ఆ నేత వెల్లడించారు. ఆపై ఆ స్థానాలకు వారు రాజీనామా చేసి.. పార్టీ అప్పగించే వేరే బాధ్యతల్లో కనీసం మూడేళ్లు పనిచేయాలని, ఆ తర్వాత తిరిగి ఆఫీ్సబేరర్గా ఎన్నిక కావచ్చునని వివరించారు.
సమాఖ్య సూత్రాన్ని పార్టీలో పా టిస్తూ.. రాష్ట్రాల పీసీసీలు సొంత నిబంధనావళిని తయారుచేసుకునే స్వేచ్ఛను ఇవ్వనున్నట్టు తెలిసింది. అయితే, ఇందుకు ఏఐసీసీ ఆమోదం పొందాలని చెబుతున్నారు. ప్రాంతీయ పార్టీలను కలుపుకొని వచ్చే ఎన్నికల్లో బీజేపీకి దీటైన రాజకీయ ప్రత్యామ్నాయంగా జాతీయస్థాయిలో ఎదగాలని కాంగ్రెస్ వ్యూహరచన చేస్తోంది.
ప్రాంతీయ పార్టీలతో సంబంధాలను మెరుగు పరచుకోవడం, రాష్ట్రాల్లో ఎక్కడికక్కడ సమీకరణాలకు సిద్ధపడటం.. అనే రెండు కోణాలనుంచి ఈ వ్యూహానికి తుది రూపు ఇచ్చే పనిలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తున్నది.
కనీస మద్దతు ధర హామీకై చట్టం
పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)కి గ్యారంటీ ఇవ్వడం కోసం చట్టం తీసుకురావాలని నిర్ణయించారు. రైతులను రుణ విముక్తులను చేయడమే పార్టీ లక్ష్యమని పార్టీ సీనియర్ నేత, హర్యానా మాజీ సీఎం భూపీందర్ సింగ్ హుడా వెల్లడించారు. చింతన్ శిబిర్‌లో ‘వ్యవసాయం, రైతులు’ అంశంపై ఏర్పాటైన గ్రూప్‌కు కన్వీనర్‌గా వ్యవహరించిన ఆయన పార్టీ నిర్ణయాలను మీడియాకు వివరించారు.
కేంద్రం వ్యవసాయ చట్టాలను మళ్లీ తెస్తే అడ్డుకుంటామని స్పష్టం చేశారు. స్వామినాథన్ కమిషన్ సిఫారసు చేసిన సీ2 ఫార్ములా ప్రకారం ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. రైతులను రుణ విముక్తులను చేసేందుకు ‘నేషనల్ ఫార్మ్ డెట్ రిలీఫ్ కమిషన్’ ఏర్పాటు అంశం కూడా పార్టీలో చర్చకు వచ్చిందని పేర్కొన్నారు.
లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థులను నిర్ణయించే కాంగ్రెస్ ఎన్నికల కమిటీ స్థానంలో కొత్తగా కాంగ్రెస్ పార్లమెంటరీ బోర్డును ఏర్పాటు చేయాలన్న పార్టీ అసమ్మతి నేతల కీలక డిమాండ్ కు కూడా చింతన్ శిబిర్ లో ఆమోదం తెలిపారు.