ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ పెట్టిన పోస్టుల వేడి మహారాష్ట్రలో రాజకీయ దుమారం రేపుతున్నాయి. మాజీ ఉపప్రధానిపై పెట్టిన పోస్ట్‌కు మరాఠీ నటి కేతకీ చితాలే (29)ను ఆదివారం థానే పోలీసులు అరెస్టు చేశారు. ఆమెను కోర్టులో హాజరుపరుచగా.. మే 18వ తేదీ వరకు పోలీసు కస్టడీలోకి తీసుకోవాలని కోర్టు వెల్లడించింది.
చితాలే తన ఫేస్బుక్ ప్రొఫైల్‌లో మరొక వ్యక్తిని ఉద్దేశిస్తూ మరాఠీ కవితను పోస్ట్ చేసింది. అది ఇంటి పేరు (పవార్) , వయస్సు (80)ను ప్రస్తావించింది. కానీ 81 ఏళ్ల ఎన్ సిపి నాయకుడు బాధపడుతున్న శారీరక రుగ్మతలను కూడా సూచిస్తుంది. “నరకం ఎదురు చూస్తున్నది”, “నీవు బ్రాహ్మణులను ద్వేషిస్తావు” వంటి పదాలు అందులో ఉన్నాయి కాగా, ఆమెపై మరో మూడు కేసులు నమోదయ్యాయి. ముంబైలో రెండు, అకోలా జిల్లాలో ఒక కేసును నమోదైనట్లు పోలీసులు తెలిపారు.
తాజాగా పూణేలో బీజేపీ మహారాష్ట్ర అధికార ప్రతినిధి వినాయక్ అంబేకర్‌పై ఎన్సీపీనేతలు, కార్యకర్తలు దాడి చేశారు. ఈ క్రమంలో వారు.. వినాయక్ అంబేకర్ చెంప చెళ్లుమనిపించారు. ఎన్సీపీ కార్యకర్తల దాడికి సంబంధించిన వీడియోను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ ట్విట్టర్లో పోస్టు చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
పాటిల్ ట్విటర్ట్ వేదికగా స్పందిస్తూ.. వినాయక్ అంబేకర్‌పై ఎన్సీపీ గుండాలు దాడికి పాల్పడ్డారు. బీజేపీ పార్టీ తరఫున ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. వినాయక్‌పై దాడి చేసిన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మరోవైపు.. శరద్ పవార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ స్పందిస్తూ భారత రాజ్యాంగం పౌరులకు భావ ప్రకటన స్వేచ్చను కల్పించందని ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదని స్పష్టం చేశారు. సీనియర్ రాజకీయవేత్తపై అనుచిత వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు.
కాగా, ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో శివసేన ‘శివ సంపర్క్ అభియాన్’ జరిగింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సభను ఉద్దేశించి ప్రసంగించారు. మహా వికాస్ అఘాడి ప్రభుత్వంపై దాడి చేయడానికి ప్రయత్నిస్తున్న బిజెపి, మహారాష్ట్ర నవనిర్మాణ సేన సహా వివిధ ప్రతిపక్ష పార్టీలపై ఎదురుదాడికి దిగారు.