పలు అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న ట్లు ఒక వంక కధనాలు వెలువడుతుండగా, మరోవంక గద్దె దించేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ పై స్వదేశంలో తిరుగుబాటుకు రంగం సిద్దమవుతున్నాయనే కధనాలు వెలువడుతున్నాయి. రెండున్నర నెలలకు పైగా ఉక్రెయిన్ పై జరుపుతున్న యుద్ధంలో భారీ నష్టాలు ఎదురు కావడంతో పాటు, ఆర్ధిక ఆంక్షల కారణంగా రష్యా కోలుకోలేని నష్టాలకు గురవుతూ ఉండడంతో ఆయన మద్దతు దారులలోనే అసహనం వ్యక్తం అవుతున్నట్లు చెబుతున్నారు.
వ్లాదిమిర్ పుతిన్ ను గద్దె దించేందుకు ఇప్పటికే తిరుగుబాటు మొదలైందని, దీనిని ఆపడం ఎవరి తరం కాదని ఉక్రెయిన్ మేజర్ జనరల్ కిరిలో బుడనోవ్ ఆరోపించారు. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం ఆగస్టు మధ్య లేదా ఈ ఏడాది చివరి నాటికి కీలక దశకు చేరుకుంటుందని ఆయన అంచనా వేస్తున్నారు.
ఉక్రెయిన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ చీఫ్ అయిన మేజర్ జనరల్ కిరిల్లో బుడనోవ్ ఇటీవల ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చాలో పుతిన్ క్యాన్సర్‌తో సహా అనేక తీవ్రమైన అనారోగ్యాలతో బాధపడుతున్నారని పేర్కొన్నారు. అంతే కాదు, రష్యా ఓడిపోతే పుతిన్‌ను అధికారానికి దూరం చేస్తారని, రష్యన్ ఫెడరేషన్ కూలిపోతుందని జోక్యం చెప్పారు.
ఈ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని ఉక్రేనియన్ మేజర్ జనరల్ పేర్కొన్నారు. అదే సమయంలో, పుతిన్‌పై తిరుగుబాటుకు సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయని, ఆ ప్రక్రియను ఇప్పుడు ఆపడం అసాధ్యమని ఆయన స్పష్టం చేశారు. తనకు ఈ సమాచారం అంతా ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి అందిందని చెబుతున్నప్పటికీ అందుకు నిర్దుష్టమైన సాక్ష్యాధారాలు ఏమీ ఇవ్వలేక పోయారు.
వాస్తవానికి, ఫిబ్రవరి చివరిలో ఉక్రెయిన్‌లో రష్యా సైనిక చర్య ప్రారంభం అయినప్పటి నుండి వ్లాదిమిర్ పుతిన్ ఆరోగ్య పరిస్థితిపై ప్రపంచవ్యాప్తంగా పలు కధనాలు ప్రచారంలోకి వచ్చాయి. అతని రూపురేఖలు, వ్యూహరచనలో దూసుకుపోతున్న తీరు కూడా ఆయన అనారోగ్యాన్ని సూచిస్తున్నాయని అంతర్జాతీయ పరిశీలకులు పేర్కొంటున్నారు.
‘‘ఉక్రెయిన్ యుద్ధం రష్యన్ ఫెడరేషన్ నాయకత్వంలో మార్పులకు కారణం అవుతోంది. ఈ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఆ దారిలోనే కొనసాగుతోంది. దీనిని ఆపడం అసాధ్యం” అని వెల్లడించారు. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయని, ఐరోపా రష్యాను పెద్ద ముప్పుగా చూస్తోందని, ఇన్నాళ్లూ అందరూ భావిస్తున్నట్టుగా రష్యా సూపర్ పవర్ అనేది అవాస్తవమని బహిర్గతమైందని బుడనోవ్ చెప్పారు.
ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. దీంతో కీవ్, ఖార్కివ్ లాంటి నగరాలను స్వాధీనం చేసుకోవాలన్న ప్రయత్నాలు నత్తనడకన సాగుతున్నాయి. అయితే పారిశ్రామిక ప్రాంతమైన డాన్బాస్ ఏరియాలో మాత్రం ఇరు వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో పోరాటం జరుగుతోంది.
కాగా, నాటోలో చేరేందుకు దరఖాస్తు చేసుకుంటామని ఫిన్లాండ్ మరోసారి స్పష్టం చేసింది. దీనిపై చర్చించేందుకు బెర్లిన్‌లో నాటో దౌత్యవేత్తలు సమావేశమయ్యారు. నాటోలో చేరే విషయంపై స్వీడన్ గవర్నింగ్ పార్టీ కూడా సానుకూలంగానే ఉంది. త్వరలోనే దీనిపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ పరిణామాలన్నీ ఐరోపాలో రష్యాకు సవాల్ గా మారనున్నాయి.
మరోవంక, పుతిన్ తీవ్ర అనారోగ్యం పాలయ్యారని బ్రిటన్ గూఢచారి క్రిస్టోఫర్ స్టీల్స్ వెల్లడించారు. అయితే ఆ అనారోగ్యం ఏమిటనేది స్పష్టంగా తెలియకపోయినా, ఆయన తీవ్ర అనారోగ్యం పాలయ్యారనేది నిజమని చెప్పారు. పుతిన్ బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారని ఆయన సన్నిహిత పారిశ్రామికవేత్త ఒకరు చెప్పారు.
రష్యా పారిశ్రామికవేత్త, పశ్చిమ దేశాలకు చెందిన పెట్టుబడిదారుతో మాట్లాడిన ఆడియో క్లిప్‌ను అమెరికాకు చెందిన న్యూలైన్స్ మ్యాగజీన్ విడుదల చేసింది. ఇందులో వారిద్దరూ పుతిన్ ఆరోగ్య పరిస్థితి గురించి చర్చించారు. ఉక్రెయిన్‌పై చొరబాటుకు కొద్దిరోజుల ముందు బ్లడ్ క్యాన్సర్‌కు సంబంధించి పుతిన్ సర్జరీ చేయించుకున్నట్టు ఆయన చెప్పారు.
పుతిన్ చనిపోవాలని అందరూ కోరుకుంటున్నారని, రష్యా, ఉక్రెయిన్ తోపాటు చాలా దేశాల ఆర్థిక వ్యవస్థను పుతిన్ దెబ్బతీశారని, తప్పుడు నిర్ణయాలతో ప్రపంచాన్ని తలకిందులు చేశారని చెప్పారు. అయితే పుతిన్ ఆరోగ్యంపై ఇప్పటి వరకు క్రెమ్లిన్ ఎలాంటి ప్రకటన చేయక పోవడం గమనార్హం.