ఈ దశాబ్దం చివరికి 6 జీ సేవలు ప్రారంభించాలని ఆకాంక్షిస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని ఆయన వెల్లడించారు. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో వర్చువల్ గా పాల్గొని ప్రసంగించారు.
దేశంలో 5జీ రాకతో ఇంటర్నెట్ వేగం మాత్రమే కాదు అభివృద్ధిలో కూడా వేగం పెరుగుతుందని, అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులు రానున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. 5జీ వల్ల దేశ పరిపాలనా వ్యవస్థలో అనేక ప్రజారంజక మార్పులు వస్తాయని, దేశ ఆర్ధిక వ్యవస్థలో 450 బిలియన్ డాలర్లు వచ్చి చేరతాయని ప్రధాని వెల్లడించారు.
అంతేకాదు జీవన సౌలభ్యానికి, విధుల నిర్వహణ, వ్యాపారాలకు వెన్నుదన్నుగా నిలుస్తుందని చెప్పారు. 2జీ యుగంలో అనేక విధానపరమైన లోపాలు చోటు చేసుకున్నాయని, అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిందని విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక దేశంలో పారదర్శకతకు పెద్దపీట వేశామని చెబుతూ 4జీ సేవలు అందుబాటులోకి తెచ్చి 5జీ దిశగా వెళుతున్నామని ప్రధాని వివరించారు.
మన దేశంలో మొబైల్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లు నుంచి 200కు పెరిగాయని తెలిపారు. నేడు ప్రపంచంలో అతి పెద్ద మొబైల్ మాన్యుఫ్యాక్చరింగ్ కేంద్రంగా భారత్ మారిపోయిన్నట్లు ప్రధాని తెలిపారు. ఐఐటీ మద్రాస్ నేతృత్వంలో ఎనిమిది సంస్థలు కలిసి మన దేశంలో అభివృద్ధి చేసిన 5జి టెస్ట్ బెడ్‌ను మోదీ ప్రారంభించారు. టెలికాం ఇండస్ట్రీ, స్టార్టప్స్, పరిశోధకులు తమ నమూనాల పనితీరును ఈ టెస్ట్ బెడ్లో పరీక్షించుకోవచ్చు.