పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ నుంచి తృణమూల్ కాంగ్రెస్ లోకి చేరికల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా బెంగాల్ బీజేపీ ఉపాధ్యక్షుడు, బర్రాక్పోర్ లోక్‌సభా అభ్యర్థి అర్జున్ సింగ్ టీఎంసీ తీర్థం పుచ్చుకున్నారు.
పార్టీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ సమక్షంలో ఆయన తృణమూల్ కండువా కప్పుకున్నారు. దీనికి కొద్ది సమయం ముందు పార్టీ నాయకత్వం తనను పని చేయనీయడం లేదంటూ బీజేపీపై విమర్శలు గుప్పించారు. జనపనార క్వింటాల్ రూ 6,500లకు పరిమితం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తన నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకోవడంపై అర్జున్ సింగ్ తీవ్ర అసంతృప్తి చెందారు.
జూట్ మిల్లుల సమస్యను కొద్ది రోజులుగా అర్జున్ సింగ్ లేవనెత్తుతున్నారు. దీనికి కొంత మంది శాసనసభ్యుల మద్దతు కూడా ఉంది. ఈ విషయమై రాష్ట్ర బీజేపీ యూనిట్‌తో సైతం అర్జున్ సింగ్‌కు వివాదాలు తలెత్తాయి. అయితే కొద్ది రోజుల క్రితం ఈ విషయమై ఢిల్లీ పెద్దల్ని కలవడానికి వెళ్లినట్లు సమాచారం.
బీజేపీపై అసంతృప్తితో ఉన్న అర్జున్ సింగ్‌తో టీఎంసీ నేతలు కొంత కాలంగా చర్చలు జరుపుతున్నారు. పార్టీ మారే ప్రయత్నాల్ని ఆపేందుకు బీజేపీ బుజ్జగింపులు చేసినప్పటికీ అవి ఫలించలేదు. 2019 లోక్‌సభ ఎన్నికల ముందు టీఎంసీని వీడి బీజేపీకి వెళ్లిన అర్జున్ సింగ్.. మూడు ఏళ్లు తిరిగే సరికి సొంతగూటికి వచ్చారు.
“బీజేపీ ఫేస్బుక్, ఇతర సామాజిక మాధ్యమాలకే పరిమితమైంది. ఫేస్బుక్లో మాత్రమే రాజకీయాలు చేయడం సాధ్యం కాదు. బెంగాల్లో క్షేత్ర స్థాయిలో పనిచేయడం చాలా ముఖ్యం. తమ నాయకులు ఎయిర్ కండిషన్డ్ గదుల్లో కూర్చున్నందున బిజెపి ప్రజలతో సంబంధం కోల్పోతుంది” అంటూ బిజెపి నాయకత్వంపై విసుర్లు విసిరారు.
సింగ్ టిఎంసిలో చేరడంపై బిజెపి జాతీయ కార్యదర్శి అనుపమ్ హజ్రా స్పందిస్తూ, “ఎవరైనా తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాజకీయాలు చేయాలనుకుంటే, దాని గురించి మేము ఏమి చెప్పగలం? అయితే, ఇది భారీ నష్టం” అని పేర్కొన్నారు.
‘‘బీజేపీ, టీఎంసీల మధ్య ఇది పాత అవగాహన. మోదీ మనుషులు దీదీతో, దీదీ ప్రజలు బిజెపిలో చేరతారు. దీదీ పార్టీలోకి అవినీతి పరులందరూ చివరికి తిరిగి వస్తారు” అంటూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అధిర్ రంజన్ చౌదరి ఎద్దేవా చేశారు.
అర్జున్ సింగ్‌పై సిపిఎం నాయకుడు సుజన్ చక్రవర్తి మాట్లాడుతూ, “కొన్ని నెలల క్రితం, మమతా బెనర్జీ అతన్ని క్రిమినల్‌గా అభివర్ణించారు. ఆయనకు కుడివైపున టీఎంసీ, ఎడమవైపు బీజేపీ ఉన్నాయి. వాటి మధ్య ఊగిసలాడుతూనే ఉన్నారని విమర్శించారు.
బరక్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గంలో హిందీ మాట్లాడే ప్రజలు ఎక్కువగా జూట్ మిల్లుల్లో పని చేస్తారు. తృణమూల్ టికెట్‌పై ఈ ప్రాంతానికి చెందిన భారీ నేత అర్జున్ సింగ్ నాలుగుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు, బిజెపిలో చేరి, తీవ్రమైన పోటీలో బలమైన నాయకుడైన టిఎంసి అభ్యర్థి దినేష్ త్రివేదిని ఓడించారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత బారక్పూర్ నియోజకవర్గం బిజెపి, టిఎంసి మద్దతుదారుల మధ్య అనేక హింసాయుత ఘర్షణలు జరిగాయి.