`రైతు ఫ్రెండ్లీ’ ప్రభుత్వలంటే కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి అసలు గిట్టదని ఆరోపిస్తూ కేంద్రం అనుసరిస్తున్న రైతు విధానాలకు వ్యతిరేకంగా దేశంలోని రైతులందరూ ఏకతాటిపైకి రావాలని తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పిలుపిచ్చారు. రైతులను ఏదో విధంగా ఇబ్బందులకు గురిచేయాలని కేంద్రం చూస్తోందని విమర్శించారు
చండీగఢ్‌లోని ఠాగూర్ ఆడిటోరియంలో రైతు ఉద్యమంలో మరణించిన రైతు కుటుంబాలను, గాల్వాన్ సరిహద్దు ఘర్షణల్లో అమరులైన సైనిక కుటుంబాలను సీఎం కేసీఆర్ ఆదివారం పరామర్శించారు. ఈ సందర్భంగా 600 కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ 3 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించారు. కార్యక్రమంలో పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా పాల్గొన్నారు.
ప్రభుత్వాలను మార్చే శక్తి రైతులకు ఉందని చెబుతూ తాము ఒంటరయ్యామని రైతు కుటుంబాలు ఆందోళన చెందవద్దని, తామంతా అండగా ఉన్నామని కేసీఆర్ పూర్తి భరోసానిచ్చారు. దేశ వ్యాప్తంగా రైతులు చేసే ఉద్యమానికి తమ ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని, వాటికి మద్దతిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు.
కేంద్ర సర్కార్ వ్యవసాయంపై ఇప్పటికీ ఆంక్షలు విధిస్తుందని కేసీఆర్ మండిపడ్డారు. సాగుకు ఉచితంగా విద్యుత్ ఇస్తుంటే మీటర్లు పెట్టాలని అంటోందని ధ్వజమెత్తారు. బిజెపిని ప్రశ్నిస్తే దేశద్రోహులు అనే ముద్ర వేస్తున్నారని విమర్శించారు. రైతుల పోరాటానికి తాము సంపూర్ణ మద్దతు ఇచ్చిన విషయాన్ని కెసిఆర్ గుర్తు చేశారు.
దేశానికి అన్నం పెడుతున్న రైతులను బజార్‌కు ఈడ్చిన దిక్కుమాలిన చరిత్ర కేంద్రంలోని బిజెపి సర్కార్‌దేనని కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కార్పొరేట్ సంస్థలను నెత్తిన పెట్టుకుని రైతులను అరికాళ్లతో అణగదొక్కేందుకు యత్నిస్తున్న మోదీ ప్రభుత్వానికి తగు రీతిలో బుద్ధి చెప్పేందుకు ఇంకా ఎంతోకాలం పట్టదని స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వంపై దేశ వ్యాప్తంగా ప్రజలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారని తెలిపారు.
షహీద్ భగత్ సింగ్ స్వాతంత్య్రం కోసం పోరాడిన వ్యక్తి. అలాంటి గొప్ప వ్యక్తిని కన్న రాఫ్ట్రం పంజాబ్. దేశానికి పంజాబ్ రాష్ట్రం గొప్ప సేవలు చేసింది. వాటిని ఎవ్వరూ మరిచిపోలేరని కొనియాడారు. దేశవ్యాప్తంగా అన్నపానాదులకు కష్టంగా ఉన్న సమయంలో హరిత విప్లవాన్ని తీసుకొచ్చారని, ఆ సమయంలో పంజాబ్ రైతులు దేశానికి అన్నం పెట్టారని గుర్తు చేశారు.
ఇంత గొప్ప సేవలు చేసిన పంజాబ్ రైతులను మరిచిపోరని, వారి సేవలు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించవచ్చని తెలిపారు. నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు పోరాటం చేస్తే వారిని ఖలిస్తాన్ ఉగ్రవాదులంటూ ఆరోపణలు చేశారని మండిపడ్డారు. కనీస మద్దతు ధర విషయంలో ఏ ప్రభుత్వమైతే చట్టబద్ధత కల్పిస్తుందో వారికే మద్దతివ్వాలని కేసీఆర్ పిలుపిచ్చారు. ఇంతటి ఐక్యత దేశ వ్యాప్త రైతుల్లో రావాలని చెప్పారు.
రైతుల ఉద్యమం పంజాబ్, హరియాణాకు చెందినది కాదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. యావత్ దేశ ప్రయోజనాల కోసం రైతులు పోరాడారని ఆయన పేర్కొన్నారు. రైతుల ఉద్యమానికి చాలా రాష్ట్రాలు మద్దతు తెలిపాయని అంటూ ఆందోళనలో పాల్గొన్న రైతులకు ఢిల్లీ ప్రభుత్వం అండగా నిలిచిందని కేజ్రీవాల్ తెలిపారు.